Telugu Global
Andhra Pradesh

అవినాష్ రెడ్డి ఎక్కడికీ పారిపోలేదు - సజ్జల

వివేకాను నరికి చంపానన్న వ్యక్తి ప్రెస్ మీట్లు పెడుతున్నారని, కేవలం అనుమానంతో విచారణ ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిపై మాత్రం బురదజల్లుతున్నారని మండిపడ్డారు సజ్జల.

అవినాష్ రెడ్డి ఎక్కడికీ పారిపోలేదు - సజ్జల
X

తల్లి అనారోగ్యంతో ఉండటంతో సీబీఐ విచారణకు రాలేనని చెప్పి ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందులకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై రకరకాల పుకార్లు వినపడుతున్నాయి. అరెస్ట్ కు భయపడే అవినాష్ రెడ్డి ఇలా పులివెందుల వెళ్లిపోయారంటూ టీడీపీ అనుకూల మీడియాలో వార్తలొస్తున్నాయి. అలాంటి వార్తల్ని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యం గురించి సీబీఐకి సమాచారం ఇచ్చారని చెప్పారు. ఆయన ఎక్కడికీ పారిపోలేదని వివరణ ఇచ్చారు సజ్జల.

అండర్ గ్రౌండ్ లో ఉన్నారా..?

అవినాష్ రెడ్డి పులివెందుల వెళ్తుంటే మీడియా వెంటపడటాన్ని సజ్జల ఖండించారు. అదే సమయంలో మీడియా వాహనంపై జరిగిన దాడిని కూడా ఖండిస్తున్నట్టు చెప్పారాయన, అది దురదృష్టకరం అన్నారు. అసలా దాడి విషయం అవినాష్ రెడ్డికి తెలిసి ఉండదని చెప్పారు. అవినాష్ అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చారా..? ఆయన ఎక్కడికి, ఎందుకు వెళ్తున్నారో తెలుసు కదా..? అంతమాత్రాన ఆయన వెంట పడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

అవినాష్ రెడ్డి నాన్న కూడా హుందాగా విచారణకు వెళ్లారని గుర్తు చేశారు సజ్జల. వివేకాను నరికి చంపానన్న వ్యక్తి ప్రెస్ మీట్లు పెడుతున్నారని, కేవలం అనుమానంతో విచారణ ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిపై మాత్రం బురదజల్లుతున్నారని మండిపడ్డారు. విచారణతో ఆయన నిర్దోషిత్వం తేలుతుందని చెప్పారు. అయితే ఈలోగా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడటం మీడియాకు సమంజసం కాదని చెప్పారు.

అప్పుడేం చేశారు..?

వైఎస్ వివేకా హత్య జరిగిన తర్వాత చంద్రబాబు మూడు నెలలు అధికారంలోనే ఉన్నారని, అవినాష్ రెడ్డి పాత్ర ఉందని తేలితే అప్పుడేం చేశారని నిలదీశారు సజ్జల. నిజంగానే అవినాష్ రెడ్డిని జగన్ కాపాడాలనుకుంటే, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ విచారణకు వెళ్లే లోగా కేసు క్లోజ్ చేయించేవారు కదా అని ప్రశ్నించారు. బెయిల్ రాకపోవడంతో తల్లికి అనారోగ్యం అని సీన్ క్రియేట్ చేసి విచారణను తప్పించుకుపోయేంత ఛండాలమైన ఆలోచనలు ఎవరికీ లేవన్నారు. రక్తపు మరకలు తుడిచిందెవరు, లెటర్ దాచిపెట్టిందెవరనే విషయం అందరికీ తెలుసన్నారు సజ్జల. సునీతమ్మ కూడా టీడీపీతో కలిసి మంత్రాంగం నడిపుతున్నారని అన్నారు.

First Published:  19 May 2023 10:29 AM GMT
Next Story