Telugu Global
Andhra Pradesh

బాధితుల లిస్ట్‌లో చంద్రబాబు, లక్ష్మీపార్వతి..

ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు వ్యవహారం సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారుతోంది. పాత విషయాలను గుర్తు చేస్తూ చంద్రబాబుపై వైసీపీ విమర్శలు చేస్తుంటే, లక్ష్మీపార్వతి మౌనంపై టీడీపీ బ్యాచ్ మీమ్స్ తో విరుచుకుపడుతోంది.

బాధితుల లిస్ట్‌లో చంద్రబాబు, లక్ష్మీపార్వతి..
X

ఉరుము ఉరిమి అత్త అల్లుడిపై పడింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుని రాష్ట్ర ప్రభుత్వం మార్చిన సందర్భంలో సహజంగా జగన్ అందరికీ టార్గెట్ అవుతారనుకున్నారు. కానీ అంతకు మించిన స్థాయిలో బాబు, లక్ష్మీపార్వతి సోషల్ మీడియాకు బలయ్యారు. సంబంధం ఉన్నా, లేకపోయినా.. బాధితులు మాత్రం వీరిద్దరే అని స్పష్టమవుతోంది. పాత విషయాలను గుర్తు చేస్తూ చంద్రబాబుపై వైసీపీ విమర్శలు చేస్తుంటే, లక్ష్మీపార్వతి మౌనంపై టీడీపీ బ్యాచ్ మీమ్స్ తో విరుచుకుపడుతోంది.

వెన్నుపోటు..

సహజంగా ఎన్టీఆర్ జయంతి, వర్థంతి సందర్భంగా ఏపీలో వెన్నుపోటు ఎపిసోడ్ హైలెట్ అవుతుంది. కానీ ఈసారి మాత్రం హెల్త్ వర్శిటీ పేరు మార్పు చంద్రబాబుకి షాకిచ్చింది. ఎన్టీఆర్ పేరు మారుస్తారా అయన ప్రశ్నించగానే, అసలు మనిషినే తమరు మార్చేశారు కదా అని కౌంటర్లు పడ్డాయి. ఎన్టీఆర్ నుంచి పార్టీ లాగేసుకుని, వెన్నుపోటు పొడిచి, ఆయన మరణానికి కారణం అయిన చంద్రబాబుకి ఆయన పేరెత్తే అర్హత లేదంటున్నారు వైసీపీ నేతలు. తన హయాంలో పథకాలన్నిటికీ చంద్రన్న అనే తోక తగిలించారని, ఎన్టీఆర్ పై అభిమానం ఉంటే ఆయన పేరు పెట్టొచ్చుకదా అని లాజిక్ తీస్తున్నారు. అప్పట్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరెందుకు మార్చారని, ఇప్పుడు యూనివర్శిటీ పేరు మారిస్తే అంతలా గింజుకోవడం ఎందుకని మండిపడుతున్నారు.

ఆయన కలలోకొచ్చారు..

ఇక లక్ష్మీపార్వతి వ్యవహారం మరోలా ఉంది. యార్లగడ్డ వంటివారు గతంలో జగన్‌తో సర్దుకుపోయినా ఇప్పుడు పేరు మార్పు వ్యవహారంలో విభేదించి తన పదవులకు రాజీనామా చేశారు. లక్ష్మీపార్వతి మాత్రం ఇప్పటి వరకూ ఈ వ్యవహారంపై స్పందించలేదు. దీంతో ఆమెపై టీడీపీ బ్యాచ్ మీమ్స్ తో విరుచుకుపడుతోంది. రాత్రి ఆయన కలలోకి వచ్చారని, యూనివర్శిటీ పేరు మారుస్తున్నామని చెప్పానని.. ఏం పర్లేదు నీ గుండెలో నేనుంటే చాలు అని దీవించారని.. ఇలా లక్ష్మీపార్వతి మీడియాకు చెబుతున్నట్టు.. రకరకాలుగా ఆమె ఫొటో పెట్టి వైరల్ చేస్తున్నారు.

పేరు మార్పు వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారుతోంది. రెండు బ్యాచ్‌లు తమ వాదన కరెక్ట్ అని చెప్పడానికి రకరకాల ఉదాహరణలు తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో అసలు మీరేం చేశారంటే మీరేం చేశారంటూ.. విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. అనూహ్యంగా చంద్రబాబు, లక్ష్మీపార్వతి మాత్రం సోషల్ మీడియాకి కామన్‌గా బుక్కయ్యారు.

First Published:  23 Sep 2022 2:05 AM GMT
Next Story