Telugu Global
Andhra Pradesh

భూకబ్జాలు చేసేవారికి ఈ చట్టం నచ్చదు..

కబ్జాలకు అలవాటు పడిన చంద్రబాబు లాంటి వాళ్లకి ఈ సంస్కరణలు నచ్చవన్నారు సజ్జల. టీడీపీ ప్రభుత్వంలో భూములు లీజుకి ఇచ్చి కొల్లగొట్టేవారని విమర్శించారు.

భూకబ్జాలు చేసేవారికి ఈ చట్టం నచ్చదు..
X

కొవిడ్ వైరస్ కంటే చంద్రబాబు ముఠా ప్రమాదకరం అని తీవ్రంగా విమర్శించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ గురించి దుష్ప్రచారం చేస్తున్న టీడీపీపై ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నామని చెప్పారాయన. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను బట్టి రాష్ట్ర ప్రజలు ఈ విషయంలో ఓ అవగాహనకు రావాలని, టీడీపీ చేస్తున్నది దుష్ప్రచారం అని అర్థం చేసుకోవాలన్నారు. వ్యవస్థల మీద నమ్మకం పోయేవిధంగా టీడీపీ-జనసేన వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వాధినేత భూములు మింగేస్తారని చెప్పడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు సజ్జల.

వాస్తవం ఇది..

అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ చట్టం తెచ్చామన్నారు సజ్జల. అది ఇంకా గజిట్ కాలేదని, చట్టం అమలులోకి రాలేదని, విధి విధానాలు ఖరారు కాకముందే ఎన్నికల కోసం ఈ రకంగా ప్రచారం చేస్తారా? అని విమర్శించారాయన. ఈ చట్టం తేవడం ఒక విప్లవాత్మక మార్పు అని అన్నారు. అసలు ల్యాండ్ గ్రాబింగ్ చేసిందే టీడీపీ అని చెప్పారు సజ్జల. టీడీపీ హయాంలో వెబ్ ల్యాండ్ పేరుతో భూముల అక్రమాలకు పాల్పడ్డారని, వెబ్ ల్యాండ్ పోర్టల్‌లో మార్పులు చేసి ఎంతో మంది భూములను ఇబ్బందుల్లోకి నెట్టారని, సీఆర్‌డీఏ పరిధిలోని భూములను డీమ్డ్ మ్యుటేషన్ పేరుతో అక్రమంగా కొల్లగొట్టారన్నారు. ఈ అరాచకాలన్నిటినీ అడ్డుకునేందుకే సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని వివరించారు సజ్జల.

వారికి ఇవి నచ్చవు..

చంద్రబాబు లాంటి వారికి ఈ చట్టాలు నచ్చవని అన్నారు సజ్జల. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తన వర్గానికి మాత్రమే భూములు కట్టబెట్టారని, లీజుకు ఇవ్వడం, వాటిని కొల్లగొట్టడం ఆయనకు అలవాటు అని అన్నారు. కబ్జాలకు అలవాటు పడిన వాళ్లకి సంస్కరణలు నచ్చవన్నారు సజ్జల. సమగ్ర భూ సర్వే పూర్తి అయిన తర్వాత భూముల రక్షణ విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. కబ్జాలు,అక్రమాలు, అన్యాయాలకు అడ్డుకట్ట పడుతుందనేది చంద్రబాబు భయం అని అందుకే ఆయన ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని వివరించారు సజ్జల.

First Published:  5 May 2024 2:20 AM GMT
Next Story