Telugu Global
Andhra Pradesh

'బీహారీ దొంగ'.. సాక్షి రియాక్షన్ కాస్త ఘాటుగా

ఇప్పటికే చంద్రబాబు ఒక పీకే (పవన్ కల్యాణ్)తో జట్టు కట్టారు. ఇప్పుడు మరో పీకే (ప్రశాంత్ కిశోర్)తో మంతనాలు జరుపుతున్నారు. వీరిద్దరి వల్ల, వీరికి తోడు మరో ఇద్దరిని చేర్చుకోవడం వల్ల టీడీపీ గెలుపు అవకాశాలు పెరుగుతాయా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.

బీహారీ దొంగ.. సాక్షి రియాక్షన్ కాస్త ఘాటుగా
X

వచ్చే ఎన్నికలకోసం టీడీపీతో ప్రశాంత్ కిశోర్ జట్టు కడుతున్నారనే వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రశాంత్ కిషోర్ తో చంద్రబాబు భేటీ వార్తను ఎల్లో మీడియా ఓ రేంజ్ లో హైలైట్ చేస్తోంది. ఇంకేముంది 2024లో టీడీపీదే విజయం అంటూ తీర్మానించేసింది. అయితే సాక్షి కూడా ఈ కలయికను ఎందుకో కాస్త ఎక్కువగా ఊహించినట్టు అనిపిస్తోంది. అందుకే వెంటనే ఓ ఆర్టికల్ ఇచ్చేసింది. 'బీహారీ దొంగ'తో చంద్రబాబు చెట్టపట్టాల్ అంటూ ఘాటు టైటిల్ పెట్టింది. అయితే 'బీహారీ దొంగ' అని నేరుగా కామెంట్ చేయకుండా.. గతంలో చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ ని అలా వెటకారం చేశారంటూ కవర్ చేసింది. మొత్తానికి వారిద్దరి కలయిక తమకేమాత్రం ఇష్టంలేదన్నట్టుగా ఆకాశరామన్న రాసినట్టు ఓ కథనం ఇచ్చింది సాక్షి.

ఇద్దరు పీకేలు ఏం చేస్తారు..

ఇప్పటికే చంద్రబాబు ఒక పీకే (పవన్ కల్యాణ్)తో జట్టు కట్టారు. ఇప్పుడు మరో పీకే (ప్రశాంత్ కిశోర్)తో మంతనాలు జరుపుతున్నారు. వీరిద్దరి వల్ల, వీరికి తోడు మరో ఇద్దరిని చేర్చుకోవడం వల్ల టీడీపీ గెలుపు అవకాశాలు పెరుగుతాయా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. చంద్రబాబు తనకు తానే మేథావి, వ్యూహకర్త అనుకుంటారు, ఎల్లో మీడియాతో అలాగే ప్రచారం చేయించుకుంటారు. కానీ ఇప్పుడు ఆ మేథావి మరో మేథావిని సలహాలకోసం పిలిపించుకోవడం మాత్రం వింతగానే ఉంది. అందులోనూ గత ఎన్నికల సమయంలో వైసీపీతో పనిచేస్తున్నందుకు ఎవరినైతే చంద్రబాబు ఘాటుగా విమర్శించారో, ఇప్పుడు అదే ప్రశాంత్ కిశోర్ ని పిలిపించుకోవడం మరీ విశేషం. ఈ వ్యవహారాన్నే సాక్షి హైలైట్ చేసింది.

గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యూహకర్తగా పనిచేశారు. ఆయన వ్యూహాలు ఫలించడంతోపాటు, చంద్రబాబుని జనం పూర్తిగా అర్థం చేసుకుని, జగన్ కి ఒక అవకాశం ఇచ్చి చూద్దామనుకున్నారు కాబట్టే వైసీపీ అధికారంలోకి రాగలిగింది. అలాంటి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు వైరి వర్గంతో మంతనాలు చేస్తున్నారు. కేవలం ప్రశాంత్ కిశోర్ వల్లే జాతకాలు తారుమారవుతాయి అనుకోలేం. అయితే ఆయన వ్యూహాలను అంత తేలిగ్గా తీసిపారేయలేం. ప్రస్తుతం ఏపీలో వైసీపీ కూడా పీకే టీమ్ లోని పాత సభ్యులు పని చేస్తున్నారు. ఐ-ప్యాక్ తో వైసీపీ ఒప్పందం కొనసాగుతోంది. వారి సర్వేల ఆధారంగానే ఇటీవల ఇన్ చార్జ్ లను కూడా మార్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, రాబిన్ సింగ్ సలహాలు తీసుకుంటుండగా, ఇకపై ప్రశాంత్ కిశోర్ కూడా వారితో కలసి పనిచేస్తారనే ప్రచారం జరుగుతోంది. పీకే ఎంట్రీతో ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టింది. మరి రిజల్ట్ లో కూడా ఆ స్థాయి ప్రభావం కనపడుతుందా లేదా అనేది వేచి చూడాలి.

First Published:  23 Dec 2023 1:01 PM GMT
Next Story