Telugu Global
Andhra Pradesh

ఆ ఫొటో తీసిందే నా భర్త.. - వైవీ సుబ్బారెడ్డిపై ట్రోలింగ్ సరికాదు

ఆంధ్రజ్యోతి పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తోందని మండిప‌డ్డారు. ఆంధ్రజ్యోతి కథనాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ ట్రోల్ చేస్తుంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ ఫొటో తీసిందే నా భర్త.. - వైవీ సుబ్బారెడ్డిపై ట్రోలింగ్ సరికాదు
X

దళితులను వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి అవమానించారంటూ ఆంధ్రజ్యోతి పత్రిక రాసిన కథనంపై దివంగత కాంగ్రెస్‌ నేత, మాజీ డిప్యూటీ సీఎం కోనేరు రంగారావు మనవరాలు డాక్టర్‌ కోనేరు సత్యప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి ప్రచురించిన ఫొటో కథనాన్ని తీవ్రంగా ఖండించారు.

ఏపీ లీడ్ క్యాప్‌ డైరెక్టర్‌గా కూడా ఉన్న కోనేరు సత్యప్రియ తన నివాసానికి రాగా కనీసం కుర్చీ వేయలేదని.. కింద కూర్చోబెట్టారంటూ వైవీ సుబ్బారెడ్డిని విమర్శిస్తూ ఆంధ్రజ్యోతి కథనం రాసింది. సుబ్బారెడ్డి దర్జాగా కాలుపై కాలువేసుకుని కూర్చుంటే.. సత్యప్రియ మాత్రం నేలపై కూర్చున్నారు అంటూ ఫొటోను ప్రచురించారు. తిరువూరు ఎమ్మెల్యే టికెట్‌ను సత్యప్రియ ఆశిస్తున్నారని అందుకే నాలుగు రోజుల క్రితం వైవీ సుబ్బారెడ్డిని తాడేపల్లి నివాసంలో కలిశారని వెల్లడించారు.




ఆ తర్వాత టీడీపీ సోషల్ మీడియాలోనూ ఈ ఫొటోపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది. ఈ కథనంపై సత్యప్రియ స్పందించారు. ఆంధ్రజ్యోతి పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తోందని మండిప‌డ్డారు. ఆంధ్రజ్యోతి కథనాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ ట్రోల్ చేస్తుంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.




తన తాత కోనేరు రంగారావు, వైవీ సుబ్బారెడ్డి చాలా సన్నిహితులని వైవీ సుబ్బారెడ్డి తన తండ్రి సమానులని, ఒక కుటుంబ సభ్యురాలిగానే వైవీ ఇంటికి తాను వెళ్లానని చెప్పారు. ఆ ఫొటోను తీసింది కూడా తన భర్తేనని ఆమె వివరించారు. పక్కనే జగన్ ఫొటో ఉండటంతో ఆ ఫొటో పక్కన కూర్చుని ఫోటో దిగే ప్రయత్నం చేశానని ఆమె వివరించారు. ఆగస్ట్‌ 29న తన పుట్టిన రోజని వైవీ సుబ్బారెడ్డి ఆశీస్సులు తీసుకునేందుకు వెళ్లామని.. కానీ మీడియాలో మాత్రం టికెట్‌ కోసం అంటూ రాశారని ఆక్షేపించారు. వైవీ సుబ్బారెడ్డి తనను ఆశీర్వదించిన కొన్ని ఫొటోలను ఆమె మీడియాకు విడుదల చేశారు.

First Published:  4 Sep 2023 10:19 AM GMT
Next Story