Telugu Global
Andhra Pradesh

షర్మిలా.. ఇన్ని అబద్ధాలా..?

2004-09 మధ్య వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. జాతీయస్థాయిలో బీజేపీని వ్యతిరేకించే బాధ్యత ఆ స్థాయి నేతలదే కానీ, వైఎస్సార్ ది కాదు.

షర్మిలా.. ఇన్ని అబద్ధాలా..?
X

అన్న జగన్మోహన్ రెడ్డిపై బురదజ‌ల్లేందుకు చెల్లెలు షర్మిల చాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా అబద్ధాలు చెప్పటానికి కూడా వెనకాడటంలేదు. తాను చెప్పింది నిజమనే భ్రమలో షర్మిల ఉన్నట్లున్నారు. అందుకనే నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు. తాజాగా అనంతపురం, తిరుపతిలో మాట్లాడినప్పుడు జగన్ తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు వారసుడు ఎలాగవుతారని ప్రశ్నించారు. షర్మిల వాదన ఏమిటంటే.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి తన తండ్రయితే మాటిచ్చి మోసంచేసే వ్యక్తి జగన్ అట.

అయితే ఇక్కడితే ఆమె ఆగుంటే బాగానే ఉండేది. ఇంకాస్త ముందుకెళ్ళి తన తండ్రి బీజేపీని వ్యతిరేకిస్తే తన అన్న అదే బీజేపీకి ఊడిగంచేస్తున్నాడు, బానిసత్వం చేస్తున్నాడని పెద్ద పెద్ద మాటలు చాలానే మాట్లాడేశారు. ఇక్కడ ఒక సందేహం ఏమిటంటే.. అసలు వైఎస్సార్ బీజేపీని ఎప్పుడు వ్యతిరేకించారు..? వైఎస్సార్ బీజేపీని వ్యతిరేకించే అవసరం కూడా ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే 2004-14 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏనే కేంద్రంలో అధికారంలో ఉంది.

అదే సమయంలో 2004-09 మధ్య వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. జాతీయస్థాయిలో బీజేపీని వ్యతిరేకించే బాధ్యత ఆ స్థాయి నేతలదే కానీ, వైఎస్సార్ ది కాదు. ఎందుకంటే.. వైఎస్సార్ ఏనాడూ జాతీయ రాజకీయాల జోలికి వెళ్ళలేదు. ఇక రాష్ట్రంలో చూస్తే అప్పట్లో అసలు బీజేపీకి పెద్దగా సీనే లేదు. 2004, 2009 ఎన్నికల్లో బీజేపీ గెలిచింది చెరో రెండుసీట్లు మాత్రమే. ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్సార్ కేవలం రెండుసీట్లలో మాత్రమే గెలిచిన బీజేపీని ఎందుకు పట్టించుకుంటారు..?

అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి వాస్తవం అలాగుంటే.. ఇప్పుడు షర్మిల మాత్రం నోటికొచ్చినన్ని అబద్ధాలు చెబుతున్నారు. తాను కాంగ్రెస్ లో చేరారు కాబట్టి, జగన్ కేంద్రప్రభుత్వంతో సఖ్యతగా ఉండటాన్ని తట్టుకోలేక బీజేపీకి ఊడిగంచేస్తున్నారని, బీజేపీకి బానిసత్వం చేస్తున్నారంటూ ఏదేదో మాట్లాడేస్తున్నారు. షర్మిల ఆరోపణలు, మాటలు విన్నతర్వాత అసలు ఆమెకున్న రాజకీయ పరిజ్ఞానంపైనే సందేహాలు పెరిగిపోతున్నాయి. వైఎస్సార్ కూతురన్న ఏకైక అర్హత తప్ప ఆమెకున్న అర్హతలు ఏమిటో షర్మిల వివరిస్తే బాగుంటుంది. జగన్ వైఎస్సార్ వారసుడు కాదని అంటున్న షర్మిల తాను నిజంగా వారసురాలేనా..?

First Published:  30 Jan 2024 5:53 AM GMT
Next Story