Telugu Global
Andhra Pradesh

వాలంటీర్ల వ్యవస్థపై రామోజీ, చంద్రబాబు మరోసారి అక్కసు.. ఎందుకంటే..

అక్కసు వెళ్లగక్కుతూ రామోజీరావు, చంద్రబాబు వాలంటీర్లను సాధ్యమైనంత మేరకు నైతికంగా దెబ్బ తీయాలనే కుట్ర‌లతో అబద్ధాలు గుప్పించడానికి సిద్ధపడ్డారు.

వాలంటీర్ల వ్యవస్థపై రామోజీ, చంద్రబాబు మరోసారి అక్కసు.. ఎందుకంటే..
X

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వాలంటీర్ల వ్యవస్థపై ఓ వైపు ఈనాడు రామోజీరావు, మరో వైపు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విషం చిమ్ముతున్నారు. వాలంటీర్లు చేయని మోసం, అకృత్యాలు లేవంటూ ఈనాడు దుమ్మెత్తిపోసింది. చంద్రబాబు వాలంటీర్లకు తాము వ్యతిరేకం కాదంటూనే ఆ వ్యవస్థపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ సమర్థంగా పనిచేస్తూ, సంక్షేమ పథకాల ఫలాలను ప్ర‌జ‌ల ఇంటి గుమ్మం ముందుకు అందించడానికి ఏర్పాటైంది. వారు సమర్థంగా ఆ పని చేస్తున్నారు. క్యూలు కట్టాల్సిన అవసరం లేకుండా, రేష‌న్ షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పేదలకు ఇంటి వద్దనే అన్నీ సమకూరుతున్నారు. దానివల్ల వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పట్ల గ్రామీణ ప్రాంతాల్లో సానుకూల వాతావరణం ఏర్పడింది.

వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అదే ప్లస్‌ పాయింట్‌ అవుతోంది. దాంతోనే అక్కసు వెళ్లగక్కుతూ రామోజీరావు, చంద్రబాబు వాలంటీర్లను సాధ్యమైనంత మేరకు నైతికంగా దెబ్బ తీయాలనే కుట్ర‌లతో అబద్ధాలు గుప్పించడానికి సిద్ధపడ్డారు. గతంతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడా వాలంటీర్ల మీద విరుచుకుపడ్డారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు,

గ్రామ వాలంటీర్ల నియామకం ద్వారా జగన్‌ యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా ప్రజలకు సేవలు చేసే ఒక పకడ్బందీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఓర్వలేని చంద్రబాబు, రామోజీ రావు ఆ వ్యవస్థను దెబ్బ తీయాలని కంకణం కట్టుకున్నారు. ఏ వ్యవస్థలోనైనా కొద్ది మంది అనైతిక కార్యకలాపాలకు, మోసాలకు, నేరాలకు పాల్పడవచ్చు. అటువంటివారిపై పోలీసులు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లలో ఎవరో ఒకరు తప్పు చేస్తే దాన్ని వ్యవస్థకే అంటగట్టడం అనైతికమూ, అన్యాయం కూడా.

వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్నారంటూ ఆధారం లేని ఓ విమర్శను ఎక్కుపెడుతున్నారు. వాలంటీర్లు ప్రత్యేకంగా జగన్‌ కోసం ఏదీ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు తమ సేవలు అందిస్తే చాలు. అదే జగన్‌కు ప్లస్‌ పాయింట్‌ అవుతుంది. ప్రజలు తమకు మేలు చేసే నాయకుడికి అనుకూలంగా ఉంటారనేది అందరికీ తెలిసిందే.

First Published:  7 Feb 2024 9:19 AM GMT
Next Story