Telugu Global
Andhra Pradesh

చెత్తబుట్టలో ఉంగరం.. పారిశుధ్య కార్మికులకు వందనం..

దాదాపు 5గంటల అన్వేషణ ఫలించింది. చెత్త కుప్పలో బంగారు ఉంగరం వెలిగిపోతూ కనిపించింది. నాగలక్ష్మి సంతోషానికి అవధులు లేవు.

చెత్తబుట్టలో ఉంగరం.. పారిశుధ్య కార్మికులకు వందనం..
X

రాజమండ్రిలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. ఉదయాన్నే ఇంటి వద్దకు వచ్చిన మున్సిపల్ వాహనంలో చెత్త బుట్టను బోర్లించింది ఓ మహిళ.. చెత్తతో పాటు ఆమె చేతికి ఉన్న ఉంగరం కూడా చెత్త సేకరించే వాహనంలో పడిపోయింది. ఆ తర్వాత వాహనం వెళ్లిపోయింది, ఉంగరం చేతికి లేకపోవడం చూసి ఆ మహిళ లబోదిబోమంది. అప్పటికే ఆలస్యమైంది ఆ చెత్త అంతా డంపింగ్ యార్డ్ కి చేరుకుంది. ఎవరైనా ఏం చేస్తారు..? వ్యక్తిగతంగా వెళ్లి డంపింగ్ యార్డ్ వద్ద వెదుకులాడతారు, లేదా మన ఖర్మ ఇంతే అని సరిపెట్టుకుంటారు. కానీ రాజమండ్రి ఇన్నీస్ పేటకు చెందిన నాగలక్ష్మి అనే ఆ మహిళ కాస్త తెలివిగా ఆలోచించింది. వెంటనే నగర కమిషనర్ కి ఫిర్యాదు చేసింది. స్పందన కార్యక్రమానికి ఫోన్ చేసి తన ఉంగరం చెత్త వాహనంలో పడిపోయిందని వెతికి పెట్టాలని కోరింది.

సత్వర స్పందన..

ఫిర్యాదు కాస్త చిత్రంగానే ఉన్నా.. వెంటనే వెతికితే ఫలితం ఉంటుందని భావించిన రాజమండ్రి కమిషనర్ దినేష్ కుమార్.. పారిశుధ్య సిబ్బందిని అలర్ట్ చేశారు. వారంతా డంపింగ్ యార్డ్ కి వెళ్లి జల్లెడపట్టారు. శానిటేషన్ ఇన్స్ పెక్టర్ పర్యవేక్షణలో, శానిటేషన్ సెక్రటరీ అక్కడే ఉండగా నలుగురు సిబ్బంది వెదుకులాట మొదలు పెట్టారు. దాదాపు 5గంటల అన్వేషణ ఫలించింది. చెత్త కుప్పలో బంగారు ఉంగరం వెలిగిపోతూ కనిపించింది. నాగలక్ష్మి సంతోషానికి అవధులు లేవు. ఇక దొరకదు అనుకున్న 6 గ్రాముల బంగారు ఉంగరం చేతికి అందడంతో ఆమె సంబరపడ్డారు. పారిశుధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు.

ఫిర్యాదు విచిత్రంగానే ఉన్నా.. కమిషనర్ దినేష్ కుమార్ వెంటనే స్పందించడంతో ఫలితం లభించింది. స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీల్లో ఎన్ని పరిష్కారం అవుతాయో తెలియదు కానీ.. ఈ ఫోన్ కాల్ కంప్లయింట్ కి మాత్రం వెంటనే పరిష్కారం లభించడం విశేషం.

First Published:  28 Sep 2022 1:53 AM GMT
Next Story