Telugu Global
Andhra Pradesh

రామోజీలో భయం మొదలైందా?

సీఐడి దర్యాప్తులో తాము పూర్తిగా ఇరుక్కుపోతామని రామోజీ భయపడుతున్నట్లే ఉంది. కాకపోతే తమను కాపాడాలని డైరెక్టుగా రామోజీ, శైలజ అడగకుండా అఖిల భారత చిట్ ఫండ్ సంఘాన్ని రంగంలోకి దింపారు. సంఘం సలహాదారుడు టీఎస్ శివరామకృష్ణన్ పేరుతో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌కు ఒక విజ్ఞప్తి అందించారు.

రామోజీలో భయం మొదలైందా?
X

అవినీతి, అక్రమాల్లో నుండి బయటపడేందుకు మార్గదర్శి ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఎండీ శైలజకు అన్నీ మార్గాలు మూసుకుపోతున్నట్లున్నాయి. అందుకనే కేంద్ర ప్రభుత్వం జోక్యాన్ని కోరుతున్నారు. సీఐడి దర్యాప్తులో తాము పూర్తిగా ఇరుక్కుపోతామని రామోజీ భయపడుతున్నట్లే ఉంది. కాకపోతే తమను కాపాడాలని డైరెక్టుగా రామోజీ, శైలజ అడగకుండా అఖిల భారత చిట్ ఫండ్ సంఘాన్ని రంగంలోకి దింపారు. సంఘం సలహాదారుడు టీఎస్ శివరామకృష్ణన్ పేరుతో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌కు ఒక విజ్ఞప్తి అందించారు. మార్గదర్శి మీద యాక్షన్ తీసుకోవటం అంటే చిట్ ఫండ్ సంస్థ‌ల‌ను దెబ్బతీయటమేనని సలహాదారుడు చెప్పటమే విచిత్రంగా ఉంది.

మార్గదర్శి మీద యాక్షన్ అంటే ఆ సంస్థ‌కు మాత్రమే పరిమితమ‌వుతుంది. మొత్తం చిట్ ఫండ్ వ్యవస్థపై యాక్షన్ తీసుకోవటమని సలహాదారుడికి ఎలా అనిపించిందో అర్థంకావటంలేదు. చిట్ ఫండ్ చట్టం-1982 ప్రకారమే మార్గదర్శి నియమ, నిబంధలను ఉల్లంఘించిందని, అవినీతికి పాల్పడిందని ప్రభుత్వం ఆరోపణ. దానిప్రకారమే సీఐడీ రంగంలోకి దిగి కేసులుపెట్టి విచారణ చేస్తోంది. ప్రభుత్వం ఆరోపణలు తప్పని, తాము నియమ, నిబంధల ప్రకారమే సంస్థ‌ను నడుపుతున్నామని నిరూపించుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం మీదుంది.

అలాకాకుండా ఎవరు ఫిర్యాదు చేయకపోయినా దాడులు ఎలా చేస్తారని, తమ సంస్థ‌ ఏటా ఇంత పన్నులు కడుతోందని వాదించటం వల్ల ఎలాంటి ఉపయోగముండదు. ఎందుకంటే అసలు మార్గదర్శి ఏర్పాటు, వ్యాపారమే అక్రమమని దశాబ్దాలుగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాదిస్తున్నారు. సంస్థ‌లో జరిగిన, జరుగుతున్న లావాదేవీలన్నీ అక్రమాలే అని ఉండవల్లి ఆధారాలతో సహా బయటపెట్టారు. మాజీ ఎంపీ ఆరోపణలకు రామోజీ ఇంతవరకు సమాధానం కూడా చెప్పలేదు.

నిబంధనలకు విరుద్ధంగా తాము నిధులను మళ్ళించినట్లు సీఐడీ విచారణలో ఎండీ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే చట్ట ఉల్లంఘనల కారణంగా తాము కేసుల ఊబిలో కూరుకుపోయామని అర్థ‌మైపోయిన తర్వాతే చిట్ ఫండ్ సంస్థ‌ల‌ సంఘాన్ని రామోజీ రంగంలోకి దింపినట్లు అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వం జోక్యాన్ని కోరటం అంటే సీఐడీ పరిధి నుండి తప్పించుకోవాలన్న ఆలోచనే కనబడుతోంది. మార్గదర్శి ఉల్లంఘనలపైన సీఐడీ విచారణ సరే అసలు ఉండవల్లి అడిగే ప్రశ్నలకు రామోజీ సమాధానాలు చెప్పగలరా?

First Published:  8 April 2023 4:40 AM GMT
Next Story