Telugu Global
Andhra Pradesh

ఎంపీపై మండిపోతున్న శెట్టిబలిజలు

శెట్టిబలిజల కార్పొరేషన్ ఛైర్మన్ ఉగ్గుల సమ్మయ్య నాయకత్వంలో ఆత్మగౌరవ సభ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఎంపీకి వ్యతిరేకంగా శెట్టిబలిజల సమావేశం హఠాత్తుగా జరిగింది కాదు. చాలాకాలంగా ఎంపీకి వీళ్ళకు పడటంలేదు.

ఎంపీపై మండిపోతున్న శెట్టిబలిజలు
X

రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు మార్గాని భరత్ రామ్‌కు వ్యతిరేకంగా శెట్టిబలిజలు మండిపోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు, బీసీ సామాజికవర్గాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. బీసీల్లోని అనేక ఉపకులాల్లో గౌడ్లు, శెట్టిబలిజలు సంఖ్యాపరంగానే కాకుండా రాజకీయంగా కూడా చాలా గట్టిస్ధితిలో ఉంటారు. బీసీల్లోని ఉపకులాలన్నీ ఏకమై మొన్నటి ఎన్నికల్లో టీడీపీని కాదని వైసీపీరి సపోర్టుగా నిలిచాయి.

2014 ఎన్నికల వరకు రాజమండ్రి సీటులో ఎక్కువ సార్లు కమ్మ సామాజికవర్గం నేతలే పోటీలో ఉండేవారు. అలాంటిది మొదటిసారి రాజమండ్రిలో ఒక బీసీకి వైసీపీ టికెట్ ఇచ్చింది. దాంతో బీసీలందరూ భరత్‌కు ఓట్లేసి గెలిపించారు. తర్వాత ఏమైందో ఏమో గౌడ్ సామాజికవర్గానికి చెందిన భరత్‌కు శెట్టిబలిజలతో చెడింది. ఆదివారం రాజమండ్రిలో ఎంపీ ఆధ్వ‌ర్యంలో బీసీలందరూ కలిసి వనభోజనాలు పెట్టుకున్నారు.

అయితే భరత్ మీద వ్యతిరేకత కారణంగా శెట్టిబలిజలు హాజరుకాకుండా ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశం నిర్వహించుకున్నారు. భరత్ వల్ల తమకు ఎదురవుతున్న అవమానాల్ని చర్చించుకున్నారు. ఉద్దేశ‌పూర్వకంగానే ఎంపీ శెట్టిబలిజలను అవమానిస్తున్నట్లు డిసైడ్ అయ్యారు. అందుకనే ఎంపీకి శెట్టిబలిజల కెపాసిటి ఏమిటో చూపించాలని డిసెంబర్లో భారీ బహిరంగసభ నిర్వహించాలని కూడా నిర్ణయించారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో సుమారు 2 లక్షల ఓట్లున్న శెట్టిబలిజల మద్దతుతోనే తానుగెలిచిన విషయాన్ని భరత్ మరచిపోయారంటూ మండిప‌డ్డారు. శెట్టిబలిజల కార్పొరేషన్ ఛైర్మన్ ఉగ్గుల సమ్మయ్య నాయకత్వంలో ఆత్మగౌరవ సభ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఎంపీకి వ్యతిరేకంగా శెట్టిబలిజల సమావేశం హఠాత్తుగా జరిగింది కాదు. చాలాకాలంగా ఎంపీకి వీళ్ళకు పడటంలేదు.

పార్టీపరంగా కానీ లేదా ప్రభుత్వంలో కానీ శెట్టిబలిజలకు ఏదన్నా పదవిరాగానే భరత్ దాన్ని రద్దు చేయిస్తున్నట్లు సమ్మయ్య ఆరోపించారు. కావాలని శెట్టిబలిజలను అవమానిస్తున్న ఎంపీకి తమ కెపాసిటి ఏమిటో చూపించాలని తాజా సమావేశంలో నేతలంతా గట్టిగా తీర్మానించారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని వెంటనే వివాదాన్ని చక్కదిద్దకపోతే ఎంపీ సీటును పార్టీ చేతులారా ఓడిపోవటం ఖాయం.

First Published:  31 Oct 2022 6:24 AM GMT
Next Story