Telugu Global
Andhra Pradesh

స్కిల్ కేసులో అప్రూవర్.. బాబు పరిస్థితి ఏంటి..?

ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్‌ షా పై కూడా సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయన 13వ నిందితుడుగా ఉన్నారు. ఆయనే ఇప్పుడు అప్రూవర్ గా మారతానని కోర్టుకి తెలిపారు.

స్కిల్ కేసులో అప్రూవర్.. బాబు పరిస్థితి ఏంటి..?
X

చంద్రబాబు స్కిల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ13 నిందితుడుగా ఉన్న చంద్రకాంత్ షా.. తాను అప్రూవర్ గా మారుతున్నట్టు కోర్టుకి తెలిపారు. ఈరోజు కోర్టులో హాజరైన ఆయన తాను అప్రూవర్ గా మారుతున్నానని చెప్పారు. తదుపరి విచారణను ఏసీబీ కోర్టు జనవరి‌5కి వాయిదా వేసింది. చంద్రకాంత్ షా స్టేట్‌మెంట్‌ని జనవరి 5న ఏసీబీ కోర్టు రికార్డు చేసే అవకాశముంది.

షెల్‌ కంపెనీలు, బోగస్‌ ఇన్వాయిస్‌ ల ద్వారా స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం జరిగిందనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులతోపాటు, కొన్ని కంపెనీల ప్రతినిధులపై కూడా అభియోగాలున్నాయి. ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్‌ షా పై కూడా సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయన 13వ నిందితుడుగా ఉన్నారు. ఆయనే ఇప్పుడు అప్రూవర్ గా మారతానని కోర్టుకి తెలిపారు.

స్కిల్ స్కాంలో బోగస్‌ ఇన్వాయిస్‌ ల ద్వారా నిధులను ఎలా కొల్లగొట్టిందీ వివరిస్తూ చంద్రకాంత్ షా గుంటూరులోని న్యాయస్థానంలో 2022, జులై 23న 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో అప్రూవర్‌ గా మారేందుకు ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. తాను అప్రూవర్‌ గా మారేందుకు అనుమతి ఇచ్చి తనను ఈ కేసులో సాక్షిగా పరిగణించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గత నెలలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో చంద్రకాంత్‌ షా ను సీఐడీ గతంలో అరెస్టు చేయగా ఆయన బెయిల్‌ పై విడుదలయ్యారు.


First Published:  5 Dec 2023 10:46 AM GMT
Next Story