Telugu Global
Andhra Pradesh

స్కామ్ కోసమే స్కీమ్ పెట్టారా?

సీమెన్స్ కంపెనీ చెప్పినట్లుగా నిధులు విడుదల చేయకుండానే ప్రభుత్వం చేసిన రూ.371 కోట్ల విడుదలకు అప్పటి చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీలు అంగీకరించలేదు. అయితే వాళ్ళపై చంద్రబాబు ఒత్తిడిపెట్టి మరీ నిధులను విడుదల చేయించారు.

స్కామ్ కోసమే స్కీమ్ పెట్టారా?
X

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడైనా పథకాన్ని ప్రారంభించిన తర్వాతో లేకపోతే ఏదైనా అభివృద్ధి కార్యక్రమంలో అవినీతి జరగటం సహజమే. కానీ కుంభకోణం కోసమే పథకాన్ని ప్రారంభిస్తారా? చంద్రబాబునాయుడు చేసింది చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. విషయం ఏమిటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటులో కుంభకోణం జరిగిందని, అందుకు సూత్రదారి చంద్రబాబే అని సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

స్కిల్ సెంటర్‌కు సంబంధించి బయటపడుతున్న విషయాలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ పేరుతో జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీతో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం రూ.3300 కోట్ల ప్రాజెక్టులో కంపెనీ రూ.3 వేల కోట్లు గ్రాంట్ ఇస్తే, ప్రభుత్వం రూ.300 కోట్లను ఖర్చుపెట్టాలి. అయితే సీమెన్స్ కంపెనీ రూపాయి విడుదల చేయకపోయినా ప్రభుత్వం మాత్రం రూ.371 కోట్లు విడుదల చేసేసింది. ఇక్కడే జరిగిన అవినీతి బయటపడింది.

ఇంతకన్నా విచిత్రం ఏమిటంటే అవగాహన ఒప్పందం జరిగినప్పటికి అసలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటే జరగలేదు. మామూలుగా అయితే సెంటర్ పెట్టిన తర్వాత ఒప్పందం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఒప్పందం జరిగిన తర్వాత సెంటర్ ఏర్పాటైంది. అలాగే సీమెన్స్ కంపెనీ చెప్పినట్లుగా నిధులు విడుదల చేయకుండానే ప్రభుత్వం చేసిన రూ.371 కోట్ల విడుదలకు అప్పటి చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీలు అంగీకరించలేదు. అయితే వాళ్ళపై చంద్రబాబు ఒత్తిడిపెట్టి మరీ నిధులను విడుదల చేయించారు. తాము అంగీకరించకపోయినా చంద్రబాబు ఒత్తిడితో నిధులు విడుదల చేస్తున్నట్లు ఐఏఎస్ అధికారులు నోట్ ఫైల్లో స్పష్టంగా రాశారు.

విడుదలైన రూ.371 కోట్లు డిజీటెక్ అనే కంపెనీకి వెళ్ళి తర్వాత అనేక షెల్ కంపెనీలకు చేరిపోయింది. తీరా చూస్తే ప్రభుత్వానికి సీమెన్స్ కంపెనీకి మధ్య జరిగిన ఒప్పందం కూడా బోగస్సే. జర్మనీలోని సీమెన్స్ కంపెనీ హెడ్ ఆఫీసుకు తెలియకుండానే ఆ కంపెనీ ఇండియా ఎండీ కంపెనీ లెటర్ హెడ్స్‌ ఉపయోగించి తప్పుడు పేర్లతో ఒప్పందం చేసుకున్నారు. జరిగింది చూస్తుంటే స్కీమ్ లో స్కామ్ జరగలేదు. స్కామ్ కోసమే స్కీమ్ ను పెట్టినట్లు అర్థ‌మైపోతోంది.


First Published:  10 Sep 2023 4:46 AM GMT
Next Story