Telugu Global
Andhra Pradesh

జగన్‌ చేసిన అన్యాయం ఏంటో స్పష్టంగా చెప్పాలి..

షర్మిల మాట్లాడిన ప్రతి దానికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. వైఎస్సార్‌టీపీ అని తెలంగాణలో పార్టీ పెట్టారని, తర్వాత తీసేశారని, మరి ఆ పార్టీ కోసం పనిచేసినవారికి ఆమె ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

జగన్‌ చేసిన అన్యాయం ఏంటో స్పష్టంగా చెప్పాలి..
X

షర్మిలకు జగన్‌ ఏం అన్యాయం చేశారో ఆమె స్పష్టంగా చెప్పాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యంలో పదవులన్నీ కుటుంబానికే ఇస్తారా..? అని ప్రశ్నించారు. హఠాత్తుగా ఏపీలో అడుగుపెట్టిన షర్మిల.. రావటమే తమపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదని.. ఆమె వ్యాఖ్యలకు పొంతన ఉండడం లేదని సజ్జల తెలిపారు. వైఎస్సార్‌ పథకాలను తుంగలో తొక్కింది కాంగ్రెస్‌ పార్టీయేనని, జగన్‌కి చెల్లెలుగా, వైఎస్సార్‌కి కూతురిగా మాత్రమే షర్మిల ప్రజలకు తెలుసని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ వైఎస్సార్‌ ఫ్యామిలీని ఎంతగా వేధించిందీ షర్మిలకు తెలుసన్నారు.

కాంగ్రెస్‌ జగన్‌ని అడుగడుగునా వేధించింది...

విజయవాడలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సజ్జల మాట్లాడారు. షర్మిల మాట్లాడిన ప్రతి దానికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. వైఎస్సార్‌టీపీ అని తెలంగాణలో పార్టీ పెట్టారని, తర్వాత తీసేశారని, మరి ఆ పార్టీ కోసం పనిచేసినవారికి ఆమె ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. జగన్‌ కోసం లక్షలాది మంది ఆనాడు కదిలొచ్చారని, ఓదార్పు యాత్ర వద్దన్నందుకు జగన్‌ కాంగ్రెస్‌ నుంచి బయటికొచ్చారని చెప్పారు. సొంత బాబాయి వివేకానందరెడ్డితో ఎదురు పోటీ చేయించారని గుర్తుచేశారు. 16 నెలలు జైల్లో పెట్టించారని తెలిపారు. జగన్‌పై మోపినవన్నీ అక్రమ కేసులని అందరికీ తెలుసని ఆయన చెప్పారు. అప్పట్లో ఆ కేసులను దర్యాప్తు చేసిన అప్పటి సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ సైతం ఆ కేసుల్లో అవినీతి లేదని స్పష్టం చేశారని సజ్జల గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ జగన్‌ని అడుగడుగునా వేధింపులకు గురిచేసిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆ పార్టీ తరపున రాష్ట్రంలో అడుగుపెట్టిన షర్మిల.. వైఎస్సార్‌ ఆశయాలను ఏ ఒక్కటీ జగన్‌ అమలు చేయలేదని అంటున్నారని, దానిని బట్టే ఆ స్క్రిప్టు ఆమెకు ఎవరి నుంచి వచ్చిందనేది అర్థమవుతోందని సజ్జల తెలిపారు.

షర్మిల అబద్ధాలను ప్రజలు గుర్తిస్తూనే ఉన్నారు...

షర్మిల చెబుతున్న అబద్ధాలను ప్రజలు గుర్తిస్తూనే ఉన్నారని సజ్జల తెలిపారు. గతంలో ఏనాడూ షర్మిల గురించి గొప్పగా రాయని ఎల్లో మీడియా.. సీఎం జగన్‌ని విమర్శించినందుకే షర్మిలను ఇప్పుడు భుజాన వేసుకుంటోందని ఆయన గుర్తుచేశారు. గతంలో తన అన్న జగన్‌ కోసం తిరిగిన షర్మిల.. ఏం ఆశించి తిరిగారో చెప్పాలని ఆయన నిలదీశారు. ఏపీలో అమలవుతున్న పథకాలు బీజేపీవా? అని ప్రశ్నించారు. మరెందుకని తాము బీజేపీతో కలిశామని ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. స్టీల్‌ ప్లాంట్‌ గురించి తాము చేయాల్సిన పోరాటం చేశాం కాబట్టే ప్రస్తుతం అది ఆగిందని ఆయన గుర్తుచేశారు. పోర్టుల గురించి షర్మిల తలాతోకా లేకుండా మాట్లాడటం సబబు కాదన్నారు. మణిపూర్‌ విషయం గురించి షర్మిల పార్టీ తెలంగాణలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని సజ్జల ప్రశ్నించారు. ఏపీలోకి వచ్చాకే ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు.

ప్లాన్‌ ప్రకారమే బాబు షర్మిలను తీసుకొచ్చారు...

ప్రభుత్వ వ్యతిరేక ఓటు కోసమే ఓ ప్లాన్‌ ప్రకారం చంద్రబాబు షర్మిలను తెచ్చారని, చంద్రబాబుకు ఎంత అవసరమో అంతే షర్మిల మాట్లాడుతోందని సజ్జల చెప్పారు. అంతకంటే ఎక్కువ మాట్లాడితే చంద్రబాబు ఒప్పుకోడన్నారు. ఈ 56 నెలల్లో చేసిన అభివృద్ధి గురించి జగన్‌ మాట్లాడితే దాన్ని ఎల్లోమీడియా వక్రీకరించిందన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినందున తన జన్మ ధన్యమైందని జగన్‌ చెప్పిన మాటలను కూడా ఎల్లోమీడియా వక్రీకరించిందన్నారు. చంద్రబాబుకు, షర్మిలకు మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందో చెప్పాలని ఈ సందర్భంగా సజ్జల డిమాండ్‌ చేశారు.

First Published:  26 Jan 2024 3:19 AM GMT
Next Story