Telugu Global
Andhra Pradesh

ఆయన ధనిక సీఎం.. ఈయన ధనిక ఎమ్మెల్యే

ధనిక సీఎం సంగతి కాదు, అసలు ధనిక ఎమ్మెల్యే ఎవరో తెలుసా అంటూ మరో లిస్ట్ బయటపెట్టింది సాక్షి. చంద్రబాబుని టార్గెట్ చేసింది. ఈ లిస్ట్ కూడా సదరు ADR సంస్థ తయారు చేసిందే కావడం విశేషం.

ఆయన ధనిక సీఎం.. ఈయన ధనిక ఎమ్మెల్యే
X

దేశంలో ధనిక సీఎం జగన్ అంటూ అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌ (ADR) సంస్థ ఓ లిస్ట్ బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ లిస్ట్ ని టీడీపీ అనుకూల మీడియా హైలెట్ చేస్తూ జగన్ ని టార్గెట్ చేస్తూ కథనాలిస్తోంది. ఏపీ అప్పుల్లో కూరుకుపోతోందని, జగన్ మాత్రం ధనిక సీఎంగా రికార్డులు బద్దలు కొడుతున్నారని దెప్పిపొడుస్తోంది. దీనికి కౌంటర్ గా ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా రంగంలోకి దిగింది. దేశంలో ధనిక సీఎం సంగతి కాదు, అసలు ధనిక ఎమ్మెల్యే ఎవరో తెలుసా అంటూ మరో లిస్ట్ బయటపెట్టింది. చంద్రబాబుని టార్గెట్ చేసింది. ఈ లిస్ట్ కూడా సదరు ADR సంస్థ తయారు చేసిందే కావడం విశేషం.

ధనిక ఎమ్మెల్యే ఎవరంటే..?

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు తమ ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించిన వివరాల ప్రకారం వారి ఆస్తిపాస్తుల వివరాలను ADR ఒకే చోటకు చేర్చి ఓ లిస్ట్ తయారు చేసింది. అందులో దేశంలోనే ధనవంతుడైన ఎమ్మెల్యేగా ఎన్.నాగరాజు మొదటి స్థానంలో ఉన్నారు. ఈయన ఆస్తి విలువ 1,015కోట్ల రూపాయలు. నాగరాజు కర్నాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే. ఆయన తర్వాత డీకే శివకుమార్ రెండో స్థానంలో ఉన్నారు. కర్నాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శివకుమార్ ఆస్తి విలువ 840 కోట్ల రూపాయలు. ఆ తర్వాత మూడో స్థానం చంద్రబాబుదే. దేశవ్యాప్తంగా మూడో స్థానంలో ఉన్న చంద్రబాబు ఏపీలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు. అంటే ఏపీలో సీఎం జగన్ కంటే ఆయనే ధనిక ఎమ్మెల్యే అని చెప్పాలి.

సాక్షి లాజిక్..

ధనిక సీఎంగా జగన్ ని ఎలివేట్ చేస్తున్నారే కానీ, కావాలని చంద్రబాబు పేరుని ఎల్లో మీడియా దాచిపెట్టింది అంటూ సాక్షి కథనాలిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో అత్యధిక ధనవంతుడు చంద్రబాబు అని, ఆ విషయాన్ని ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించింది. ADR రిపోర్ట్ లో ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను సాక్షి సవివరంగా ప్రచురించింది. కావాలనే జగన్ ని టార్గెట్ చేస్తున్నారని, ఏపీలో రిచ్చెస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు అని అంటున్నారు.

First Published:  13 April 2023 10:29 AM GMT
Next Story