Telugu Global
Andhra Pradesh

అంబటికి వరుస షాకులు.. అందరూ ఇలా రివర్స్ అయ్యారేంటి..?

అంబటి చెక్కు వ్యవహారం మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది. కుమారుడు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నామని, కనీసం ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కూడా తమదాకా రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాధిత భార్యా భర్తలు.

అంబటికి వరుస షాకులు.. అందరూ ఇలా రివర్స్ అయ్యారేంటి..?
X

తమాషాగా మాట్లాడతారు, ప్రత్యర్థులపై సెటైర్లు వేస్తారు, వెటకారం పాళ్లు కాస్త ఎక్కువ.. మంత్రి పదవి రాకముందు అంబటి రాంబాబు గురించి అందరికీ తెలిసిన విషయాలివి. పదవి వచ్చిన తర్వాత మాత్రం ఆయన మరింతగా వార్తల్లో వ్యక్తి అయిపోయారు. పదవి చేపట్టగానే నీటి ప్రాజెక్ట్ ల విషయంలో సమీక్షలు పెట్టి మీడియా ముందు ఏదేదో మాట్లాడి కాస్త ఇబ్బంది పడ్డారు. ఆమధ్య ఓ ఫోన్ కాల్ ఆడియో వ్యవహారం రచ్చగా మారింది. ఆ తర్వాత ఆయన వివిధ సందర్భాల్లో చేసిన డ్యాన్స్ లకు జనసేన రియాక్షన్లు కూడా హైలెట్ అయ్యాయి. ఇవన్నీ పక్కనపెడితే వ్రభుత్వం నష్టపరిహారంగా ఇచ్చిన చెక్కు వ్యవహారంలో అంబటి సగం వాటా అడిగారంటూ గతంలో వచ్చిన ఆరోపణలు ఆయన్ను కార్నర్ చేశాయి. సంక్రాంతి లక్కీ డ్రా, కోర్టు చీవాట్లు, పోలీసుల కేసులు.. ఇవి కూడా అంబటి పేరు పండగ రోజు మారుమోగిపోయేలా చేశాయి. ఇటీవల అంబటి ఇలాకాలో ఓ మహిళా ఎంపీటీసీ ఇచ్చిన వార్నింగ్ కూడా అందరికీ తెలిసిందే. పదే పదే ఇలా ఆరోపణలతో వార్తల్లో వ్యక్తిగా మారారు అంబటి.

నిను వీడని చెక్కును నేనే..

అయితే అంబటి చెక్కు వ్యవహారం మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది. సత్తనెపల్లిలో రెస్టారెంట్ సెప్టిక్ ట్యాంక్ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘటనలో ప్రభుత్వం పరిహారం కింద ఇచ్చిన చెక్కులు బాధిత కుటుంబాలకు అందలేదని అంటున్నారు. ఇద్దరు కార్మికులతో ఒప్పందాలు కుదుర్చుకుని చెక్కులివ్వకుండానే వారికి రెండున్నర లక్షల రూపాయల క్యాష్ ఇచ్చారట. అయితే వాస్తవంగా ప్రభుత్వం ఇచ్చింది 5 లక్షల రూపాయలు. తమకు కనీసం ఆ రెండున్నర లక్షలు కూడా ఇవ్వకుండా మంత్రి అంబటి ఇబ్బంది పెడుతున్నారంటూ గంగమ్మ కుటుంబం వాపోయింది. గతంలో ఓసారి అంబటిపై ఆమె ఆరోపణలు చేయగా, జనసేన ప్రోద్బలంతో విమర్శలు చేశారన్నారు. ఆ తర్వతా మళ్లీ ఇప్పుడు ఆమె అంబటిపై ఆరోపణలు చేస్తూ మీడియాకెక్కారు. తమని ఇంతలా ఇబ్బందులకు గురిచేయడం అన్యాయం అన్నారు.



‘మా కుమారుడికి వచ్చిన రూ.5 లక్షల చెక్కును వెనక్కి పంపాలని మీకు ఎలా అనిపించిందయ్యా... మీకు మేమేం అన్యాయం చేశాం. మా గోడు పట్టించుకోకుండా రోడ్డు పాల్జేశారు’ అంటూ తురగ గంగమ్మ, ఆమె భర్త పర్లయ్య మీడియాతో తమ గోడు చెప్పుకున్నారు. కుమారుడు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నామని, కనీసం ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కూడా తమదాకా రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాధిత భార్యా భర్తలు. తమకు రాజకీయ దురుద్దేశాలేవీ లేవని, అంబటిని తామెప్పుడూ తప్పుబట్టలేదని, తమకు పరిహారం రాలేదని మాత్రమే రోడ్డునపడాల్సి వచ్చిందన్నారు. మరి దీనిపై అంబటి ఇంకా స్పందించలేదు. లోకేష్ పాదయాత్రపై, పవన్ కల్యాణ్ వారాహి వాహనంపై క్షణం ఆలస్యం చేయకుండా ట్వీట్లు వేసే మంత్రి అంబటి, తనపై వచ్చిన ఆరోపణలకు మాత్రం ఇంకా స్పందించలేదు. ఆ చెక్కులకు తనకు సంబంధం లేదని గతంలోనే ఆయన వివరణ ఇచ్చారు. ఆ వివరణ సరిపోతుందనుకున్నారో, లేక ఇంకేదైనా ఆలోచనలో ఉన్నారో.. ఆయన ట్వీట్ పడితేనే తెలుస్తుంది.

First Published:  29 Jan 2023 3:23 AM GMT
Next Story