Telugu Global
Andhra Pradesh

మళ్లీ ట్విట్ట‌ర్‌లో రమణ దీక్షితులు తీవ్ర ఆరోపణలు

ఏపీ ఆలయాల్లో ఆగమ శాస్త్రాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఇక్కడి వ్యవహారాలు ఆగమ శాస్త్రం ప్రకారం కాకుండా కొందరు అధికారుల వ్యక్తిగత అభిరుచుల ఆధారంగా నడుస్తున్నాయని ట్వీట్ చేశారు. కేవలం వీఐపీల సేవలో టీటీడీ అధికారులు తరిస్తున్నారని ఆరోపించారు.

మళ్లీ ట్విట్ట‌ర్‌లో రమణ దీక్షితులు తీవ్ర ఆరోపణలు
X

తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఏదో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా ఉన్నారు. ఆవేశంతో ట్వీట్‌ చేయడం.. ఆ తర్వాత వాటిని తొలగించడం వంటివి ఈ మధ్య చేస్తున్నారు. తాజాగా మరోసారి తీవ్ర ఆరోపణలతో రమణ దీక్షితులు ట్వీట్ చేశారు.

ఏపీలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. ఏపీ ఆలయాల్లో ఆగమ శాస్త్రాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఇక్కడి వ్యవహారాలు ఆగమ శాస్త్రం ప్రకారం కాకుండా కొందరు అధికారుల వ్యక్తిగత అభిరుచుల ఆధారంగా నడుస్తున్నాయని ట్వీట్ చేశారు. కేవలం ధనికులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. వీఐపీల సేవలో అధికారులు తరిస్తున్నారని మండిపడ్డారు.

గత ఏడాది డిసెంబర్‌లోనూ రమణ దీక్షితులు తీవ్ర విమర్శలతో ట్వీట్లు చేశారు. తిరుమలలో అవినీతి రాజ్యమేలుతోందని గత నెలలో ట్వీట్ చేశారు. గతంలో ఒకసారి జగన్ తిరుమల పర్యటన సందర్భాల్లోనూ తన విజ్ఞప్తులపై స్పందించలేదన్న కోపంతో ట్విట్టర్‌లో రమణ దీక్షితులు విమర్శలకు దిగిన ఉదంతమూ ఉంది.

2018లో చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులకు రిటైర్‌మెంట్ ఇచ్చేసి ఆయన స్థానంలో వేణుగోపాల దీక్షితులను నియమించింది. దాంతో రమణ దీక్షితులు ఎన్నికలకు ముందు జగన్‌ను కలిసి మద్దతు ఇచ్చారు. జగన్‌ కూడా తాము అధికారంలోకి వస్తే తిరిగి ప్రధాన అర్చకుడిగా నియమిస్తామన్నారు. ఆ సమయంలో జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చారు రమణ దీక్షితులు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రమణ దీక్షితులను తిరిగి ఆలయ ప్రధాన అర్చకుడిగా నియమించడం సాధ్యం కాలేదు. అప్పటికే ప్రధాన అర్చకుడిగా ఉన్న వారిని తొలగించి రమణ దీక్షితులను నియమించేందుకు ప్రభుత్వం సాహసించలేదు. మధ్యే మార్గంగా రమణ దీక్షితులను ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడిగా నియమించింది. అప్పటి నుంచి రమణ దీక్షితులు వీలు చిక్కినప్పుడల్లా తనలోని బాధను ఇలా ట్వీట్ల రూపంలో పరోక్షంగా ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం ఉంది.

First Published:  29 Jan 2023 1:16 PM GMT
Next Story