Telugu Global
Andhra Pradesh

వర్మ, ఏంటీ ఖర్మ..? తిరుపతిలో దిష్టి బొమ్మ దహనం

వర్మ మాటలు విద్యార్థులకు అర్థమయ్యాయో లేదో కానీ, నాగార్జున యూనివర్శిటీ వీసీ రాజశేఖర్ మాత్రం బాగా ఇంప్రెస్ అయ్యారు. వర్మ ఓ ప్రొఫెసర్, ఓ ఫిలాసఫర్ కంటే ఎక్కువ అంటూ కీర్తించారు.

వర్మ, ఏంటీ ఖర్మ..? తిరుపతిలో దిష్టి బొమ్మ దహనం
X

స్కూల్, కాలేజీ, యూనివర్శిటీల్లో జరిగే కార్యక్రమాలకు ఎవరైనా విద్యావేత్తలను ఆహ్వానిస్తారు, వ్యక్తిత్వ వికాస నిపుణులతో నాలుగు మంచిమాటలు విద్యార్థులకు చెప్పిస్తారు. కానీ నాగార్జున యూనివర్శిటీలో జరిగిన అకడమిక్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అదేమీ తప్పుకాదు, కానీ ఆయన అక్కడ మాట్లాడిన మాటలే అభ్యంతరకరంగా ఉన్నాయి. కష్టపడి చదవొద్దు, మీకు ఇష్టం వచ్చింది చేయండి అంటూ హితబోధ చేశారు వర్మ. అంతే కాదు, చనిపోయిన తర్వాత స్వర్గంలో రంభ, ఊర్వశి ఉంటారో ఉండరో తెలియదని.. అందుకే భూలోకంలోనే అన్నీ అనుభవించాలని కూడా చెప్పారు. అక్కడితో ఆగలేదు. ఏదైనా వైరస్ వచ్చి ఈ భూమిమీద తాను తప్ప మిగతా మగాళ్లంతా చనిపోవాలని, అప్పుడు తానొక్కడినే ఆడవాళ్లందరికీ దిక్కవుతానని తలతిక్క వ్యాఖ్యలు చేశారు. పోనీ వర్మ సహజ గుణం అని వదిలేయొచ్చు, దానికి యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ వంత పాడటమే ఇక్కడ మరో హైలెట్.

వర్మ మాటలు విద్యార్థులకు అర్థమయ్యాయో లేదో కానీ, నాగార్జున యూనివర్శిటీ వీసీ రాజశేఖర్ మాత్రం బాగా ఇంప్రెస్ అయ్యారు. వర్మ ఓ ప్రొఫెసర్, ఓ ఫిలాసఫర్ కంటే ఎక్కువ అంటూ కీర్తించారు. చప్పట్లు కొట్టి అభినందించారు. దీంతో ఈ వ్యవహారం మరింత రచ్చగా మారింది. చాలామంది విద్యార్థులు, వారి పేరెంట్స్ వర్మ మాటల్ను, వాటికి వంతపాడుతూ వీసీ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. తాజాగా ఏబీవీపీ ఆధ్వర్యంలో తిరుపతి వెంకటేశ్వర యూనివర్శిటీ వద్ద నిరసన ప్రదర్శన జరిగింది. వర్మ దిష్టిబొమ్మను దహనం చేశారు విద్యార్థులు.

ఏంటీ ఖర్మ..?

రామ్ గోపాల్ వర్మ లాంటి వారిని యూనివర్శిటీకి పిలిచి విద్యార్థులకు హితబోధ చేయించాలనుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు ఏబీవీపీ నాయకులు. వర్మ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టారు. ఎస్వీ యూనివర్శిటీ ప్రాంగణం ముందు దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంటనే రామ్ గోపాల్ వర్మ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలను సమర్థించిన వీసి కూడా తప్పు ఒప్పుకోవాలన్నారు. వైసీపీకి మద్దతుగా మాట్లాడుతున్నారనే కారణంతోనే వీసీ ఆయన్ను ఏరికోరి యూనివర్శిటీకి తీసుకొచ్చారని విమర్శించారు. యూనివర్శిటీలో రాజకీయాలేంటని ప్రశ్నించారు.

First Published:  16 March 2023 10:31 AM GMT
Next Story