Telugu Global
Andhra Pradesh

ఒకే సంఘటన ...రెండు విరుద్ద వార్తలు...ఎవరిని నమ్మాలి ?

నేడు ప్రతి రాజకీయ పక్షానికి ఓ మీడియా ఉండటంతో ఏ వార్తను నమ్మాలో, దేంట్లో ఎంత నిజముందో ప్రజలకు అర్దంకాని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడలో జరిగిన సంఘటనల రిపోర్టింగ్ చూస్తే మనం జరిగిన సంఘటనలను వార్తలుగా రాసున్నామా లేక మనం కొమ్ముకాసే రాజకీయ పార్టీకి అవసరమైన వార్తలను రాసి ప్రజలను నమ్మిస్తున్నామా అనే అనుమానం కలుగక మానదు.

ఒకే సంఘటన ...రెండు విరుద్ద వార్తలు...ఎవరిని నమ్మాలి ?
X

దేశంలో రోజు రోజుకు ప్రజలు మీడియా మీద నమ్మకాలు కోల్పోతున్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభంగా చెప్పుకునే మీడియా కార్పోరేట్ శక్తుల చేతుల్లో, కొన్ని రాజకీయ పార్టీల చేతుల్లో కరపత్రంగా మారిపోతున్న దుస్తితి.

భార దేశంలో స్వాతంత్య్ర పోరాటంలో అద్భుతమైన పాత్రను పోషించిన మీడియా స్వాతంత్య్రానంతర కాలంలో కూడా ప్రజలవైపు నిలబడి, పాలకులను దునుమాడిన మీడియా, రాజకీయ నాయకులు, కార్పోరేట్ కంపెనీలు చేసే అనేక స్కాం లను బైట పెట్టి ప్రభుత్వాల్వే కూలిపోవడానికి కారణమైన మీడియా, నిజాలు రాసి జైల్లో ఉండేందుకు కూడా సిద్దపడ్డ జర్నలిస్టులు ఇప్పుడు ఎక్కడ ?

నేడు ప్రతి రాజకీయ పక్షానికి ఓ మీడియా ఉండటంతో ఏ వార్తను నమ్మాలో, దేంట్లో ఎంత నిజముందో ప్రజలకు అర్దంకాని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడలో జరిగిన సంఘటనల రిపోర్టింగ్ చూస్తే మనం జరిగిన సంఘటనలను వార్తలుగా రాసున్నామా లేక మనం కొమ్ముకాసే రాజకీయ పార్టీకి అవసరమైన వార్తలను రాసి ప్రజలను నమ్మిస్తున్నామా అనే అనుమానం కలుగక మానదు.

గుడివాడలో నిన్న వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా జరిగిన రచ్చ, వైసీపీ, టీడీపీ వర్గాలు చేసుకున్న దాడులు, ప్రతి దాడులు గుడివాడ ప్రజలను భయబ్రాంతులను చేశాయి. ఈ సంఘటనకు సంబంధించి వార్తలను ప్రముఖ తెలుగు పత్రికలు ఈనాడు, సాక్షి రిపోర్ట్ చేసిన విధానం చూస్తే కళ్ళు తిరిగిపోవడం ఖాయం.

'ఈనాడు' ఏం రాసిందంటే....

''వంగవీటి మోహన రంగా వర్ధంతి నిర్వహించేందుకు గుడివాడలో తెలుగు దేశం పార్టీ వర్గాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే ఆదివారం సాయంత్రం వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీ, తెలుగు దేశం పార్టీ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వ రరావుకు ఫోన్ చేసి రంగా వర్ధంతిని నిర్వహించొద్దని హెచ్చరించారు. ఆ విషయంలో ఇద్దరి మధ్య ఫోన్ లోనే వాగ్వివాదం జరిగింది. విషయం తెలుసుకున్న టీడీపీ వర్గాలు టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద గుమిగూడి కాళీ ఇంటికి వెళ్దామని బయలు దేరగా పోలీసులు అడ్డుకున్నారు.

అయితే ఈ లోపు, కాళీ తన అనుచరులను వెంటేసుకొని టీడీపీ కార్యాలయం మీదికి దాడికి దిగాడు. టీడీపీ కార్యకర్తలపైకి పెట్రోల్ ప్యాకెట్లు విసిరి నిప్పంటించే ప్రయత్నం చేశారు. కర్రలు, కత్తులతో టీడీపీ శ్రేణులపై దాడులు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులపైనా వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. 5గురు విలేకర్లకు గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు మౌన ప్రేక్షకుల వలే చూస్తూ నిల్చున్నారు. టీడీపీ కార్యకర్తలు ఎదురు తిరగడంతో పోలీసులు టీడీపి వారిపై లాఠీ చార్జ్ చేశారు. వైసీపీ దాడిపై మాజీ ఎమ్మె ల్యే రావి వెంకటేశ్వర రావు పిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు.''

ఇదీ ఈనాడు రాసిన వార్త. ఇక ఇదే సంఘటనపై సాక్షి పత్రిక రాసిన వార్తను ఒక సారి చూద్దాం...

''గుడివాడలో ఆదివారం నాడు వంగవీటి మోహన రంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వైసీపీ కార్యకర్తలపై తెలుదేశం వర్గాలు దాడులు చేశాయి. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు అద్వర్య్యంలో టీడీపీ కార్యకర్తలు కర్రలు, బరిశెలు పట్టుకొని రంగా వర్ధంతిని మీరెలా నిర్వహిస్తారంటూ బెధిరించారు.

కర్రలు, బరిశెలు పట్టుకొని రోడ్డుపై వీరంగం వేశారు. అడ్డుకున్న పోలీసులపై కూడా దాడులు చేశారు. వన్ టౌన్ సీఐ గోవిందరాజులపై దాడికి ప్రయత్నించారు. అతని చొక్కా చించేశారు. '' ఇదీ సాక్షి పత్రిక రాసిన వార్త.

ఈ పత్రికలు చదివే పాఠకులు ఏ వార్తను నమ్మాలి ? ఇందులో అసలు నిజమేంటి ? పోనీ మరో పేపర్ చూద్దామన్నా , అసలు ఏదో ఓ పార్టీకి కొమ్ముకాయని పత్రికలు, ఛానళ్ళూ ఏమైనా ఉన్నాయా ?

స్వతంత్ర మీడియాను బతకకుండా బలవంతంగా ఆక్రమించుకునే కార్పోరేట్ శక్తులు, రాజకీయ అవసరాల కోసం వెలిసే మీడియా సంస్థలున్న నేటి పరిస్థితుల్లో...ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం...స్వతంత్ర‌ జర్నలిజం... ప్రతిపక్షంగా మీడియా....ప్రజలకోసమే జర్నలిస్టులు.... ఇలాంటి మాటలన్నీ పాత చింతకాయపచ్చడిలాగా అనిపించడంలేదా ?

First Published:  26 Dec 2022 6:26 AM GMT
Next Story