Telugu Global
Andhra Pradesh

కాంట్రాక్టర్ల కంటతడి.. జగన్ కు మంచిదేనా..?

బిల్లులిస్తారా.. భవనం ఎక్కి దూకమంటారా? అంటూ ఇప్పుడు కాంట్రాక్టర్లు తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యారు. సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేస్తున్న ప్రభుత్వానికి, తమ బకాయిలు చెల్లించడానికి మాత్రం మనసు రావడంలేదని ఆరోపిస్తున్నారు.

కాంట్రాక్టర్ల కంటతడి.. జగన్ కు మంచిదేనా..?
X

ప్రతిపక్షాలు ప్రేరేపించాయా..? లేక నిజంగానే కడుపుమండిందా..? తెలియదు కానీ కాంట్రాక్టర్లు సీఎం జగన్ తీరుని తప్పుబడుతూ ఆందోళనకు దిగారు. అప్పులు తెచ్చి ఇసుక కాంట్రాక్ట్ పనులు చేశామని, రెండేళ్లవుతున్నా ఇంకా ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని వాపోతున్నారు. చావే పరిష్కారం అంటూ విజయవాడలోని ఏపీఎండీసీ భవనం ఎక్కేందుకు ప్రయత్నించారు.


అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇది కేవలం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల కాంట్రాక్టర్ల నిరసన మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఇసుక కాంట్రాక్ట్ లు చేసినవారు ఇంకా బిల్లులు రాక లబోదిబోమంటున్నారు.

ప్రభుత్వాలు మారినా, పాలసీలు మారినా ఏపీలో ఇసుక రేటు మాత్రం తగ్గలేదు. గతంలో టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుక అని ప్రచారం చేసినా, మధ్యలో దళారీలు దండుకున్నారు. వైసీపీ వచ్చినా పరిస్థితి మారలేదు. గతంలో చోటామోటా నేతలు తినేవారు, ఇప్పుడు నేరుగా ఒకే సంస్థకు గుత్తాధిపత్యం లభించింది. అదే తేడా. అయితే ఏపీలో ఇసుక వ్యాపారాన్ని జేపీ సంస్థకు అప్పగించే ముందు ఎనిమిది నెలలపాటు స్థానిక కాంట్రాక్టర్లకు ఇసుక అమ్మకాలను అప్పగించింది వైసీపీ ప్రభుత్వం.


ఆ సమయంలో రీచ్‌ లలో ఇసుక తవ్వి, దాన్ని ఇళ్లకు రవాణాచేసే బాధ్యతలను ఎక్కడికక్కడ కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇలాంటి వారు రాష్ట్రవ్యాప్తంగా 300 మంది ఉన్నారు. వీరికి ఏపీఎండీసీ చెల్లించాల్సిన బకాయిలు ఇంకా అందలేదు.


బిల్లులిస్తారా.. భవనం ఎక్కి దూకమంటారా? అంటూ ఇప్పుడు కాంట్రాక్టర్లు తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యారు. సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేస్తున్న ప్రభుత్వానికి, తమ బకాయిలు చెల్లించడానికి మాత్రం మనసు రావడంలేదని ఆరోపిస్తున్నారు. మీ మాటలు నమ్మి మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఏపీఎండీసీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కొంతమందికి రూ.కోట్లలో బకాయిలున్నాయని అన్నారు. మొత్తంగా రూ.60 కోట్ల మేర కాంట్రాక్టర్లకు ఏపీఎండీసీ చెల్లించాల్సి ఉందని సమాచారం. మరి దీనిపై ప్రభుత్వం స్పందన ఏంటో వేచి చూడాలి.

First Published:  2 March 2023 2:19 AM GMT
Next Story