Telugu Global
Andhra Pradesh

మళ్లీ వార్తల్లో రుషికొండ.. ఈసారి ఏమైందంటే..?

విశాఖకు పాలనా రాజధాని తీసుకొస్తామంటోంది ప్రభుత్వం. మహూర్తాలు మారిపోయినా, ఎన్నికలలోపు కాపురం వచ్చేయాలని చూస్తున్నారు సీఎం జగన్. అంతా బాగానే ఉంది కానీ, పదే పదే విశాఖ వార్తల్లోకెక్కడం మాత్రం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది.

మళ్లీ వార్తల్లో రుషికొండ.. ఈసారి ఏమైందంటే..?
X

రుషికొండ విషయంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రచ్చ జరుగుతోంది. రుషికొండను బోడిగుండుగా చేశారని, పర్యావరణానికి తూట్లు పొడిచారని, కొండను పిండి చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేదే లేదంటోంది. రుషికొండ బీచ్ విషయంలో కూడా ప్రభుత్వం ఇదే మొండి పట్టుదలతో వెళ్తున్నట్టు తెలుస్తోంది.

బీచ్ సంగతేంటి..?

రుషికొండ అభివృద్ధి పనులు మొదలు పెట్టిన తర్వాత, బీచ్ ని కూడా మరింత ఆహ్లాదకరంగా తయారు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పర్యాటకులనుంచి ఫీజు వసూలు చేసేందుకు సిద్ధపడింది. ఆ నిర్ణయాన్ని స్థానికులు తప్పుబట్టారు, ప్రతిపక్షాలు కూడా గొడవ చేయడంతో వెనక్కి తగ్గింది ప్రభుత్వం. ఎంట్రీ ఫీజు లేదని తేల్చి చెప్పింది. అయితే పరోక్షంగా పార్కింగ్ ఫీజు రూపంలో బాదిపడేస్తోంది. పార్కింగ్ ఫీజుల్ని రెట్టింపు చేయడంతో రుషికొండ బీచ్ కు వచ్చేవారు గగ్గోలు పెడుతున్నారు. ఇదెక్కడి అన్యాయం అంటూ నిట్టూరుస్తున్నారు.

బీచ్ లోకి రావాలంటే ఎంట్రీ ఫ్రీ. కానీ బీచ్ బయట బైక్ పెట్టాలంటే రూ.20 పార్కింగ్ ఫీజు కట్టాలి. కారుకి రూ.50, బస్సుకి రూ.100 రూపాయలుగా పార్కింగ్ ఫీజు నిర్ణయించారు. గతంలో ఉన్న రుసుముల్ని రెట్టింపు చేశారు. పాలనా రాజధాని పేరుతో విశాఖ వాసుల సంతోషాన్ని ఆవిరి చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇలా అయితే రుషికొండ బీచ్ కి ఎవరొస్తారని నిలదీస్తున్నారు.

విశాఖకు పాలనా రాజధాని తీసుకొస్తామంటోంది ప్రభుత్వం. మహూర్తాలు మారిపోయినా, ఎన్నికలలోపు విశాఖకు కాపురం వచ్చేయాలని చూస్తున్నారు సీఎం జగన్. అంతా బాగానే ఉంది కానీ, పదే పదే విశాఖ వార్తల్లోకెక్కడం మాత్రం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఆమధ్య ఏకంగా అధికార పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయ్యారు. శాంతి భద్రతల విషయం పదే పదే వార్తల్లోకెక్కుతోంది. ఇక రుషికొండ నిర్మాణాలపై ఎక్కడలేని రచ్చ జరుగుతోంది. ఇప్పుడిలా బీచ్ ల వద్ద పార్కింగ్ ఫీజులు రెట్టింపు చేసి ప్రజల దృష్టిలో పలుచన అవడం అవసరమా అనే కామెంట్లు వినపడుతున్నాయి. పాలనా రాజధానితో అదనపు ప్రయోజనాలు కలగాలి కానీ, ఉన్నవాటిపై భారం వేస్తే ప్రజలనుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముంది.

First Published:  21 Aug 2023 2:38 AM GMT
Next Story