Telugu Global
Andhra Pradesh

లోకేష్ పాదయాత్ర కోసం జోరుగా షూటింగ్

పాదయాత్రలో పాల్గొనేవాళ్ళల్లో జోష్ నింపేందుకు ప్రత్యేకంగా పాటలు రాయించారు. ఆ పాటలను సినిమా షూటింగ్ పద్ధ‌తిలో భారీగా చిత్రీకరిస్తున్నారు.

లోకేష్ పాదయాత్ర కోసం జోరుగా షూటింగ్
X

జనవరి 27వ తేదీ నుండి మొదలుకాబోతున్న 4 వేల కిలోమీటర్ల లోకేష్ పాదయాత్రకు అవసరమైన ఏర్పాట్లు మొదలైపోయాయి. కుప్పంలో మొదలయ్యే పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగుస్తుంది. ఇందుకోసం లోకేష్ కేంద్రంగా బ్రహ్మాండమైన పాటలు రెడీ అవుతున్నాయి. పాదయాత్రలో పాల్గొనేవాళ్ళల్లో జోష్ నింపేందుకు ప్రత్యేకంగా పాటలు రాయించారు. ఆ పాటలను సినిమా షూటింగ్ పద్ధ‌తిలో భారీగా చిత్రీకరిస్తున్నారు.

టీడీపీకి ఎలాగూ సినిమా ఫీల్డులో మంచిపట్టుంది. సినిమాల్లో బిజీగా ఉండే ఎంతోమంది పార్టీలో కూడా పూర్తి యాక్టివ్‌గా ఉన్నారు. కాబట్టి పాటలు రాసేవాళ్ళకి, పాడేవాళ్ళకి కొదవలేనట్లే నటించేవాళ్ళని కూడా టీడీపీ కొత్తగా వెత్తుకోవాల్సిన అవసరం లేదు. పార్టీ ప్రచారం కోసం మొత్తం అన్నీ విభాగాల వాళ్ళు రెడీమేడ్‌గా దొరుకుతారు. కాబట్టి లోకేష్ పాదయాత్ర కోసం బ్రహ్మాండంగా పాటలు రాయించి రికార్డింగు కూడా చేయించేశారు.

ఇప్పుడు ఆ పాటల షూటింగే జరుగుతోంది. లోకేష్ పాదయాత్ర ఉద్దేశం, చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షత, పార్టీకి లోకేష్ వీర సైనికుడిలా ఎలా పనిచేస్తున్నారో తెలియచెప్సే పాటను ఒకటి షూట్ చేశారు. పాదయాత్ర బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలనేది చంద్రబాబు పట్టుదల. ఈ పాదయాత్రపైనే లోకేష్ భవిష్యత్తు ఉందని చంద్రబాబు అనుకుంటున్నట్లున్నారు. అందుకనే కుప్పం నుండి ఇచ్చాపురం వరకు చంద్రన్న దండులోని బాగా యాక్టివ్‌గా ఉండే వందలాది మంది కార్యకర్తలను ఇప్పటికే ఎంపిక చేశారు.

వీళ్ళుకాకుండా ప్రతి నియోజకవర్గంలోనూ కొందరు సీనియర్లు, ఎక్కువ మంది యువజన నేతలు లోకేష్‌తో పాటు పాదయాత్రలో పాల్గొనేట్లుగా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని యువత అంతా లోకేష్‌కు మద్దతుగా నిలబడిందని, టీడీపీతోనే నడుస్తోందని చెప్పుకోవాలన్నది అసలు ప్లాన్. 40 శాతం టికెట్లు యువతకే ఇస్తానని గతంలో చంద్రబాబు చేసిన ప్రకటన ఇందులో భాగమే. టికెట్లు ఆశచూపించి సీనియర్లు+యూత్‌ను లోకేష్ పాదయాత్రలో మమేకమయ్యేట్లు చూడాలన్నదే చంద్రబాబు ఆలోచన. మరి చంద్రబాబు ఆలోచన, లోకేష్ పాదయాత్ర ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.

First Published:  28 Nov 2022 6:12 AM GMT
Next Story