Telugu Global
Andhra Pradesh

వైసీపీలో 'సత్తారు' కలకలం.. సోషల్ మీడియాలో రచ్చ

సత్తారు వెంకటేష్ పాత వీడియోలన్నీ బయటకు తెచ్చి.. వైసీపీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు టీడీపీ, జనసేన సానుభూతిపరులు. ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలుపెట్టారు.

వైసీపీలో సత్తారు కలకలం.. సోషల్ మీడియాలో రచ్చ
X

సత్తారు వెంకటేష్ రెడ్డి. ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. సదరు వెంకటేష్ రెడ్డి వైసీపీ నేత అనే ప్రచారం ఉంది. వైసీపీ అనుబంధ సంఘాల అధ్యక్షుడిగా ఉన్న సత్తారు, పలు ఇంటర్వ్యూలలో పార్టీ కోసం పనిచేసినట్టు చెప్పుకున్నారు. సీఎం జగన్ తో ఉన్న ఫొటోలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలు.. ఇలా ఒకటేంటి చాలా ఆధారాలున్నాయి. వైసీపీతో ఇంత అనుబంధం ఉన్న ఈ సత్తారు వెంకటేష్ రెడ్డిని ఇటీవల అమెరికాలోని మిస్సోరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువకుడిని బంధించి అతడితో వెట్టి చాకిరి చేయిస్తూ.. దారుణంగా హింసిస్తున్నారణే కారణంతో వెంకటేష్ రెడ్డి సహా మరో ఇద్దరిపై మిస్సోరి పోలీసులు కేసు పెట్టి జైలుకి పంపించారు. అక్కడ అతడు అరెస్ట్ కావడంతో ఇక్కడ వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి వైరి వర్గాలు. వైసీపీ నేతలు ఎక్కడున్నా తమ బుద్ధి చూపించుకుంటున్నారని, చివరకు విదేశాల్లో కూడా పోలీసులు వారిని అరెస్ట్ చేశారని టీడీపీ, జనసేన కౌంటర్లిస్తున్నాయి.



సత్తారుతో మాకేం సంబంధం..

సోషల్ మీడియాలో రచ్చ జరగడంతో వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో వెంటనే ఖండన ప్రకటన ఇచ్చారు. అసలు ఆ సత్తారుతో తమ పార్టీకి సంబంధం లేదన్నారు. "అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్‌ఆర్‌ఐ సత్తారు వెంకటేష్ రెడ్డికి, పార్టీ కి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఘటనను వైసీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ కేసులో ఉన్న సత్తారు వెంకటేష్ రెడ్డి చేసిన నేరం అతని వ్యక్తిగతం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది." అని బదులిచ్చారు. ఈ సమాధానం వైరి వర్గాలకు మరింత ఊపునిచ్చింది. సత్తారు వెంకటేష్ పాత వీడియోలన్నీ బయటకు తెచ్చి.. వైసీపీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు టీడీపీ, జనసేన సానుభూతిపరులు. ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలుపెట్టారు.


ఇటీవల వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదం జరిగిన వెంటనే వైసీపీ కూడా ఇలాగే లోకల్ బాయ్ నానిని టార్గెట్ చేసింది. సదరు నాని జనసైనికుడంటూ కౌంటర్లిచ్చింది. అప్పుడు జనసేన కూడా ఇలాగే తమకేం సంబంధం లేదని చెప్పుకుంది. సీన్ కట్ చేస్తే అసలు లోకల్ బాయ్ నానికి, అగ్నిప్రమాదానికి సంబంధం లేదని తేలిపోయింది. ఇప్పుడు సత్తారు వెంకటేష్ రెడ్డి వ్యవహారం కూడా ఈ రెండు పార్టీల సోషల్ మీడియా విభాగాల మధ్య గొడవకు కారణం అయింది. మధ్యలో టీడీపీ కూడా ఇదే వ్యవహారంలో వైసీపీని టార్గెట్ చేస్తోంది.


First Published:  2 Dec 2023 7:23 AM GMT
Next Story