Telugu Global
Andhra Pradesh

'సిట్'తో అరెస్ట్ లు ఖాయమేనా..? జగన్ అంత ధైర్యం చేస్తారా..?

'సిట్' విచారణ చేపట్టి అరెస్ట్ లకు సిద్ధపడితే రాజకీయ ప్రతీకార చర్య అనే నింద వేయడానికి టీడీపీ రెడీగా ఉంది. ప్రత్యేకంగా చంద్రబాబు అవినీతి గురించి, లోకేష్ మామూళ్ల గురించి ప్రజలు చర్చించుకుంటారనుకోవడం భ్రమ.

సిట్తో అరెస్ట్ లు ఖాయమేనా..? జగన్ అంత ధైర్యం చేస్తారా..?
X

పడిపోతుంది.. చంద్రబాబుకి జైలు శిక్ష పడిపోతుంది.

ఖాయం, లోకేష్ జైలుకెళ్లడం ఖాయం.

టీడీపీలో చాలామంది పెద్దలకు ఇబ్బందులు తప్పవంటూ.. వైసీపీ నేతలు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. 'సిట్' విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఇక ఏపీలో రాజకీయం మారిపోతుందని అంటున్నారు. 'సిట్' విచారణతో నిజంగానే అన్ని మార్పులొస్తాయా..? చంద్రబాబు, లోకేష్ జైలుకి వెళ్తారా..?

సరిగ్గా ఎన్నికల ఏడాదిలో చంద్రబాబు, లోకేష్ జైలుకి వెళ్తే ఏమవుతుందో అందరికంటే ఎక్కువ జగన్ కి బాగా తెలుసు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా తమదే విజయం అని వైసీపీ ధీమాగా ఉంది. లక్షల కోట్లు బ్యాంక్ అకౌంట్లలో జమ చేసిన జగన్ ని కాదని, ప్రజలు తమకు ఎందుకు ఓట్లు వేస్తారనే విషయంపై ఇప్పటికీ టీడీపీలో క్లారిటీ లేదు. ఈ టైమ్ లో చంద్రబాబు, లోకేష్ అరెస్ట్ అయితే..? సింపతీ ఓట్లు.. వ్యవహారాన్ని తారుమారు చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం.

చంద్రబాబు, లోకేష్ అరెస్ట్ అయితే సింపతీ పెరిగిపోయి, టీడీపీకి బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుందని చెప్పలేం. అదే సమయంలో అరెస్ట్ ల వల్ల టీడీపీకి కొత్తగా వచ్చే నష్టమేమీ లేదనేది మాత్రం వాస్తవం. టీడీపీ కేడర్ భయపడి చెల్లాచెదురైపోతారనుకోడానికి అవకాశం లేదు. ఒకవేళ నిజంగానే టీడీపీ నాయకులు భయపడి వైసీపీలో చేరినా సర్దుబాటు చేయడం జగన్ కి కష్టమైన పనే. ఆ విషయం పక్కనపెడితే.. అమరావతి పేరుతో అవినీతి జరిగింది అనే ఆరోపణలకు ఆల్రడీ కౌంటర్లు పడుతున్నాయి. విశాఖకు రాజధాని తరలిపోకముందే కబ్జాలు, నిబంధనల ఉల్లంఘనలు.. అన్నీ జరిగిపోయాయని అంటున్నారు. వాటి సంగతేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

'సిట్' విచారణ చేపట్టి అరెస్ట్ లకు సిద్ధపడితే రాజకీయ ప్రతీకార చర్య అనే నింద వేయడానికి టీడీపీ రెడీగా ఉంది. దాదాపుగా ప్రతిచోటా ఇలాంటి అరెస్ట్ లు సహజంగా జరుగుతున్నవే కాబట్టి.. ప్రత్యేకంగా చంద్రబాబు అవినీతి గురించి, లోకేష్ మామూళ్ల గురించి ప్రజలు చర్చించుకుంటారనుకోవడం భ్రమ. కక్షగట్టి వారిని జగన్ జైలులో పెట్టించారనే ప్రచారమే ఎక్కువగా తెరపైకి వస్తుంది. టీడీపీ అనుకూల మీడియా ఆ పని సునాయాసంగా చేస్తుంది.

ఎలాగూ తమకు 175 ఖాయమని జగన్ చెబుతున్నారు. 25 లోక్ సభ సీట్లు వైసీపీవేనంటూ సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ దశలో 'సిట్' విచారణ అంటూ అరెస్ట్ ల జోలికెళ్తే, చంద్రబాబుపై లేనిపోని సింపతీ పెంచినట్టవుతుంది. ఆ విషయం జగన్ కి బాగా తెలుసు. అందుకే వైసీపీ నాయకులతో అరెస్ట్ లంటూ ముందుగానే టీడీపీని భయపెడుతున్నారు. మానసికంగా ఆ పార్టీ నేతల్లో భయం పెంచుతున్నారు.

First Published:  4 May 2023 10:36 AM GMT
Next Story