Telugu Global
Andhra Pradesh

షర్మిల గురివింద డైలాగులు..

ఆయన వైసీపీలో ఉన్నప్పుడు షర్మిల కూడా ఆ పార్టీకోసం పని చేశారు. అప్పుడు బొత్స ఎలాంటివారో షర్మిలకు గుర్తు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

షర్మిల గురివింద డైలాగులు..
X

బొత్స సత్యనారాయణ తన తండ్రిలాంటివారని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు షర్మిల. గతంలో బొత్స, వైఎస్ఆర్ ని తిట్టిపోశారని, ఆ మాటకొస్తే వైసీపీలో ఉన్నవారు, జగన్ కేబినెట్ లో ఉన్నవారంతా రాజశేఖర్ రెడ్డిని తిట్టారని, అలాంటి వారిని జగన్ పక్కనపెట్టుకున్నారని అన్నారు. విజయమ్మను సైతం బొత్స అవమానించారని, ఆయన్ను తండ్రి సమానులని జగన్ అనడం కరెక్టేనా అని ప్రశ్నించారు.

గురివింద..

గతంలో జగన్ కాంగ్రెస్ ని వీడిన తర్వాత బొత్స వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విషయం నిజమే. అయితే ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ ని వీడి జగన్ తోనే ఉన్నారు. జగన్ కోసం పనిచేశారు, ఉత్తరాంధ్రలో వైసీపీని బలపరిచారు. మరి ఆయన వైసీపీలో ఉన్నప్పుడు షర్మిల కూడా ఆ పార్టీకోసం పని చేశారు. అప్పుడు బొత్స ఎలాంటివారో షర్మిలకు గుర్తు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. పోనీ ఇటీవల తెలంగాణలో షర్మిల వైఎస్సార్టీపీ పెట్టి కాంగ్రెస్ ని తిట్టిపోశారు, రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మళ్లీ అదే కాంగ్రెస్ లో చేరారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తిట్టిన రేవంత్ రెడ్డితో తో కలసిపోయారు. అంటే ఇక్కడ షర్మిల చెబుతున్నదొకటి, చేస్తున్నదొకటి అని అర్థం అవుతోంది. నెటిజన్లు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. గురివింద లాగా షర్మిల మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.

ఏపీ ఎన్నికల్లో షర్మిల ప్రచార ఉపన్యాసాలు వింటే ఇంత దిగజారిపోయారా, విలువల్ని ఇంతలా వదిలేశారా అనే అనుమానం రాకమానదు. గతంలో ఓ తెలుగు సినీ హీరోతో షర్మిలకు సంబంధాలున్నాయంటూ టీడీపీ నేతలు పుకార్లు సృష్టించారు. ఆ పుకార్లను ఎల్లో మీడియా హైలైట్ చేసింది. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి షర్మిలను ఓ రేంజ్ లో ట్రోల్ చేసింది, మానసికంగా వేధించింది, మహిళ అని కూడా చూడకుండా ఆమె పరువు తీసింది. కానీ అదే షర్మిలకు ఇప్పుడు ఏబీఎన్ అభిమాన ఛానెల్ అయింది, చంద్రబాబుని అధికారంలోకి తేవడం ఆమె తక్షణ కర్తవ్యం అయింది. చంద్రబాబుతో సహా ఎల్లో మీడియాని అప్పట్లో చెడామడా తిట్టిన షర్మిలకు ఇప్పుడు వారు పుణ్యాత్ములుగా కనపడటం నిజంగా వింత, విడ్డూరం. తన క్యారెక్టర్ ని అవమానించిన వారికోసం షర్మిల పనిచేస్తూ.. పక్కవారికి నీతులు చెప్పాలని చూడటం సరికాదని అంటున్నారు నెటిజన్లు.

ఆమాటకొస్తే పవన్ కల్యాణ్ కి పరిటాల రవి గుండుకొట్టిచ్చారంటూ వార్తలు రాసింది ఎల్లో మీడియా. అప్పట్లో ఆయన కోపగించుకున్నారు కూడా, ఆ తర్వాత తన తల్లిని తిట్టారని చంద్రబాబుపై రెచ్చిపోయారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే చంద్రబాబుకోసం పనిచేస్తున్నారు పవన్. అదే ఎల్లో మీడియాతో అంటకాగుతున్నారు. విమర్శించినా, తిట్టినా, ఇంట్లో వాళ్లని తిట్టించినా.. అన్నీ మరచిపోయి చంద్రబాబు పంచన చేరడం ఇలాంటి వారికే చెల్లింది. రోషం, పౌరుషం అంటూ మాట్లాడేవారంతా.. చంద్రబాబు దగ్గరకు వెళ్లేసరికి అవన్నీ మరచిపోయి తోక ఊపుకుంటూ ఉండిపోవడం విశేషం.

కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల.. వైఎస్ వివేకా హత్య కేసుని రాజకీయ స్వలాభం కోసం వాడుకోవాలనుకున్నారు. వివేకా కుమార్తె సునీతను అడ్డు పెట్టుకుని కడపలో పదే పదే అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రచాారం చేస్తున్నారు. కోర్టు ఆ విషయంలో మాట్లాడొద్దని ఆదేశాలివ్వడంతో షర్మిలకు షాక్ తగిలింది. ఏం మాట్లాడాలో తెలియదు, ఏమని విమర్శలు చేయాలో తెలియదు. అందుకే ఇలా వైసీపీలో జరిగే పరిణామాల్ని టార్గెట్ చేశారు. కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారు. తన పార్టీ అభ్యర్థిని జగన్ పొగిడినా సహించలేకపోతున్నారు షర్మిల.

First Published:  24 April 2024 10:11 AM GMT
Next Story