Telugu Global
Andhra Pradesh

టన్నుకు, మెట్రిక్‌ టన్నుకు తేడా తెలియదా రామోజీ..?

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్‌ జగన్‌పై బురదజ‌ల్లి, తన ప్రియమిత్రుడు నారా చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చే దురుద్దేశంతోనే రామోజీరావు ఈ కట్టుకథకు పునాదులు వేశారు.

టన్నుకు, మెట్రిక్‌ టన్నుకు తేడా తెలియదా రామోజీ..?
X

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రామోజీరావుకు చెందిన ఈనాడు ప‌త్రిక ప్ర‌భుత్వంపై దుష్ప్ర‌చారం చేస్తోంది. నిబంధనల‌ను గాలికొదిలేసి అక్రమాలు చేశారంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై బురదజ‌ల్లుతోంది. నియమనిబంధనల మేరకు జరుగుతున్న పనులను కూడా అక్రమం, అన్యాయమంటూ గొంతు చించుకుంటోంది. మంగంపేట బెరైటీస్‌ టెండర్లపై కనీసమైన విలువలను కూడా పాటించకుండా ఈనాడు కట్టుకథ అల్లింది.

మంగంపేట ముగ్గురాయి గనుల్లో భారీ దోపిడీకి తొలగిన తెర అంటూ ఓ తప్పుడు కథనాన్ని వండి వార్చింది. అన్నమయ్య జిల్లా మంగంపేట గనుల్లో ప్రతి యేటా 30 లక్షల టన్నుల బెరైటీస్‌ను ఎంపిఎండీసీ ఉత్పత్తి చేస్తోంది. అందులో సగటున 10 లక్షల టన్నులు ఏ గ్రేడ్‌, 3 లక్షల టన్నులు బీ గ్రేడ్‌ కాగా మిగిలిన 17 లక్షల టన్నులు సీ, డీ, డబ్ల్యూ (వేస్ట్‌) గ్రేడ్‌లు ఉంటాయి. డిమాండ్‌ తక్కువగా ఉండడంతో గత కొన్నేళ్లుగా సీ, డీ గ్రేడ్‌ ఖనిజాల నిల్వలు పేరుకుపోయాయి. ఇప్పటి వరకు 80 లక్షల టన్నుల సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్‌ బెరైటీస్‌ నిల్వలు పేరుకుపోయాయి, అవి అమ్ముడు పోలేదు. దాంతో దాని విక్రయానికి, బెనిఫికేషన్‌కు గతంలో పలుమార్లు టెండర్లను పిలిచారు. అయితే, సరైన స్పందన లభించలేదు. ఈ కారణంగా ఎంపిఎండీసీ వాటికి మళ్లీ టెండర్లను ఆహ్వానించింది.

మామూలుగా ఏటా 20 లక్షల టన్నుల సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్‌ ఖనిజానికి టెండర్లను పిలుస్తారు. అయితే, కొనుగోలుదారులు స్పందించలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏడాదికి 20 లక్షల టన్నుల చొప్పున ఐదేళ్లకు ఒకేసారి కోటి టన్నులకు టెండర్లు పిలిచారు. అయితే, ఈ వాస్తవాన్ని దాచిపెట్టి ఈనాడు ఒకేసారి కోటి మెట్రిక్‌ టన్నులకు టెండర్లు పిలిచారంటూ తప్పుడు రాత‌లు రాసింది. టన్నుకు, మెట్రిక్‌ టన్నుకు మధ్య తేడా తెలియని జర్నలిస్టులను రామోజీరావుగారు నియమించుకున్నారా అనే ప్రశ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

సీ, డీ గ్రేడ్‌ ఖనిజానికి రిజర్వు ధరను తగ్గించారంటూ ఈనాడు మరో తప్పుడు వ్యాఖ్యను జోడించింది. వాస్తవానికి రిజర్వ్‌ ధర నిర్ణయానికి సంబంధించిన 262 నెంబర్‌ జీవోను చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2017లోనే జారీ చేశారు. ఈ జీవోలోని నిబంధనల మేరకే ఇప్పుడు రిజర్వ్‌ ధరను ఖరారు చేశారు.

మినీరత్నగా కేంద్రం గుర్తించిన ఎంఎస్‌టీసీ టెండర్ల ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. కేంద్రం నిబంధనల ప్రకారమే ధరావత్తును నిర్ణయించారు. 17 రోజుల్లో టెండర్లను పూర్తి చేయాలనేది కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జరిగింది. టెండర్‌ డాక్యుమెంట్‌ ధరను ఖరారు చేసే క్రమంలో టెండర్‌ ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌, కన్నల్టెన్సీ చార్జీలు, ప్రిపరేషన్‌, కమ్యూనికేషన్‌ చార్జీలు, ఎంఎస్‌టీసీ చెల్లింపులకు అయ్యే మొత్తాన్ని లెక్కించి ధర నిర్ణయించారు. ఏ సంస్థ అయినా పాటించే ఈ విధానానికి ఈనాడు వక్రభాష్యం చెప్పింది.

న్యాయ సమీక్షకు పంపించలేదనే అబద్ధాన్ని చాలా సౌకర్యవంతంగా రాసింది. రూ.100 కోట్ల‌కు పైగా ఖర్చయ్యే ప్రాజెక్టును నిర్వహించే టెండర్లను మాత్రమే న్యాయసమీక్షకు పంపిస్తారనే కనీస విషయాన్ని కూడా ఈనాడు పట్టించుకోలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్‌ జగన్‌పై బురదజ‌ల్లి, తన ప్రియమిత్రుడు నారా చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చే దురుద్దేశంతోనే రామోజీరావు ఈ కట్టుకథకు పునాదులు వేశారు. తాను ఏం రాసినా చెల్లుతుందని, తనను అడ్డుకునేవారుండరని రామోజీరావు భావిస్తూ ఉండవచ్చు. కానీ, వాస్తవాలను గ్రహించే స్థితిలో ప్రజలున్నారనే విషయాన్ని ఆయన గమనించినట్లు లేదు.

First Published:  29 Jan 2024 11:54 AM GMT
Next Story