Telugu Global
Andhra Pradesh

రిచెస్ట్ సీఎం జగన్ ఇలా మాట్లాడమేంటి..? పవన్ కళ్యాణ్ సెటైర్

రెండేళ్ల క్రితం అన్నమయ్య డ్యాం తెగిపోవడంతో 33 మంది జల సమాధి అయ్యారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన పవన్ కళ్యాణ్.. అప్పట్లో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?

రిచెస్ట్ సీఎం జగన్ ఇలా మాట్లాడమేంటి..? పవన్ కళ్యాణ్ సెటైర్
X

భారతదేశంలోనే రిచెస్ట్ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ తరచూ కార్ల్‌ మార్క్స్ తరహాలో క్లాస్‌ వార్ గురించి మాట్లాడుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్ వేశారు. గత రెండు రోజులుగా వైఎస్ జగన్‌ని టార్గెట్ చేస్తూ ట్విట్టర్‌లో విమర్శలు గుప్పిస్తున్న పవన్ కళ్యాణ్ శుక్రవారం కూడా వరుస ట్వీట్స్‌‌తో వైఎస్ జగన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. రెండేళ్ల క్రితం అన్నమయ్య డ్యాం తెగిపోవడంతో 33 మంది జల సమాధి అయ్యారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన పవన్ కళ్యాణ్.. అప్పట్లో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? విచారణకి ఏర్పాటు చేసిన కమిటీ ఏమైంది? అంటూ ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ ఏమని ట్వీట్స్ చేశారంటే? ‘‘19.11.2021 తేదీన తెల్లవారు జామున కురిసిన అతి భారీ వర్షాలకు ఎన్నడూ రానంతగా మూడు లక్షల ఇరవై వేల క్యూసెక్కులు నీరు రావడంతో అన్నమయ్య డ్యాం మట్టికట్ట తెగిపోయింది. హఠాత్తుగా సంభవించిన ఈ వరద వలన మందపల్లి, తొగురుపేట, పులపతూరు, గుండ్లూరు గ్రామాలలోని దాదాపు 33 మంది ప్రజలు జల సమాధి అయ్యారు. దాంతో అన్నమయ్య డ్యామ్‌ని తిరిగి పూర్తిస్థాయిలో పున:నిర్మాణం చేసి ఒక ఏడాదిలోగా ఆయుకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని అప్పట్లో ఘనంగా ప్రకటించారు. కానీ దుర్ఘటన జరిగి ఈరోజుకి 18 నెలలు అయ్యింది. ఈ ప్రాజెక్టు పూర్తి దేవుడికి ఎరుక. కనీసం ఈరోజుకి వీసమెత్తు పనులు కూడా చేయలేదు. ఈ 18 నెలలలో సాధించింది ఏమిటయ్యా అంటే? అస్మదీయుడు పొంగులేటికి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని రూ. 660 కోట్లకు అప్పచెప్పారు.


కేంద్ర జలవనురుల శాఖ మంత్రి షెకావత్ గారు రాజ్యసభలో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారు. అంతర్జాతీయంగా ఈ ఘటన మీద అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని అప్పట్లో ఆయన వాపోయారు. మరోవైపు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం అసెంబ్లీలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ వేస్తున్నాము అని చెప్పారు. అలానే ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించారు. మరి ఆ కమిటీ ఏమైందో వారు రాష్ట్రంలోని మిగతా డ్యాములకి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఏ ఏ సూచనలు చెప్పారో తెలియదు. ఏపీ సీఎం ఏం చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక’’ అని పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్స్ చేశారు.

First Published:  19 May 2023 5:55 AM GMT
Next Story