Telugu Global
Andhra Pradesh

షర్మిల సీబీఐ ఆఫీస్‌కు వెళ్లింది కాళేశ్వరం కోసమా? బాబాయ్‌ కేసు కోసమా?

వైఎస్‌ వివేకానందరెడ్డి హ‌త్య కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు వైఎస్‌ షర్మిల ఢిల్లీలో సీబీఐ డైరెక్టర్‌ను కలిశారని చెప్పారు. అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలకు వ్యతిరేకంగానే షర్మిల లిఖితపూర్వకంగా స్టేట్‌మెంట్ ఇచ్చారని రవి వివరించారు.

షర్మిల సీబీఐ ఆఫీస్‌కు వెళ్లింది కాళేశ్వరం కోసమా? బాబాయ్‌ కేసు కోసమా?
X

ఇటీవల వైఎస్ షర్మిల ఢిల్లీలో సీబీఐ డైరెక్టర్‌ను కలిశారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై తాను ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్టు ఆమె ఆరోజు వివరించారు. అయితే సీబీఐ వద్దకు వెళ్లడానికి మరో ప్రధాన కారణం ఉందన్న చర్చకు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తెరలేపారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి హ‌త్య కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు వైఎస్‌ షర్మిల ఢిల్లీలో సీబీఐ డైరెక్టర్‌ను కలిశారని చెప్పారు. అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలకు వ్యతిరేకంగానే షర్మిల లిఖితపూర్వకంగా స్టేట్‌మెంట్ ఇచ్చారని రవి వివరించారు. ఈ విషయాన్ని షర్మిల తన దగ్గరి వారికి చెప్పగా.. వారు తనకు చెప్పారని బీటెక్ రవి చెబుతున్నారు.

హత్యకు ముందు కడప ఎంపీ టికెట్ కోసం జరిగిన వివాదాన్ని షర్మిల ధృవీకరించినట్టు రవి చెబుతున్నారు. కడప ఎంపీ స్థానం మన కుటుంబం పరిధిలో లేకుండా పోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వస్తాయని.. కాబట్టి కడప ఎంపీగా పోటీ చేయాల్సిందిగా తనను వివేకానందరెడ్డి ఒప్పించారని, జగన్‌ అడిగినా పోటీకి సిద్ధమేనని చెప్పాల్సిందిగా సూచించారని.. అందుకు తాను ఓకే చెప్పానని షర్మిల తన స్టేట్‌మెంట్లో వెల్లడించారని బీటెక్ రవి చెబుతున్నారు. హత్యకు ఎంపీ స్థానంలో వచ్చిన గొడవే కారణమని పరోక్షంగా షర్మిల నిర్ధారించారని వెల్లడించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాస్కర్ రెడ్డి మోసం చేశారన్న ఆరోపణను కూడా ఆమె తన స్టేట్‌మెంట్‌లో సమర్ధించారని రవి వివరించారు. చివరకు చార్జీషీట్‌లో ఉన్న నిందితులు, అనుమానితుల పేర్లను ముందు ఉంచి వీరే హత్య చేసి ఉంటారని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. వారే హత్య చేసి ఉండేందుకు అవకాశం ఉందని షర్మిల చెప్పారని .. కాబట్టి త్వరలోనే అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల అరెస్ట్‌ ఖాయమని బీటెక్ రవి చెబుతున్నారు. తానుచెప్పిన విషయాలను షర్మిల ఖండిస్తే తాను బహిరంగంగా క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధమని బీటెక్ రవి సవాల్ చేశారు.

First Published:  13 Oct 2022 6:03 AM GMT
Next Story