Telugu Global
Andhra Pradesh

విశాఖ‌పై రామోజీ `శోకం`.. వాస్తవాలు ఇవీ..

చంద్రబాబు కోసం ఈనాడు దినపత్రిక దినదినం దిగజారుకుంటూ పోతుంది. నిజానికి ప్రజలు ఈనాడును నమ్మడం ఎప్పుడో మానేశారు. రామోజీరావు తన మీడియాను ఎవరి కోసం వాడుతున్నారనేది, ఆయన తాపత్రయం ఏమిటినేది జన‌మెరిగిన సత్యం.

విశాఖ‌పై రామోజీ `శోకం`.. వాస్తవాలు ఇవీ..
X

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై బురద చల్లి తాను మెచ్చిన, తనకు నచ్చిన చంద్రబాబుకు అధికారం దక్కేలా చూడాలని రామోజీరావు ఈనాడు దినపత్రిక అబద్ధాలను కమ్మటి వార్తాకథనాలుగా వండి వారుస్తున్నది. అందుకు తాజా ఉదాహరణ విశాఖపట్నంపై మొసలి కన్నీరు కారుస్తూ వార్తాకథనాన్ని ఈనాడు ప్రచురించింది. చంద్రబాబు కోసం ఈనాడు దినపత్రిక దినదినం దిగజారుకుంటూ పోతుంది. నిజానికి ప్రజలు ఈనాడును నమ్మడం ఎప్పుడో మానేశారు. రామోజీరావు తన మీడియాను ఎవరి కోసం వాడుతున్నారనేది, ఆయన తాపత్రయం ఏమిటినేది జన‌మెరిగిన సత్యం.

విశోక పట్నం అంటూ శీర్షిక పెట్టి ఈనాడు కారు కూతలు కూసింది. చంద్రబాబు హయాంలోని విషయాలను మరుగుపరిచి, అర్థసత్యాలతోనూ, అసత్యాలతోనూ తన వార్తాకథనాన్ని వదిలింది, అది గురి తప్పని బాణమనేది వేరుగా చెప్పాల్సిన పనిలేదు. వేల మందికి ఉపాధినిచ్చే 1,500 కోట్ల లులును తరిమేశారని, పరిశ్రమలనూ పెట్టుబడులనూ వెళ్లగొట్టారని, ఐటీ రంగాన్ని కూలదోశారని కన్నీరు పెట్టింది. ఇంకా చాలా అబద్ధాలను తనదైన శైలిలో ఈనాడు రాసింది. ఈ వార్తాకథనాల వల్ల వాస్తవాలు వెలుగులోకి వచ్చి చంద్రబాబుకే ఎదురు తిరుగుతుందనే విషయాన్ని రామోజీరావు గుర్తిస్తున్నట్లు లేవు. ఈనాడు వార్తాకథనంలోని వాస్తవాలు ఏమిటో చూద్దాం..

లులుపై కట్టుకథ

లులు సంస్థ విషయంలో ఈనాడు చెప్పిన విషయాలు పచ్చి అబద్ధాలు. లులు కట్టేది షాపింగ్‌ మాల్‌. దానివల్ల పెద్ద ఉద్యోగాలేమీ రావని ఏ మాత్రం ఇంగితం ఉన్నవారికైనా తెలిసిపోతుంది. చంద్రబాబు ప్రభుత్వం 2018లో విశాఖ బీచ్‌ ఎదురుగా ఉన్న వేయి కోట్ల విలువైన 14 ఎకరాల భూమిని నామమాత్రం లీజుతో షాపింగ్‌ మాల్‌ కోసం లులు గ్రూపునకు కట్టబెట్టారు. ఇంత విలువైన భూమిని అంత తక్కువ ధరకు చంద్రబాబు ఎందుకు లీజుకు ఇచ్చారో రామోజీరావు ఎందుకు చెప్పలేదు? దానికితోడు 2018లో లీజుకు తీసుకున్న లులు సంస్థ 2019 వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు.

