Telugu Global
Andhra Pradesh

మా కులంలోకి రావొద్దండీ..! ముద్రగడకు ఘాటు లేఖ

"అయ్యా పద్మనాభం గారూ..! మీరు రెడ్డి కులంలో చేరటానికి మా రెడ్లు ఎవరైనా అనుమతి ఇచ్చారా? అయినా మీరు మా రెడ్డి కులంలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు..? మా రెడ్ల పరువు తీయడానికి మీరు చేరాలనుకుంటున్నారా?" అంటూ ఆయనకు ప్రశ్నలు సంధిస్తూ లేఖ విడుదల చేశారు.

మా కులంలోకి రావొద్దండీ..! ముద్రగడకు ఘాటు లేఖ
X

ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఆ విషయం ఓట్లు వేసే వారికే కాదు, పోటీ చేసేవారికి కూడా తెలుసు. కానీ ఇటీవల వ్యక్తిగత ఇగోలకు పోయి తాము గెలవకపోతే చెవికోసుకుంటాం, మెడకోసుకుంటాం.. గెలిచినవాడి బూట్లు నాకుతామంటూ సవాళ్లు విసిరేవాళ్లు ఎక్కువయ్యారు. అసలు పోటీలో లేకుండానే ఇలాంటి సవాల్ విసిరి అడ్డంగా బుక్కయ్యారు ముద్రగడ పద్మనాభం. వాస్తవానికి ముద్రగడను పవన్ కల్యాణ్ నేరుగా కలిసి జనసేన కండువా కప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కేవలం పవన్ కల్యాణ్ తన ఇంటికి రాలేదన్న ఒకే ఒక్క కారణంతో ఆయనకు అలిగి వైసీపీలో చేరారు. అక్కడ చేరిన తర్వాత కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా, పవన్ ని పిఠాపురంలో ఓడిస్తానంటూ సవాల్ విసిరారు. పవన్ ని ఓడించలేకపోతే తన పేరు చివర రెడ్డి అనే పదం చేర్చుకుంటానని కూడా అన్నారు ముద్రగడ.

అన్నట్టుగానే..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు తర్వాత సోషల్ మీడియాలో ముద్రగడను పెద్దఎత్తున ట్రోల్ చేశారు జనసైనికులు. కాపు సామాజిక వర్గానికి చెందిన యువత కూడా పద్మనాభ రెడ్డీ..! అంటూ ఆయన్ను టార్గెట్ చేసింది. దీంతో ఆయన బయటకు రాక తప్పలేదు. తాను ఓటమిని ఒప్పుకున్నానని, తన పేరు మార్పుకోసం కావాల్సిన అన్ని పత్రాలు సిద్ధం చేసుకున్నానని అన్నారు. ఆ తర్వాత కథ అసలు మలుపు తిరిగింది. మీరు మా కులంలో కలుస్తానంటే మేమెలా ఒప్పుకుంటామంటూ కొందరు రెడ్డి సామాజిక వర్గం నేతలు ముద్రగడను టార్గెట్ చేశారు. "అయ్యా పద్మనాభం గారూ..! మీరు రెడ్డి కులంలో చేరటానికి మా రెడ్లు ఎవరైనా అనుమతి ఇచ్చారా? అయినా మీరు మా రెడ్డి కులంలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు..? మా రెడ్ల పరువు తీయడానికి మీరు చేరాలనుకుంటున్నారా?" అంటూ ఆయనకు ప్రశ్నలు సంధిస్తూ లేఖ విడుదల చేశారు.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం మాజీ సర్పంచ్‌ కర్రి వెంకట రామారెడ్డి ముద్రగడ పద్మనాభంను టార్గెట్ చేస్తూ ఈ లేఖ విడుదల చేశారు. ఆయన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆంధ్ర రెడ్డి సంఘం సభ్యులకు కూడా ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. నైతిక విలువలు లేకుండా మాట్లాడే వ్యక్తులు మన రెడ్లలో చేరాలనుకుంటే.. వారిని చేర్చుకోవాల్సిన అవసరం మనకు ఏంటని ప్రశ్నించారాయన. అలాంటి వాళ్లు మన రెడ్లకు దూరంగా ఉంచవలసిన అవసరం సంఘం సభ్యులకు కూడా ఉందన్నారు. ముద్రగడ చేరిక తమకు ఇష్టం లేదని ఆంధ్ర రెడ్డి సంఘం తరపున ఓ ప్రకటన విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

First Published:  10 Jun 2024 4:27 PM GMT
Next Story