Telugu Global
Andhra Pradesh

మహిళా కమిషన్ తో సోషల్ మీడియా వార్..

ఎంపీ నగ్న వీడియోకాల్ పై ఎందుకు వెంటనే స్పందించలేదని, గర్భిణులు చిన్నారులపై లైంగిక దాడి జరిగినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడికిపోయిందని, గంట, అరగంట వచ్చిపో అంటూ మంత్రులు మాట్లాడినప్పుడు మహిళా కమిషన్ ఏం చేస్తోందని నిలదీశారు జనసైనికులు.

మహిళా కమిషన్ తో సోషల్ మీడియా వార్..
X

పెళ్లి, విడాకులు, భరణం వ్యవహారంలో.. పవన్ కల్యాణ్ కి మహిళా కమిషన్ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలో అసలు రచ్చ మొదలైంది. రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు జరుగుతున్నప్పుడు అసలు మహిళా కమిషన్ ఎక్కడికిపోయిందని నిలదీస్తున్నారు జనసైనికులు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగిందా అని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న అత్యాచారాలపై ఎప్పుడైనా మహిళా కమిషన్ స్పందించిందా అంటూ సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.

అప్పుడు లేని పెద్దరికం..

గతంలో వైసీపీ నేతలు మహిళలను కించపరచిన సందర్భాలు, వారి మాటలు అన్నీ బయటకు తీస్తున్నారు జనసేన నేతలు. ఆ వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ మహిళా కమిషన్ ని ట్యాగ్ చేస్తున్నారు. అప్పుడు లేని పెద్దరికం ఇప్పుడెందుకని ప్రశ్నిస్తున్నారు. ఎంపీ నగ్న వీడియోకాల్ పై ఎందుకు వెంటనే స్పందించలేదని, గర్భిణులు చిన్నారులపై లైంగిక దాడి జరిగినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడికిపోయిందని, గంట, అరగంట వచ్చిపో అంటూ మంత్రులు మాట్లాడినప్పుడు మహిళా కమిషన్ ఏం చేస్తోందని నిలదీశారు. ఏపీ ఉమెన్ కమిషన్ ఎక్స్ పోస్డ్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ని కూడా ట్రెండ్ చేస్తున్నారు జనసేన నాయకులు.

మీకు కూతవేటు దూరంలోనే..

మహిళా కమిషన్ ఎక్కడ అంటూ జనసేన నాయకులు వేసిన ప్రశ్నలకు రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ కౌంటర్‌ గా మరో ట్వీట్‌ చేశారు. 'ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. మహిళా కమిషన్‌ ఎక్కడ అనే సందేహమెందుకు? జనసేన పార్టీ ఆఫీస్ కి కూతవేటు దూరంలోనే ఉంది. పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికైనా కళ్లు తెరిచి మహిళలకు క్షమాపణ చెబితే ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించినట్లే' అని ఆమె తన ట్వీట్లో పేర్కొన్నారు. విచిత్రం ఏంటంటే ఆ ట్వీట్ ని కూడా జనసైనికులు ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఆమె నెలకోసారి ట్వీట్ వేసేవారని, చివరిసారిగా రాఖీ సందర్భంగా ట్వీట్ చేశారని, ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మేల్కొన్నారని, కనీసం ఇలాగైనా ఆమె పనిచేస్తున్నట్టు తెలుస్తోందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మహిళా కమిషన్ ఎక్కడ అంటే.. తమరు ఇలా అర్థం చేసుకుని అడ్రస్ చెప్పారా అని సెటైర్లు వేస్తున్నారు. మొత్తమ్మీద మహిళా కమిషన్ కి జనసేన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

First Published:  24 Oct 2022 3:19 AM GMT
Next Story