Telugu Global
Andhra Pradesh

లోకేష్‌కు భయం పరిచయమయ్యిందా?

లోకేష్‌కు భయం అంటే ఏమిటో జగన్ పరిచయం చేశారేమో అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఏపీలోకి ఎంటరైతే అరెస్టు చేస్తారనే భయంతోనే లోకేష్ ఢిల్లీలో కూర్చున్నట్లు ప్రచారంలో ఉంది.

లోకేష్‌కు భయం పరిచయమయ్యిందా?
X

యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తరచూ ఒక మాటనేవాడు. అదేమిటంటే ‘టీడీపీ అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డికి భయాన్ని పరిచయం చేసే బాధ్యతను లోకేష్ తీసుకుంటాడు’ అని. అన్నీ విషయాలను ఎర్రబుక్కులో రాసుకుంటున్నట్లు కూడా చెప్పేవాడు. సీన్ కట్ చేస్తే గడచిన ఎనిమిది రోజులుగా లోకేష్ ఏపీని వదిలేసి ఢిల్లీలోనే ఉంటున్నాడు. ఢిల్లీలో ఏమి చేస్తున్నాడో ఎవరికీ తెలియ‌దు. ఎందుకంటే లోకేష్‌ను కలవటానికి జాతీయ పార్టీల అధినేతలు ఎవరూ ఇంట్రస్ట్‌ చూపటంలేదట.

అలాగే అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యంకావటంలేదని పార్టీలోనే టాక్ నడుస్తోంది. నేషనల్ మీడియాతో మాట్లాడి చంద్రబాబుకు సానుభూతి సంపాదించాలని చేసిన ప్రయత్నం కూడా ఫెయిలైంది. ఎలాగంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో జగన్ ప్రభుత్వం చంద్రబాబును ఇరికించిందని, సాక్ష్యాలు లేవని లోకేష్ డిబేట్లో వాదించాడు. అయితే యాంకర్ల ప్రశ్నలకు లోకేష్ నుండి సమాధానమే లేదు. సీమెన్స్ కంపెనీ డబ్బులు విడుదల చేయకుండానే ప్రభుత్వం ఎందుకు నిధులు విడుదల చేసిందని అడిగితే సమాధానం చెప్పలేకపోయారు.

కేబినెట్ నిర్ణయానికి ముందే డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లను ప్రభుత్వం ఎలా విడుదల చేసిందని అడిగితే సమాధానం చెప్పలేదు. ఇలాంటి ఎదురు దెబ్బలతో లోకేష్ తలబొప్పికట్టి తర్వాత మీడియా జోలికి వెళ్ళలేదు. అంటే మీడియాతో పనిలేక జాతీయ పార్టీల అధినేతలూ కలవనప్పుడు లోకేష్ ఢిల్లీలో కూర్చుని ఏం చేస్తున్నట్లు? ఇక్కడే లోకేష్ డైలాగులు ఎదురుతన్నినట్లు అర్థ‌మవుతోంది. లోకేష్‌కు భయం అంటే ఏమిటో జగన్ పరిచయం చేశారేమో అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఏపీలోకి ఎంటరైతే అరెస్టు చేస్తారనే భయంతోనే లోకేష్ ఢిల్లీలో కూర్చున్నట్లు ప్రచారంలో ఉంది. ఇపుడిప్పుడే ఏపీలోకి అడుగుపెట్టే అవకాశంలేదని సమాచారం.

జగన్ దెబ్బకు లోకేష్‌కు భయం పరిచయమవ్వటంతోనే ఏపీని వదిలేసినట్లు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. ఎప్పుడో అధికారంలోకి వచ్చినపుడు జగన్‌కు భయాన్ని పరిచయం చేస్తానని లోకేష్ సినిమా డైలాగులు చెప్పటం బాగానే ఉంది. మరి అధికారంలో ఉన్న జగన్ అప్పటివరకు ఏమిచేయాలి? జగన్ తనకు ఇప్పుడే భయాన్ని పరిచయం చేయగలరన్న చిన్న లాజిక్ మరచిపోవటం వల్లే లోకేష్ పాదయాత్రలో నోటికొచ్చినట్లు మాట్లాడారాని సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు వేస్తున్నారు.


First Published:  23 Sep 2023 4:28 AM GMT
Next Story