Telugu Global
Andhra Pradesh

ఏపీలో పడిపోయిన బైకుల విక్రయాలు.. చర్యలకు సీఎం ఆదేశం

ఏపీలో మాత్రమే వాహనాల విక్రయాలు పడిపోవడాన్ని సీఎం జగన్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఇందుకు కారణాలు తెలుసుకుని తిరిగి అమ్మకాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

ఏపీలో పడిపోయిన బైకుల విక్రయాలు.. చర్యలకు సీఎం ఆదేశం
X

ఏపీలో ద్విచక్ర వాహనాల విక్రయాలు నెమ్మదించాయి. దేశవ్యాప్తంగా విక్రయాల్లో వృద్ధి నమోదు కాగా, ఏపీలో మాత్రం విక్రయాలు తగ్గాయి. గతేడాది తొలి ఆరు నెలల్లో ఏపీలో 3.31లక్షల ద్విచక్రవాహనాలు అమ్ముడుపోగా.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 3.10 లక్షల బైకులు మాత్రమే అమ్ముడు పోయాయి. గతేడాది కంటే 6.52 శాతం మేర విక్రయాలు పడిపోయాయి.

అదే సమయంలో దేశ వ్యాప్తంగా ద్విచక్రవాహనాల అమ్మకాల్లో వృద్ధి కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే కర్నాటకలో 58.06 శాతం, తమిళనాడులో 31.52 శాతం మేర విక్రయాలు పెరిగాయి. కార్ల విక్రయాల్లో దేశ వ్యాప్తంగా వృద్ధి రేటు 21 శాతం ఉంటే ఏపీ మాత్రం 8.27 శాతానికే పరిమితమైంది.

ఏపీలో మాత్రమే వాహనాల విక్రయాలు పడిపోవడాన్ని సీఎం జగన్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఇందుకు కారణాలు తెలుసుకుని తిరిగి అమ్మకాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దాంతో డీలర్లు, కంపెనీల ప్రతినిధులతో అధికారులు సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఏపీలో బైకుల విక్రయాలు పడిపోవడానికి రియల్ ఎస్టేట్ ప‌డిపోవ‌డం, పెట్రోల్ ధరలు అధికంగా ఉండడం, నిర్మాణ రంగం నెమ్మదించడం వంటి అంశాలను కారణంగా భావిస్తున్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేకపోవడంతోనూ కొత్త వాహనాల కొనుగోలు విషయంలో కొనుగోలుదారులు వెనుకడుగు వేస్తున్నారని డీలర్లు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ద్విచక్ర వాహనాల విక్రయాలు భారీగా పడిపోవడం బట్టే ఏపీలో ఆర్థిక నిర్వాహణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని బీజేపీ విమర్శిస్తోంది.

ఉపాధి అవకాశాలు కల్పించకుండా కేవలం పంచుడు కార్యక్రమాలు, మూడు రాజధానుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీయడం వంటి జగన్‌ చర్యలతోనే ఈ పరిస్థితి వచ్చిందని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి విమర్శించారు.

First Published:  31 Oct 2022 2:14 AM GMT
Next Story