Telugu Global
Andhra Pradesh

ఉపాధ్యాయ దినోత్సవ బహిష్కరణ.. ఏపీటీఎఫ్ సంచలన నిర్ణయం..

కనీసం హాజరు కోసం ప్రత్యేక పరికరాలు ఇవ్వాలని కోరినా ప్రభుత్వం కుదరదంది, దీంతో అప్పటికప్పుడు ఒప్పుకున్నట్టు తల ఊపిన నేతలు, ఆ తర్వాత తమ ప్రతాపం చూపించాలనుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఉపాధ్యాయ దినోత్సవాన్నే బహిష్కరించారు.

ఉపాధ్యాయ దినోత్సవ బహిష్కరణ.. ఏపీటీఎఫ్ సంచలన నిర్ణయం..
X

ఏపీలో ఉపాధ్యాయ సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఈనెల 5న జరగాల్సిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) తరపున ఈమేరకు ఓ బహిరంగ ప్రకటన విడుదలైంది. సెప్టెంబర్-5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చే సన్మానాలు, సత్కారాలను తిరస్కరిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.

ఎందుకీ సంచలన నిర్ణయం..

సీపీఎస్ రద్దు కోరుతూ ఈనెల 1న ఉద్యోగ సంఘాలు చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టాయి, ఆ తర్వాత తమ ప్లాన్ మార్చుకుని ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశాయి. అప్పటికే పోలీసులు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలకు నోటీసులివ్వడం, బైండోవర్లు చేయడం మొదలు పెట్టారు. విజయవాడ వెళ్తే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. దీంతో ఉపాధ్యాయులకు ఆగ్రహం వచ్చింది. అదే సమయంలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా హాజరు వేయాలనుకోవడం కూడా వారి ఆగ్రహానికి మరో కారణం. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో చర్చలు సఫలమయ్యాయని ప్రకటన వచ్చినా, ఉపాధ్యాయులు అయిష్టంగానే అందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. కనీసం హాజరు కోసం ప్రత్యేక పరికరాలు ఇవ్వాలని కోరినా ప్రభుత్వం కుదరదంది, దీంతో అప్పటికప్పుడు ఒప్పుకున్నట్టు తల ఊపిన నేతలు, ఆ తర్వాత తమ ప్రతాపం చూపించాలనుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఉపాధ్యాయ దినోత్సవాన్నే బహిష్కరించారు.

సీపీఎస్ రద్దుకోసం పోరాటం..

సీపీఎస్ రద్దు అనేది ఉపాధ్యాయులతోపాటు మిగతా ఉద్యోగులకు కూడా కీలకమే. కానీ గతంలో పీఆర్సీ డిమాండ్ల సాధన కోసం జరిగిన పోరాటంలో ఉపాధ్యాయులే ముందు వరుసలో ఉన్నారు. ఇప్పుడు సీపీఎస్ విషయంలో కూడా ఉపాధ్యాయులే ఉద్యమానికి నాంది పలికారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలపైనే ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. సీపీఎస్ రద్దుకోసం తాము పోరాటం చేస్తుంటే, ఉద్దేశపూర్వకంగానే తమకు ఆన్ లైన్ హాజరు తెచ్చిపెట్టారనే భావన వారిలో ఉంది. అందుకే వారంతా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉపాధ్యాయుల సమస్యలు తీర్చకుండా సన్మానాలు, సత్కారాలు చేస్తామంటే తామెందుకు ఒప్పుకుంటామని కొన్నిరోజులుగా వాట్సప్ గ్రూపుల్లో ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా టీచర్స్ డే ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా వారితో చర్చలు మొదలు పెడుతుందా, లేక తెగేదాకా లాగుతుందా అనేది తేలాల్సి ఉంది.

First Published:  3 Sep 2022 12:09 PM GMT
Next Story