Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుపై సాక్షి మీడియా పెద్ద ఆరోపణ

పాదయాత్ర సాదాసీదాగా సాగితే మన మీడియా తప్ప ఇతర మీడియా సంస్థలు కవరేజ్ ఇవ్వవని.. మీడియా సంస్థలు టీఆర్‌పీ రేటింగును బట్టి ప్రచారం కల్పిస్తాయని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్టు వైసీపీ మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది.

చంద్రబాబుపై సాక్షి మీడియా పెద్ద ఆరోపణ
X

నారా లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో రాబోయే పరిణామాలను ముందే ఊహించుకుని అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షం ఎవరి వాదనలను వారు ముందే సిద్ధం చేసుకుంటున్నారు. నారా లోకేష్ పాదయాత్రకు హైప్‌ సృష్టించే ప్రయత్నంలో ఉన్న చంద్రబాబు నాయుడు తన పార్టీ నాయకులకు కొన్ని ప్రమాదకరమైన సూచనలు చేశారని జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రముఖంగా ఆరోపిస్తోంది. లోకేష్ పాదయాత్ర సమయంలో ఎక్కడికక్కడ గొడవలకు దిగాల్సిందిగా పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచన చేశారని సాక్షి మీడియా ఆరోపిస్తోంది.

పాదయాత్ర సాదాసీదాగా సాగితే మన మీడియా తప్ప ఇతర మీడియా సంస్థలు కవరేజ్ ఇవ్వవని.. మీడియా సంస్థలు టీఆర్‌పీ రేటింగును బట్టి ప్రచారం కల్పిస్తాయని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్టు వైసీపీ మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది. నారా లోకేష్ పాదయాత్రకు హైట్ తీసుకురావాల్సి ఉందని, మీడియా దృష్టిని ఆకర్షించేలా ప్రతి చోట ఏదో ఒక ఇష్యూను లేవనెత్తాలని దిశా నిర్దేశం చేశారని ఆరోపిస్తోంది. వైసీపీ వాళ్లు అడ్డుకుంటున్నారని, పోలీసులు జనాన్ని రాకుండా నియంత్రిస్తున్నారని, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించలేదని, సరైన రక్షణ కల్పించలేదని.. ఇలా ఏదో ఒక కారణంతో వీలైనంతవరకు గొడవలకు దిగాలని చంద్రబాబు సూచన చేశారని వైసీపీ పత్రిక ఆరోపిస్తోంది.

మీడియా దృష్టిని ఆకర్షించే అంశానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా పార్టీ నాయకులకు చంద్రబాబు చెప్పారంటోంది వైసీపీ పత్రిక. లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఆ మీడియా చెబుతోంది. కవరేజ్ పేరుతో సాక్షి విలేకరులు వస్తే తరిమికొట్టాలని కూడా చంద్రబాబు చెప్పారట. సాక్షి విలేకరులని బెదిరించినా, కొట్టినా పర్వాలేదు.. విలేకరులని తెలియక, అనుమానాస్పదంగా తిరుగుతుండటంతోనే దాడి జరిగిందని తర్వాత చెప్పుకోవచ్చని చంద్రబాబు సూచించారని సాక్షి మీడియా కథనం. స్థానిక నాయకులపై నమ్మకం లేక లోకేష్ పాదయాత్ర కోసం ప్రత్యేకంగా 500 మంది సభ్యులతో ఒక టీంను రెడీ చేయించారని.. ఇప్పటికే ఆ టీం కుప్పానికి చేరుకుందని కూడా వైసీపీ మీడియా చెబుతోంది.

First Published:  27 Jan 2023 3:51 AM GMT
Next Story