Telugu Global
Andhra Pradesh

విశాఖపై అంబానీ ఫోకస్.. భారీ పెట్టుబడులకు సిద్ధం!

విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 తొలి రోజు ముఖేశ్ అంబానీ ప్రత్యేక విమానంలో 15 మంది డైరెక్టర్లను వెంట పెట్టుకొని వచ్చారు. ఆయన హడావిడి చూసి అక్కడకు వచ్చిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఆశ్చర్యపోయారు.

విశాఖపై అంబానీ ఫోకస్.. భారీ పెట్టుబడులకు సిద్ధం!
X

ప్రపంచంలో టాప్ ధనవంతుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు. పెట్రో కెమికల్స్, టెలికాం, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు పలు రంగాల్లో అంబానీకి చెందిన సంస్థలు తమదైన ముద్ర వేశాయి. దేశవ్యాప్తంగా గుజరాత్, మహారాష్ట్ర, ఏపీల్లో ఇప్పటికే అంబానీకి చెందిన సంస్థలు కీలక పెట్టుబడులు పెట్టాయి. ఏపీలోని కృష్ణా-గోదావరి బేసిన్‌లో చమురు, గ్యాస్ ఉత్తత్తికి సంబంధించి భారీ పెట్టుబడులు పెట్టింది. దేశంలో బిజీయెస్ట్ పారిశ్రామిక వేత్తగా ఉన్న ముఖేశ్ అంబానీ ప్రభుత్వాలు నిర్వహించే కార్యక్రమాలకు చాలా అరుదుగా వస్తుంటారు.

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సదస్సులకు హాజరైనా.. ఏవైనా రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మిట్స్ ఏర్పాటు చేస్తే హాజరవడం అరుదుగానే జరుగుతుంది. దక్షిణాదిలో జరిగిన ఏ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కూడా అంబానీ పాల్గొనలేదు. తన కంపెనీకి చెందిన డైరెక్టర్లను మాత్రం పంపేవారు. అంతే కానీ స్వయంగా ఆయన రావడం జరగలేదు. అయితే విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 తొలి రోజు ముఖేశ్ అంబానీ ప్రత్యేక విమానంలో 15 మంది డైరెక్టర్లను వెంట పెట్టుకొని వచ్చారు. ఆయన హడావిడి చూసి అక్కడకు వచ్చిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఆశ్చర్యపోయారు. గతంలో ఇలాంటి సమ్మిట్స్‌పై పెద్దగా ఆసక్తి చూపించని అంబానీ.. వైజాగ్ రావడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.

కాగా, ముఖేశ్ అంబానీ విశాఖ జిల్లాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆలోచిన్నట్లు సమాచారం. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం పరవాడ ప్రాంతంలో భారీ ఇండస్ట్రియల్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నది. ఈ ఇండస్ట్రియల్ క్లస్టర్ విషయంలో అంబానీ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తున్నది. ముఖేశ్ అంబానీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించినా.. ఓకే చేయాలని సీఎం వైఎస్ జగన్ కూడా భావిస్తున్నారు.

ఇప్పటికే రిలయన్స్‌కు సంబంధించి కీలక హోదాలో ఉన్నఅంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీకి వైసీపీ రాజ్యసభ పదవి కట్టబెట్టింది. దీంతో అంబానీ, వైఎస్ జగన్ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరవడం ద్వారా సీఎం జగన్ పరపతి పెరిగేలా చేశారనే చర్చ జరుగుతున్నది. దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రియలిస్ట్ ఏకంగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమ్మిట్ తొలి రోజే హాజరవడం ఒక రకంగా వైఎస్ జగన్ ప్రతిష్టను కూడా పెంచిందని అంటున్నారు.

ఏపీకి పెట్టుబడులు తీసుకొని రావడంతో విఫలం అవుతున్నారన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలకు ఈ సమ్మిట్ ద్వారా సమాధానం చెప్పారు. ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ దావోస్ వెళ్లక పోవడంపై కూడా చంద్రబాబు అండ్ కో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దావోస్‌కు మేము వెళ్లడం కాదు.. దావోస్‌నే ఏపీకి తీసుకొస్తామని అమర్‌నాథ్ గతంలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ మాటలను గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా నిజం చేశారని పొగడ్తలు కురిపిస్తున్నారు. ఏదేమైనా ఈ సమ్మిట్ ద్వారా ప్రతిపక్షాలకు వైఎస్ జగన్ గట్టి సమధానమే చెప్పారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

First Published:  4 March 2023 5:04 AM GMT
Next Story