Telugu Global
Andhra Pradesh

టీడీపీలో సెకండ్ లిస్ట్ చిచ్చు.. బాబుపై సీనియర్ల తిరుగుబాటు

సెకండ్ లిస్ట్ తో టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది, తుది జాబితా కూడా విడుదలైతే ఆ మంటలు మరింత ఎగసిపడటం ఖాయం.

టీడీపీలో సెకండ్ లిస్ట్ చిచ్చు.. బాబుపై సీనియర్ల తిరుగుబాటు
X

34 మంది అభ్యర్థుల పేర్లతో విడుదలైన రెండో జాబితా టీడీపీలో చిచ్చు పెట్టింది. సీనియర్లకు సీట్లు లేకపోవడంతో వారంతా భగ్గుమన్నారు. తమ దారి తాము చూసుకుంటామని తేల్చి చెప్పారు. కొంతమంది ఇండిపెండెంట్లుగా బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావుని ప్రకటించడంపై మాజీ మంత్రి కేఎస్ జవహర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు జవహర్‌. ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమని ప్రకటించారు.

విశాఖ సౌత్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ గండి బాబ్జి టీడీపీకి రాజీనామా చేశారు. ఆ సీటు జనసేనకు వెళ్లడంతో ఆయన అలకబూనారు, టీడీపీకి గుడ్ బై చెప్పారు. కృష్ణాజిల్లా పెనమలూరులో బోడే ప్రసాద్‌కు టిక్కెట్ దక్కక పోవడంపై ఆయన అనుచరులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. పెనమలూరులో పార్టీకోసం ప్రసాద్ కష్టపడ్డారని, అలాంటి నాయకుడికి టికెట్ లేకుండా చేశారంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఓటమే లక్ష్యంగా పనిచేస్తామంటూ టీడీపీ కార్యకర్తలు హెచ్చరించారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రహస్య భేటీ వ్యవహారం కూడా పార్టీలో సంచలనంగా మారింది. రెండో లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో ఆయన షాకయ్యారు. పిఠాపురం విషయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు, టీడీపీ టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని తేల్చి చెప్పారు. అక్కడ జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తానని చెప్పడంతో పిఠాపురంలో వర్మ అనుచరులు వీరంగం సృష్టించారు.

నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి భార్య ప్రశాంతి రెడ్డికి కోవూరు టికెట్ కేటాయించడంతో పార్టీలో కలకలం రేగింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కొడుకు దినేష్ రెడ్డి టీడీపీ ఇన్ చార్జ్ గా కొనసాగుతున్నారు. ప్రచారం కూడా ఓ విడత పూర్తి చేశారు. చివర్లో వేమిరెడ్డి రాకతో సమీకరణాలు తారుమారయ్యాయి. పోలంరెడ్డి ఫ్యామిలీ చంద్రబాబుపై గుర్రుగా ఉంది. సర్వేపల్లి టికెట్ సోమిరెడ్డికి ఇంకా ఖాయం చేయలేదు. ఆయనకు హ్యాండ్ ఇస్తారనే ప్రచారంతో సోమిరెడ్డి అనుచరులు కూడా పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్టుగా ఉన్నారు. మొత్తానికి సెకండ్ లిస్ట్ తో టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది, తుది జాబితా కూడా విడుదలైతే ఆ మంటలు మరింత ఎగసిపడటం ఖాయం.

First Published:  14 March 2024 3:23 PM GMT
Next Story