Telugu Global
Andhra Pradesh

అవినాష్ కి సంబంధం లేదు.. డైరెక్షన్ చంద్రబాబుదే..

వివేకా హత్యకు, రెండో పెళ్లికి సంబంధం ఉందని ఆంధ్రజ్యోతిలో వేశారని, కుటుంబసభ్యులంతా కలిసి వివేకా చెక్‌ పవర్‌ తీసేశారని కూడా అదే పత్రికలో రాశారని గుర్తు చేశారు సజ్జల.

అవినాష్ కి సంబంధం లేదు.. డైరెక్షన్ చంద్రబాబుదే..
X

అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ అనంతరం వైసీపీ నేతలు ఒక్కొక్కరే ఆయనకు మద్దతుగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఈ వ్యవహారంలో జగన్ ని నైతికంగా దెబ్బతీసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వివేకా హత్య కేసుతో అవినాష్‌ రెడ్డికి సంబంధం లేదని చెప్పారు. అవినాష్‌ రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. సరిగ్గా ఎన్నికల ముందు వివేకా హత్య కేసు ద్వారా తమ నాయకుడిని నైతికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డికి వివేకా హత్యతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలున్నాయని సజ్జల పేర్కొన్నారు.

వివేకా హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని, కొందరిని టార్గెట్‌ చేస్తూ విచారణ చేస్తున్నారని అన్నారు సజ్జల. వివేకా బావమరిది శివప్రకాష్‌ రెడ్డి ఫోన్‌ చేస్తేనే అవినాష్‌ రెడ్డి అక్కడకు వెళ్లారని గుర్తు చేశారు. వివేకా ఫోన్‌ లోని కాల్ రికార్డులను ఎందుకు డిలీట్‌ చేశారని సజ్జల ప్రశ్నించారు. వివేకా హత్యకు, రెండో పెళ్లికి సంబంధం ఉందని ఆంధ్రజ్యోతిలో వేశారని, కుటుంబసభ్యులంతా కలిసి వివేకా చెక్‌ పవర్‌ తీసేశారని కూడా అదే పత్రికలో రాశారని గుర్తు చేశారు సజ్జల.

చంద్రబాబు హయాంలోనే వివేకా హత్య జరిగిందని, బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డి, వివేకా అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి ఫోన్‌ రికార్డులు ఎందుకు చూడలేదని ప్రశ్నించారు సజ్జల. శివశంకర్‌ రెడ్డి తమ పార్టీ నాయకుడేనని, వైఎస్‌ఆర్, వివేకాతో కలిసి పనిచేశారని, శివశంకర్‌ రెడ్డి తప్పు చేయలేదని తాము భావిస్తున్నామన్నారు. వివేకా హత్య కేసులో స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ మొత్తం చంద్రబాబుదేనన్నారు సజ్జల. సీబీఐ దర్యాప్తు వెనక రాజకీయ ప్రమేయం కచ్చితంగా ఉందని చెప్పారు. బీజేపీలో ఉన్న చంద్రబాబు కోవర్డులు సీబీఐ విచారణను ప్రభావితం చేస్తున్నారని చెప్పారు సజ్జల. గతంలో వైఎస్ఆర్ పై కూడా ఫ్యాక్షనిస్ట్‌ అనే ముద్ర వేసేందుకు చంద్రబాబు కుట్రలు చేశారని, ఇప్పుడు జగన్ పై కూడా అలాగే కుట్రలు చేస్తున్నారన్నారు.

First Published:  24 Feb 2023 3:32 PM GMT
Next Story