Telugu Global
Andhra Pradesh

పిల్లి వైపే మొగ్గు చూపారా?

వచ్చే ఎన్నికల్లో కూడా మంత్రిని ఇక్కడే పోటీ చేయిస్తే.. పిల్లి, తోట ఏకమైతే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని అంచనా వేశారట. ఎందుకంటే పిల్లి, తోట ఇద్దరితోనూ మంత్రికి పడటంలేదు. అందుకనే టికెట్ పిల్లి కొడుక్కిచ్చి వేణును ఎమ్మెల్సీగా పంపాలని జగన్ అనుకున్నట్లు సమాచారం.

పిల్లి వైపే మొగ్గు చూపారా?
X

తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం వివాదం సెటిలైనట్లే ఉంది. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఎవరు పోటీ చేయాలనే విషయమై సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోసు మధ్య తీవ్రస్థాయిలో వివాదం రేగిన విషయం తెలిసిందే. మంత్రే పోటీ చేస్తారని జగన్మోహన్ రెడ్డి తరపున జిల్లా ఇన్‌చార్జి మిథున్ రెడ్డి చేసిన ప్రకటనతో వివాదం తారాస్థాయికి చేరింది. చివరకు జగన్ నిర్ణయంపై పిల్లి తిరుగుబాటే చేసేంతవరకు వెళ్లింది వివాదం.

అదే జరిగితే జరగబోయే నష్టాన్ని అంచనా వేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. పిల్లి, మంత్రి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మిథున్ అందరితోనూ చర్చించారు. వివాద పరిష్కారాన్ని తనకు వదిలేయాలని చెప్పి సర్దుబాటు చేసి పంపారు. రెండు రోజుల తర్వాత నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. పిల్లి వైపే జగన్ మొగ్గు చూపినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పిల్లి కొడుకు సూర్యప్రకాష్‌కు టికెట్ ఇవ్వాలని జగన్ అనుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి మంత్రిది రామచంద్రాపురం కాదు. రాజోలు ఎస్సీ నియోజకవర్గం అవటంతో స్టాప్ గ్యాప్‌గా వేణును రామచంద్రాపురంలో పోటీచేయించారంతే.

వచ్చే ఎన్నికల్లో కూడా మంత్రిని ఇక్కడే పోటీ చేయిస్తే.. పిల్లి, తోట ఏకమైతే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని అంచనా వేశారట. ఎందుకంటే పిల్లి, తోట ఇద్దరితోనూ మంత్రికి పడటంలేదు. అందుకనే టికెట్ పిల్లి కొడుక్కిచ్చి వేణును ఎమ్మెల్సీగా పంపాలని జగన్ అనుకున్నట్లు సమాచారం. దీనివల్ల రామచంద్రాపురం అటు మండపేట రెండు నియోజకవర్గాలను గెలుచుకోవచ్చని జగన్ ప్లాన్ చేశారట. రామచంద్రాపురానికి చెందిన తోటను జగన్ మండపేటలో పోటీ చేయించే ఉద్దేశంలో ఉన్నారు.

తోట త్రిమూర్తులు మండపేటలో పోటీ చేస్తే అప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. గవర్నర్ కోటాలో 2021 జూన్‌లో తోట ఎమ్మెల్సీ అయ్యారు. అంటే వచ్చే ఎన్నికల్లో మండపేటలో పోటీ కారణంగా రాజీనామా చేస్తే ఇంకా మూడేళ్ళ కాలపరిమితి మిగిలుంటుంది.. ఆ ఖాళీని వేణుతో ఫిలప్ చేయాలని జగన్ అనుకున్నారట. మొత్తానికి రామచంద్రాపురం నియోజకవర్గం వివాదాన్ని జగన్ అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధ‌తిలోనే డీల్ చేశారనే టాక్ పార్టీలో నడుస్తోంది. మరి ఎన్నికల నాటికి ఏమవుతుందో చూడాలి.

First Published:  28 July 2023 6:18 AM GMT
Next Story