Telugu Global
Andhra Pradesh

ఆయనకు పేటకు ఏంటి సంబంధం..? - ప్రత్తిపాటి పుల్లారావు సీట్‌కు ఎసరు?

అసలు భాష్యం ప్రవీణ్ ఎవరు..? అతడికి చిలకలూరిపేటకు సంబంధం ఏంటని ప్రశ్నించారు పుల్లారావు. సేవలు, ఫౌండేషన్లు అంటూ హడావుడి చేసి పార్టీలోకి వచ్చే వారి సంఖ్య ఈ మూడునాలుగు నెలలు ఎక్కువగానే ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఆయనకు పేటకు ఏంటి సంబంధం..? - ప్రత్తిపాటి పుల్లారావు సీట్‌కు ఎసరు?
X

చంద్రబాబు నిర్ణయాలతో ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు వణికిపోతున్నారు. పాత నేతలకు, వారి కుటుంబాలకు చంద్రబాబు రాజకీయ మరణశాసనం రాసేస్తున్నారన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. కోడెల వారసుడు శివరాంకు టికెట్‌ లేదు అన్న విషయాన్ని సత్తెనపల్లి ఇన్‌చార్జ్‌గా కన్నాను నియమించడంతో తేల్చేశారు చంద్రబాబు. ఇప్పుడు ప్రత్తిపాటి పుల్లారావుకు ఎర్త్‌ ఖాయమనిపిస్తోంది.

చిలకలూరిపేట టికెట్‌పై కన్నేసిన భాష్యం ప్రవీణ్ కొంతకాలంగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల మహానాడులో చంద్రబాబు ఏజ్‌ 73 కావడంతో 73 లక్షల రూపాయల భారీ విరాళాన్ని ప్రవీణ్‌ అందజేశారు. అయినా టికెట్‌ తనను కాదని ఎక్కడికి వెళ్తుంది అన్నట్టుగా ప్రత్తిపాటి పుల్లారావు ధీమాగా ఉంటూ వచ్చారు. ఇంతలో కోడెల కుటుంబానికే చంద్రబాబు టికెట్‌ ఎగ్గొట్టడంతో తనకూ అదే అనుభవం ఎదురుకావొచ్చన్న ఆందోళన పుల్లారావులో వ్య‌క్త‌మైంది. దాంతో తాజాగా ఓపెన్ అయిపోయారు.

అసలు భాష్యం ప్రవీణ్ ఎవరు..? అతడికి చిలకలూరిపేటకు సంబంధం ఏంటని ప్రశ్నించారు పుల్లారావు. సేవలు, ఫౌండేషన్లు అంటూ హడావుడి చేసి పార్టీలోకి వచ్చే వారి సంఖ్య ఈ మూడునాలుగు నెలలు ఎక్కువగానే ఉంటుందని వ్యాఖ్యానించారు. చిలకలూరిపేటలో భాష్యం ప్రవీణ్‌కు అసలు ఓటే లేదు.. ఇప్పుడు సేవా కార్యక్రమాలు అంటూ హడావుడి చేస్తున్న అతడు.. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ రాకపోతే ఈ ప్రాంతంలో మళ్లీ కనిపిస్తాడా అని ప్రశ్నించారు. ఒకవేళ టికెట్ వచ్చి గెలిచినా ఎక్కడుంటారో కూడా తెలియదన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించవద్దని పార్టీని కోరారు.

ఇలాంటి వాళ్లంతా ఈ నాలుగేళ్లు ఎక్కడున్నారని పుల్లారావు ప్రశ్నించారు. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే ఇంత కాలం కేసులు పెట్టించుకుని, అధికార పార్టీపై పోరాటం చేసిన వారు ఏమైపోవాలని నిలదీశారు. కోడెల శివప్రసాదరావు కుటుంబానికి న్యాయం జరగాల్సిన అవసరం ఉందని.. అలా జరుగుతుందని... అయితే అది ఎన్నికల ముందా తర్వాతా అన్నది త్వరలోనే తేలుతుందన్నారు.

First Published:  3 Jun 2023 5:09 AM GMT
Next Story