ధర మొత్తాన్ని చెల్లిస్తే భూమిని అప్పగిస్తామంటూ ఏపిఐఐసి అనేకమార్లు లేఖలు రాసింది. ఆ లేఖలకు స్పందన లేదు. దాంతో ఏపిఐసిసి భూమిని కేటాయించలేదు. ఈ విషయాన్ని రామోజీగారి ఈనాడు మీడియా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్న. జగన్‌ను బద్నాం చేయడానికే ఆ వార్తాకథనాన్ని రాశారు కాబట్టి వాస్తవాలను మరుగుపరచాల్సిన అవసరం ఈనాడుకు ఏర్పడింది.

ఫ్రాంక్లిన్‌ విషయంలోనూ అదే...

ఈనాడు మళ్లీ అదే పని చేసింది. ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌ టౌన్‌ ఇండియా భారీ డెడట్‌ కుంభకోణంలో ఇరుక్కుంది. దాంతో ఆ సంస్థ వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. దాదాపు 29 వేల కోట్ల విలువైన ఆరు డెట్‌ ఫండ్స్‌ను సెబీ నిషేదించింది. పెనాల్టీలు విధించింది. దాంతో ఒకానొక దశలో ఫ్రాంక్లిన్‌ ఇండియా కార్యకలాపాల నుంచి పూర్తిగా వైదొలగాలని ఆనుకుంది. ఆ కారణంగా ఇండియాలో అది విస్తరణ కార్యకలాపాలను నిలిపేసింది.

హెచ్‌ఎస్‌బీసీ కథ ఇదీ...

చైనాకు చెందిన హెచ్‌ఎస్‌బీసి తన విధానపరమైన నిర్ణయంలో భాగంగా భారతదేశానికి చెందిన కార్యకలాపాల నుంచి వైదొలుగుతున్నట్లు 2016లో ప్రకటించింది. ఇందులో భాగంగా విశాఖపట్నంలోనే కాకుండా హైదరాబాద్‌, ఢిల్లీల్లో తన కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. వాస్తవానికి అప్పుడు ముఖ్యమంత్రిగా రామోజీరావుగారి ప్రియ నాయకుడు చంద్రబాబే ఉన్నారు. ఏ దుర్బుద్ధీ లేకపోతే ఈ విషయాన్ని ఈనాడు ఎందుకు దాచేస్తుంది?

ఆదానీ గురించి వాస్తవాలు ఇవీ...

ఆదానీ డేటా సెంటర్‌ కోసం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వచ్చే 20 ఏళ్లలో రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెడుతామని ఒప్పందం చేసుకుంటే జగన్‌ ప్రభుత్వం తీరు వల్ల ఆ మొత్తాన్ని రూ.21,844 కోట్లకు తగ్గించుకుందని ఈనాడు ఇటీవల రాసింది.

వాస్తవానికి జగన్‌ ప్రభుత్వం రాగానే 20 ఏళ్లు అంటే సుదీర్ఘ కాలమని, అప్పటికి సాంకేతిక పరిజ్ఞానంలో పెను మార్పులు సంభవించే అవకాశం ఉందని, అందువల్ల వచ్చే 5 ఏళ్లలో ఎంత వాస్తవ పెట్టుబడి పెడుతారో డీపీఆర్‌ ఇవ్వాలని కోరింది. దాని ప్రకారం ఐదేళ్ల కాలానికి రూ.21,844 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ గ్రూప్‌ స్పష్టం చేసింది. ప్రస్తుతం అదానీ డేటా సెంటర్‌ వైజాగ్‌ టెక్‌ పార్క్‌ లిమిటెడ్‌ పేరుతో అభివృద్ధి అవుతున్నది. కాలపరిమితిని, జగన్‌ దూరదృష్టిని పక్కన పెట్టేసి అంకెల గారడీతో ఈనాడు మాయ చేయడానికి ప్రయత్నించింది.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేవలం ప్రకటనలకే పరిమితమైన అదానీ గ్రూప్‌ ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం మద్దతుతో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నది. పోర్టులు, సిమెంట్‌ వంటి రంగాల్లో అదానీ గ్రూప్‌ ద్వారా రాష్ట్రంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టామని, భవిష్యత్తులో ఈ రంగాల్లో తమ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామని కరణ్‌ అదానీ ప్రకటించిన విషయాన్ని ఈనాడు కావాలనే విస్మరించింది.

