Telugu Global
Andhra Pradesh

'రా.. ఎన్టీఆర్' పేరుతో కొత్త కార్యక్రమం

సినిమా హీరో పేరు వాడుకుంటూ, స్వచ్ఛంద సేవా సంస్థ అని చెప్పుకుంటూ సరిగ్గా ఎన్నికల వేళ మేనిఫెస్టో విడుదల చేయడం మాత్రం ఆసక్తికరంగా మారింది.

రా.. ఎన్టీఆర్ పేరుతో కొత్త కార్యక్రమం
X

టైటిల్ చూస్తే ఇదేదో 'రా కదలిరా..' లాగా ఉంది అనుకోవచ్చు. కానీ టీడీపీ ఆధ్వర్యంలో నడిచే ఆ కార్యక్రమానికి దీనికి ఎక్కడా పోలిక లేదు. ఇది కేవలం ఎన్టీఆర్ అభిమానులు చేపట్టిన కార్యక్రమం. అయితే ఆ పేరు చూస్తే మాత్రం టీడీపీ ప్రాయోజిత కార్యక్రమం అనుకునే అవకాశముంది. ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానులు ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టారు.

'RAW-NTR' పేరుతో.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇలాంటివి గతంలో కూడా జరిగాయి, చాలామంది హీరోలు ఇలాంటి స్వచ్ఛంద సేవలు చేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం అభిమానులు ఓ పొలిటికల్ స్టాండ్ తీసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని చెబుతూనే 'రా.. ఎన్టీఆర్' పేరుతో చేపట్టే కార్యక్రమాలకోసం ఓ మేనిఫెస్టో విడుదల చేశారు. ఒక్కో ఏడాది ఒక్కో కార్యక్రమాన్ని అమలు చేస్తామంటూ ఐదేళ్లకు ఐదు ప్రత్యేక కార్యక్రమాల వివరాలు తెలియజేశారు.

మేనిఫెస్టో ఏంటి..?

సినిమా హీరో పేరు వాడుకుంటూ, స్వచ్ఛంద సేవా సంస్థ అని చెప్పుకుంటూ సరిగ్గా ఎన్నికల వేళ మేనిఫెస్టో విడుదల చేయడం మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ అభిమాన సంఘానికి ఎన్టీఆర్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయో లేదో తేలాల్సి ఉంది. ఈ మేనిఫెస్టో వ్యవహారం జూనియర్ ఎన్టీఆర్ కి తెలుసో లేదో చెప్పలేం. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, ఆయన ఏ రాజకీయపార్టీకి మద్దతు ప్రకటించలేదని చెప్పడంలో అంతరార్థమేంటో తేలాల్సి ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎలాంటి పొలిటికల్ కామెంట్లు కూడా చేయడంలేదు. ఆమధ్య ఎన్టీఆర్ అన్న కల్యాణ్ రామ్.. ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతిస్తారంటే కచ్చితంగా టీడీపీ అని మాత్రం చెప్పలేదు. ఆలోచించుకుని చెబుతామన్నారంతే. అంటే ఎన్టీఆర్ మద్దతు కూడా పూర్తి స్థాయిలో టీడీపీకి లేదనే విషయం అర్థమవుతోంది. ఇప్పుడిలా అభిమానులు ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదని తేల్చి చెబుతున్నారు. 'రా.. ఎన్టీఆర్' అనేది మాత్రం అటు టీడీపీలో ఇటు జూనియర్ అభిమానుల్లో కొత్త చర్చకు తావిచ్చింది.

First Published:  3 March 2024 4:39 PM GMT
Next Story