Telugu Global
Andhra Pradesh

పవన్ పరామర్శ ఎవరికి.. ? హంతకులకా, బాధితులకా..?

ఎరుపు, కాషాయం కలిసి పసుపు అవుతుందేమోనని కౌంటర్ ఇచ్చారు. ఎంత మంది కలిసినా మంచిదే అని, పంది కొక్కులు, ఎలుకలు, అన్నీ కలిస్తే ఎవరి విలువలు ఏంటో మరోసారి బయటపడుతుందన్నారు సజ్జల.

పవన్ పరామర్శ ఎవరికి.. ? హంతకులకా, బాధితులకా..?
X

11మందిని హత్య చేసిన హంతకుడిని ఎవరైనా పరామర్శిస్తారా, ప్రపంచంలో దీన్ని ఎక్కడైనా పరామర్శ అని అంటారా.. అంటూ పవన్ పై సెటైర్లు వేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామృష్ణారెడ్డి. 11 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబుని పవన్ పరామర్శించటం సిగ్గుచేటన్నారు. చనిపోయిన వారి కుటుంబాలను ఆయన ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు.

ఎరుపు, కాషాయం కలిస్తే పసుపు..

జనసేన, టీడీపీ కలవటాన్ని వామపక్షాలు స్వాగతించటం విచిత్రంగా ఉందన్నారు సజ్జల. బీజేపీ కూడా ఆ కూటమిలో కలిస్తే వామపక్షాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలన్నారు. అప్పుడు ఎరుపు, కాషాయం కలిసి పసుపు అవుతుందేమోనని కౌంటర్ ఇచ్చారు. ఎంత మంది కలిసినా మంచిదే అని, పంది కొక్కులు, ఎలుకలు, అన్నీ కలిస్తే ఎవరి విలువలు ఏంటో మరోసారి బయటపడుతుందన్నారు సజ్జల. అందర్నీ కలిపి ఒకేసారి ఓడించే అవకాశం కూడా జగన్‌ కు వస్తుందన్నారు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంలో లేరని స్పష్టం చేశారాయన. ప్రతిపక్షాలు తాము సజీవంగా ఉన్నామని చెప్పటానికి ముందస్తు ప్రకటనలు చేస్తున్నాయని విమర్శించారు.

అది అక్రమ సంబంధమే..

ప్రతిపక్ష నేతలు రహస్యంగా ఎందుకు సమావేశాలు అవుతున్నారని ప్రశ్నించిన సజ్జల, వారి అక్రమ సంబంధాలను సక్రమం అని చెప్పటానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్, చంద్రబాబు ఏం చర్చించారో ఎందుకు బయట పెట్టరని నిలదీశారు. సీట్లు, ఓట్లు గురించి మాట్లాడుకున్నారా? ప్యాకేజ్ గురించి చర్చించారా? అని ప్రశ్నించారు. పగటి వేషగాళ్లు వస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఈ విషయాలన్నీ అర్ధం కావాలనే ఉద్దేశంతోనే పవన్-బాబు మీటింగ్ పై అంత మంది వైసీపీ నాయకులు స్పందించారని చెప్పుకొచ్చారు.

First Published:  9 Jan 2023 10:50 AM GMT
Next Story