Telugu Global
Andhra Pradesh

అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశావ్ బాబూ..?

వాలంటీర్ వ్యవస్థ గురించి తమ ప్రభుత్వం గర్వంగా ఫీలవుతుందన్నారు సజ్జల. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు మాఫియా లాగా దోచుకున్నాయని మండిపడ్డారు.

అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశావ్ బాబూ..?
X

అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఒక్క మేలు కూడా చేయని చంద్రబాబు.. ఇప్పుడు బీసీ డిక్లరేషన్ అంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి. చేతిలో అధికారం ఉన్నప్పుడు బీసీల గురించి ఆలోచించని ఆయనకు ఇప్పుడు వారి గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు. కొత్తగా వచ్చిన పార్టీ తరహాలో చంద్రబాబు బీసీలకు హామీలిస్తున్నారని, జగన్ చేసినవన్నీ తానే చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు ప్రవర్తన బరితెగించేలా ఉందని ఎద్దేవా చేశారు సజ్జల.

చంద్రబాబుకు సొంత బలం ఉంటే పొత్తులెందుకని ప్రశ్నించారు సజ్జల. పురందేశ్వరి, షర్మిల, సీపీఐ, సీపీఎం, దత్తపుత్రుడుతో పాటు ఇప్పుడు మేధావులు అంటూ మరికొందరితో కలసి చంద్రబాబు విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకి అనుకూలంగా సర్వేలు లేవని, అయినా కూడా ఏపీలో పరిస్థితి తనకు అనుకూలంగా ఉన్నట్టు ఆయన అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు సజ్జల.

జన్మభూమి కమిటీలు మళ్లీ తెస్తారా..?

నిన్న మొన్నటి వరకు వాలంటీర్లపై అవాకులు చెవాకులు పేలిన చంద్రబాబు ఇప్పుడు వారిని ప్రసన్నం చేసుకోడానికి లేనిపోని హామీలిస్తున్నారని మండిపడ్డారు సజ్జల. వాలంటీర్ వ్యవస్థ గురించి తమ ప్రభుత్వం గర్వంగా ఫీలవుతుందన్నారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు మాఫియా లాగా దోచుకున్నాయని మండిపడ్డారు. దమ్ముంటే జన్మభూమి కమిటీలు పునరుద్ధరిస్తామని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారాయన.

జగన్ బీసీలకు 70శాతం పదవులిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు సజ్జల. అన్ని వర్గాల్లో ఉన్న మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని, ఆయా వర్గాల్లో నాయకత్వ పటిష్టతకు కృషి చేశారని.. గతంలో ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ జరగలేదన్నారు. చట్టం చేసి మరీ జగన్ చర్యలు చేపట్టారని, బీసీల అభివృద్ధిపై ఆయనకు ఉన్న నిబద్ధత మరొకరికి లేదన్నారు. వైసీపీలో అవకాశం లేక గుమ్మనూరి జయరాం బయటకు వెళ్తే.. ఆయన్ను టీడీపీలో చేర్చుకుంటున్నారని, గతంలో జయరాం అక్రమాలు చేశారని విమర్శించిన బాబు ఇప్పుడెలా కండువా కప్పుతున్నారని ప్రశ్నించారు సజ్జల.

First Published:  5 March 2024 10:43 AM GMT
Next Story