ఐటీ కంపెనీల గురించి కాస్తా...

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో విశాఖకు ఒక్క పేరున్న ఐటీ కంపెనీ కూడా రాలేదనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి ఐటీ ఇన్‌ఫ్రాను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ప్రారంభించారు.

డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అదానీ గ్రూప్‌ భారీ ఐటీ టవర్‌ను నిర్మిస్తున్నది. రహేజా గ్రూప్‌ ఇనార్బిట్‌ మాల్‌ను నిర్మిస్తున్నది. దాంతో పాటు ఐటీ టవర్‌ను కడుతున్నది. ఏపిఐసీసీ రూ.2,300 కోట్ల వ్యయంతో మధురవాడలో 19 ఎకరాల విస్తీర్ణంలో ఐ స్పేస్‌ పేర ఐటీ టవర్‌ను నిర్మిస్తున్నది.

బీచ్‌ ఐటీ కాన్సెప్ట్‌తో ఆకర్షితులై ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సిఎల్‌, యాక్సెంచర్‌, రాండ్‌స్టాడ్‌, డబ్ల్యూఎన్‌ఎస్‌, అమెజాన్‌ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలన్నీ విశాఖవైపు అడుగులు వేస్తున్నాయి. వైఎస్సార్‌ హయాంలో పురుడుపోసుకున్న విప్రో సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధ‌మవుతున్నది.

ఐటీ పరిశోధనలు, అభివృద్ధిలో భాగంగా ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ సంస్థ చెగ్‌ విశాఖలో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించింది. భారతదేశంలో ఢిల్లీ తర్వాత విశాఖలోనే చెగ్‌ సంస్థ బ్రాంచ్‌ ఏర్పాటు కావడం విశేషం.

ఐటీ ఉద్యోగాల కల్పనలో వాస్తవాలు...

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అంటే 2014-19 మధ్యకాలంలో 24,350 ఐటీ ఉద్యోగాల కల్పన జరగగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో 29,500 ఐటీ ఉద్యోగాల కల్పన జరిగింది. రెండేళ్లపాటు కరోనా మహమ్మారి విజృంభన కొనసాగినప్పటికీ జగన్‌ ప్రభుత్వం ఈ ప్రగతి సాధించిందనేది గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చంద్రబాబు దిగిపోయేనాటికి 178 ఐటీ కంపెనీలు ఉంటే, ప్రస్తుతం 372 ఉన్నాయి.

విశాఖ లైట్‌ మెట్రో...

నాలుగు కారిడార్లలో 76 కిలోమీటర్ల మేర లైట్‌ మెట్రో తొలిదశ ప్రాజెక్టుకు రూ.14.309 కోట్లు వ్యయమవుతుందని అంచనా. పిపిపి విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ఉత్తర్వులో తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ను అందించడానికి కావాల్సిన డాక్యుమెంట్లను సిద్ధం చేసే పనిలో ఏపీ మెట్రో రైల్‌ కార్పోరేషన్‌ అధికారులు నిమగ్నమయ్యారు.

వాస్తవాలు ఇలా ఉండగా రామోజీరావు పత్రికకు పూర్తిగా పసుపు రంగు పులిమేసి తప్పుడు కథనాలను, అవాస్తవాలను రంగరించి వడబోశారు. పత్రికా విలువలను పాతాళానికి నెట్టేశారు.

First Published:  27 Jan 2024 10:55 AM GMT
Next Story