Telugu Global
Andhra Pradesh

కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల..! వైసీపీకి ఏమేరకు నష్టం?

కడప పార్లమెంట్ స్థానానికి సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మళ్లీ పోటీలో నిలిచారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ చేయబోతున్నారు. ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ప్రభావం నామమాత్రమే.

కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల..! వైసీపీకి ఏమేరకు నష్టం?
X

ఏపీ రాజకీయాల్లో షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండకపోవచ్చు అనే వాదన బలంగా వినపడుతోంది. అయితే కనీసం కడపలో అయినా వైసీపీ విజయాన్ని ప్రభావితం చేసేలా ఆమెను పోటీకి నిలబెడుతోంది కాంగ్రెస్. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల అంటూ ఎల్లో మీడియా ప్రచారం మొదలు పెట్టింది. ప్రస్తుతానికి ఇది ఫైనల్ కాకపోయినా త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈనెల 25న ప్రకటించే కాంగ్రెస్ జాబితాలో షర్మిల పేరు ఉంటుందని భావిస్తున్నారు.

అవినాష్ రెడ్డికి పోటీగా..

కడప పార్లమెంట్ స్థానానికి సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మళ్లీ పోటీలో నిలిచారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ చేయబోతున్నారు. ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ప్రభావం నామమాత్రమే. వైఎస్ కుటుంబ సానుభూతి పరుల ఓట్లు చీలే అవకాశం ఉందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇటీవల షర్మిలతో కలసి కనపడుతున్న వైఎస్ వివేకా కుమార్తె సునీత కూడా ఇక్కడ షర్మిల తరపున ప్రచారం చేసే అవకాశముంది. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని కార్నర్ చేస్తున్న సునీత, ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు వెనకాడరు.

షర్మిల ప్రభావం ఉంటుందా..?

తెలంగాణ రాజకీయాల్లో షర్మిల అడుగు పెట్టిన తర్వాత వైఎస్ఆర్ అభిమానులు ఆమెతో కలసి నడవాలని భావించారు. ఏపీలో కూడా వైఎస్ఆర్ అభిమానులు షర్మిల విజయాన్ని ఆకాంక్షించారు. కానీ ఆమె కాంగ్రెస్ తో చేతులు కలిపిన తర్వాత మాత్రం వైఎస్ఆర్ ని ఇష్టపడేవారంతా ఆమెకు దూరం జరిగారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి, జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమయంలో ఆమె మరింతగా జనంలో పలుచన అయ్యారు. ప్రస్తుతం షర్మిలను, చంద్రబాబు చేతిలో పావుగా భావిస్తున్నారు ఏపీ ప్రజలు. అందులోనూ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ తరపున ఎంత బలమైన నేత పోటీ చేసినా ఓటమి గ్యారెంటీ అనడంలో అతిశయోక్తి లేదు. షర్మిల విషయంలో మీడియా హడావిడి ఉంటుందే కానీ, ఎన్నికల రణ క్షేత్రంలో ఆమె ప్రభావం ఉండదని అంటున్నారు.

ఏపీసీసీ చీఫ్ గా షర్మిలకు అవకాశం ఇచ్చిన తర్వాత ఆమెను కాంగ్రెస్ రాజ్యసభకు పంపిస్తుందనే ప్రచారం కూడా గతంలో జరిగింది. అయితే షర్మిల పోటీలో ఉంటేనే ఏపీలో కాంగ్రెస్ కి కాస్తో కూస్తో ప్రచారం ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపుతున్నారు. ఆమె ప్రభావం ఎంత అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

First Published:  18 March 2024 11:53 AM GMT
Next Story