Telugu Global
Andhra Pradesh

హమ్మయ్య.. గాజు గ్లాసు పవన్ కల్యాణ్ కే..!

నా చెప్పులు పోయాయ్ అంటూ పవన్ కల్యాణ్ సెటైర్లు పేల్చడంతో, అసలు నీ పార్టీ గుర్తే పోయింది చూసుకో అంటూ వైసీపీనుంచి కౌంటర్లు పడ్డాయి. గుర్తులేని జనసేన అంటూ మాజీ మంత్రి పేర్ని నాని సహా చాలామంది వైసీపీ నాయకులు వెటకారం చేశారు.

హమ్మయ్య.. గాజు గ్లాసు పవన్ కల్యాణ్ కే..!
X


జనసేన ఊపిరి పీల్చుకుంది, జనసైనికులు కాస్త కుదుటపడ్డారు, గాజు గ్లాసు గుర్తుని ఆ పార్టీకే కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేనను రిజర్వ్ డ్ సింబల్ కలిగిన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో ఉంచింది. దీంతో జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు దూరం కాలేదని స్పష్టమైంది. ఆగండాగండి.. ఈ సంతోషం కేవలం స్థానిక ఎన్నికల వరకే. అవును, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తుని ఎన్నికల సంఘం కొనసాగించింది.

సార్వత్రిక ఎన్నికల్లో గాజు గ్లాసు ఫ్రీ సింబల్..

సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం గాజు గ్లాసు ఇంకా ఫ్రీ సింబల్స్ లిస్ట్ లోనే ఉంది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఈసీ ఇటీవల వెల్లడించింది. ఏపీలో వైసీపీ, టీడీపీ గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో నిలిచాయి. తెలంగాణలో ఎంఐఎం, బీఆర్ఎస్ తో పాటు టీడీపీ, వైసీపీ కూడా గుర్తింపు పొందిన పార్టీలుగా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీలకు గతంలో కేటాయించిన గుర్తులను రిజర్వ్ చేసింది ఈసీ. జనసేన మాత్రం ఈ జాబితాలో లేకపోవడంతో ఆ పార్టీ గుర్తు గాజు గ్లాసు ఫ్రీ సింబల్స్ జాబితాలోనే కొనసాగుతోంది.

నా చెప్పులు పోయాయ్ అంటూ పవన్ కల్యాణ్ సెటైర్లు పేల్చడంతో, అసలు నీ పార్టీ గుర్తే పోయింది చూసుకో అంటూ వైసీపీనుంచి కౌంటర్లు పడ్డాయి. గుర్తులేని జనసేన అంటూ మాజీ మంత్రి పేర్ని నాని సహా చాలామంది వైసీపీ నాయకులు వెటకారం చేశారు. వారి కౌంటర్లకు జనసేన దగ్గర సమాధానం లేదు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో 175 స్థానాల్లో పోటీ చేస్తారా చేయరా అనే విషయం పక్కనపెడితే జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కూడా లేదనే కామెంట్లు ఎక్కువయ్యాయి. స్థానిక ఎన్నికల వరకు ఓకే కానీ, అసలు ఎన్నికల్లో జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ కాలేదు. ఎన్నికలనాటికి ఆ పార్టీ ప్రత్యేక అభ్యర్థనలను సీఈసీ పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.

First Published:  24 Jun 2023 2:44 AM GMT
Next Story