Telugu Global
Andhra Pradesh

కర్నూలుకు తరలనున్న హైకోర్టు.. కేంద్రం ఆశీస్సులు ఉన్నాయా?

ఆగస్టు తర్వాత ఏపీలో రాజధానుల బిల్లును ప్రవేశ పెట్టేందుకు జగన్ సర్కారు సిద్ధ‌పడుతోంది.

కర్నూలుకు తరలనున్న హైకోర్టు.. కేంద్రం ఆశీస్సులు ఉన్నాయా?
X

ఏపీలోని అధికార వైసీపీ ఇప్పటికీ మూడు రాజధానుల అంశంపై పట్టుదలగా ఉన్నది. గతంలోనే దీనిపై అసెంబ్లీలో బిల్లు పెట్టినా.. హైకోర్టులో కేసులు వేయడంతో దానిని ఉపసంహరించుకున్నది. దీంతో ప్రతిపక్ష టీడీపీ సహా ఇతర పార్టీలు పండగ చేసుకున్నాయి. కానీ, మొదటి నుంచి మూడు రాజధానులపై గట్టిగా నిలబడిన వైసీపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి ఆ బిల్లును ప్రవేశ పెట్టడానికి కృత నిశ్చయంతో ఉన్నది. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే సర్కారు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో బిజీగా ఉన్నది. దీంతో ఆగస్టు తర్వాత ఏపీలో రాజధానుల బిల్లును ప్రవేశ పెట్టేందుకు జగన్ సర్కారు సిద్ధ‌పడుతోంది.

రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్డీయేకు వైసీపీ మద్దతు కీలకమన్న విషయం తెలిసిందే. ద్రౌపది ముర్ముకు వైఎస్ జగన్ బేషరతుగా మద్దతు ఇచ్చారని అందరూ భావించారు. ఒక మంచి అవకాశాన్ని జగన్ కోల్పోయారని, ఏపీ పరంగా కొన్ని డిమాండ్లు చేసుంటే బాగుండేదనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ, ఏపీ సీఎం అలా బేషరతుగా మద్దతు ఏమీ ఇవ్వలేదని.. కీలకమైన రాజధానుల అంశంపై హామీ తీసుకున్న తర్వాతే ముర్ముకు మద్దతు ఇచ్చిన విషయం తాజాగా బయటకు వచ్చింది. ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే విషయంపై బీజేపీ అధినాయకత్వం స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది.

2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీకి సంబంధించి బీజేపీ 'రాయలసీమ డిక్లరేషన్' చేసింది. ఇందులో హైకోర్టును కర్నూలుకు తరలిస్తామనే అంశం కీలకమైనది. వాళ్లు ఇచ్చిన హామీనే వారి ముందు పెట్టి.. కర్నూలుకు హైకోర్టును తరలించాలనే డిమాండ్ నెరవేర్చమని కేంద్రంలోని పెద్దలను జగన్ కోరినట్లు సమాచారం. అదెలాగూ బీజేపీ ఇచ్చిన హామీనే కాబట్టి అధినాయకత్వం ఓకే అన్నట్లు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేనిదే హైకోర్టు తరలింపు కష్టం. కానీ, ఇప్పుడు కేంద్రమే సుముఖంగా ఉండటంతో ఇది జగన్ సాధించిన విజయమని చెప్పుకోవచ్చు.

హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలంటే పార్లమెంట్‌లో న్యాయశాఖ ప్రతిపాదనలు పెట్టాలి. అక్కడ ఓకే అన్న తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు ద్వారా పూర్తిగా ఆమోద ముద్ర లభించనున్నది. రాష్ట్రపతి ఎన్నికలను సవాలుగా తీసుకున్న బీజేపీకి.. వైసీపీ మద్దతు కీలకమైనది. అందుకే ఇదే విషయాన్ని వారి ముందు పెట్టి జగన్ మద్దతు ఇస్తానని చెప్పారు. దీనికి బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మార్గం సుగమమం అయ్యింది.

రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే వైసీపీ పలుమార్లు హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేరితే.. రాబోయే ఎన్నికల్లో ఆ ప్రాంతంలో రాజకీయ లబ్ది పొందినట్లే అని నాయకులు భావిస్తున్నారు. ఒకసారి కనుక హైకోర్టు కర్నూలుకు తరలిస్తే.. ఇక పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించడం పెద్ద కష్టం కాబోదని వైసీపీ అధినాయకత్వం భావిస్తున్నది. ఇటీవల ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కూడా మూడు రాజధానుల బిల్లును త్వరలోనే శాసన సభలో ప్రవేశ పెడతామని చెప్పారు. ఈసారి ఎలాంటి కోర్టు కేసులకు తావివ్వకుండా బిల్లును పెట్టి ఆమోదింప చేస్తామని అన్నారు.

ఏపీ హైకోర్టు రాజధానుల విభజన అంశంలో తుది తీర్పును ఇచ్చింది. సుప్రీంకోర్టులో దీనిపై అప్పీలు చేసుకునే అవకాశం ఉన్నా.. ఏపీ ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉండిపోయింది. అయితే, మూడు రాజధానుల బిల్లుకు సవరణలు చేసి.. పార్లమెంటులో ఆమోదింప చేయించుకోవాలని వైసీపీ భావిస్తున్నందు వల్లే.. సుప్రీంకోర్టుకు వెళ్లలేదని తెలుస్తున్నది. కేంద్రం కూడా రాజధానుల విషయంలో సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అందుకే ఆగస్టు తర్వాత రాజధానుల విషయంలో వైసీపీ ప్రభుత్వం దూకుడు పెంచనున్నది.

ముందుగా హైకోర్టును కర్నూలుకు తరలించడం ద్వారా రాజధానుల విషయాన్ని మొదలు పెట్టాలని భావిస్తోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఏపీ రాజధానుల విభజన అంశాన్ని వైసీపీ తెరపైకి తీసుకొని రానున్నది. కేంద్రం ఇప్పటికే ఇచ్చిన హామీతో జగన్ కూడా దూకుడు పెంచనున్నట్లు తెలుస్తున్నది.

Next Story