Telugu Global
Andhra Pradesh

మెగా బ్రదర్స్ కి అంత సీన్ లేదు.. రోజా ఘాటు వ్యాఖ్యలు

ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది నానుడి అని, కానీ మెగా సోదరులు ముగ్గురూ సొంత ఊరిలోనే ఓడిపోయారని ఎద్దేవా చేశారు రోజా. రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కి జగన్ ని విమర్శించే అర్హత లేదన్నారు.

మెగా బ్రదర్స్ కి అంత సీన్ లేదు.. రోజా ఘాటు వ్యాఖ్యలు
X

చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ ని ప్రజలు వారి సొంత ఊళ్లలోనే ఓడించారని, సొంత ఊరి ప్రజలే నమ్మనివారిని ఇక రాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్ముతారని ప్రశ్నించారు మంత్రి రోజా. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది నానుడి అని, కానీ మెగా సోదరులు ముగ్గురూ సొంత ఊరిలోనే ఓడిపోయారని ఎద్దేవా చేశారు. రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కి జగన్ ని విమర్శించే అర్హత లేదన్నారు. 2019లో జగన్ సీఎం కాడు అంటూ రెచ్చిపోయిన పవన్ ని ప్రజలు అసెంబ్లీ గేటు తాకకుండా చేశారన్నారు.

ప్రజలు అవే చూపిస్తారు జాగ్రత్త..

షూటింగ్ గ్యాప్‌ లో వచ్చి వేళ్లు, చెప్పులు చూపిస్తే ప్రజలు అవే తిరిగి పవన్ కల్యాణ్ కి చూపిస్తారని హెచ్చరించారు మంత్రి రోజా. నటుడిగా పవన్ కల్యాణ్ ని గౌరవించేవారు కూడా.. వీకెండ్‌ రైటప్స్ తో వస్తే జనం ఆదరించరని పేర్కొన్నారు. సినిమా హీరోలు వస్తే ఓట్లేసేస్తారనే రోజులు పోయాయన్నారు.

పవన్ రాజకీయాలకు పనికిరాడు..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలకు పనికి రాడని మంత్రి రోజా ధ్వజమెత్తారు. చంద్రబాబుకు వత్తాసు పలికే పవన్‌.. ప్రజల సమస్యలు ఎలా పట్టించుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికే వారానికి ఓసారి రాష్ట్రానికి వచ్చి పోతున్న పవన్ ని ఈసారి జనం ఓడిస్తే రాష్ట్రం చుట్టుపక్కలకు కూడా రాడని అన్నారు. బీసీల మీద పవన్‌ కు అసలు ప్రేమ లేదని, బీసీల గురించి మాట్లాడే అర్హత అసలే లేదన్నారు. పవన్ పక్కన ఆయన అన్న నాగబాబు, నాదెండ్ల మనోహర్ తప్ప బీసీలెవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో పోలవరం పూర్తి కాలేదని, అప్పుడు ప్రశ్నించకుండా పవన్ కల్యాణ్ గాడిదలు కాశారా అని ప్రశ్నించారు. ఐదేళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయిన పవన్ ఈరోజు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు రోజా.

First Published:  19 Dec 2022 11:05 AM GMT
Next Story