Telugu Global
Andhra Pradesh

పవన్ నువ్వు ఎన్టీఆర్ కాదు, ఎంజీఆర్ కాదు.. జగన్‌పై పవన్ సెటైర్స్‌కు వర్మ కౌంటర్

పవన్ కళ్యాణ్ నువ్వు ఎన్టీఆర్ కాదు, ఎంజీఆర్ కాదు. నీకు ప్రజాసేవ అనే పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా లేదు. ఏదో ఒక రోజు మీ జన సైనికులు మీ నుంచి.. మీ మానసిక నార్సిజం నుంచి విముక్తి పొందాలని ఆశిస్తున్నా.

పవన్ నువ్వు ఎన్టీఆర్ కాదు, ఎంజీఆర్ కాదు.. జగన్‌పై పవన్ సెటైర్స్‌కు వర్మ కౌంటర్
X

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ముందుంటారు. జగన్ పై పవన్ విమర్శలు చేసిన ప్రతిసారి వర్మ జగన్ తరఫున పవన్ కు కౌంటర్ ఇస్తుంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్ పై సెటైర్లు వేస్తూ ఒక ట్వీట్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ట్వీట్ చూసిన వెంటనే రాంగోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు. తను కూడా పవన్ పై సెటైర్లు వేస్తూ ఒక ట్వీట్ చేశారు.

ముందుగా జగన్ ను ఉద్దేశించి పవన్ ఒక ట్వీట్ చేశాడు. మన ఏపీ సీఎంతో ఎవరైనా పాపం పసివాడు.. సినిమా తీస్తారని ఆశిస్తున్నాను. అతడు చాలా అమాయకుడు. ఇక్కడ ఒక చిన్న మార్పు మాత్రమే అవసరం. అతడి చేతిలో సూట్ కేస్ కి బదులుగా అతడి అక్రమ సంపద కోసం మనీ లాండరింగ్ ని సులభతరం చేసే బహుళ సూట్ కేస్ కంపెనీలను ఉంచండి.

ప్రియమైన ఏపీ సీఎం మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య లేదా కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి కాదు. మీరు అక్రమంగా సంపాదించిన సంపదతో.. ప్రజలపై విరుచుకుపడే హింసతో వర్గయుద్ధం అనే పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా మీకు లేదు. ఏదో ఒక రోజు రాయలసీమ మీ నుంచి, మీ అనుచరగణం నుంచి విముక్తి పొందుతుందని ఆశిస్తున్నా. పాపం పసివాడు సినిమా తీయడానికి రాజస్థాన్ ఎడారిలోని ఇసుక దిబ్బలు కావాలి. కానీ ఏపీలో నదుల ఒడ్డున ఇసుక లేకుండా వైసీపీ దోచుకుంది. అయినా కలెక్షన్ పాయింట్లలో తగినంత ఇసుక దిబ్బలు ఉన్నాయి. చీర్స్!!` అంటూ ప‌వ‌న్ ట్వీట్ చేశారు.

అయితే పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌కి రాంగోపాల్ వర్మ కూడా అదే స్టైల్ లో సమాధానం ఇచ్చారు. ఆయన పవన్ పై ట్వీట్ చేస్తూ ' మీ అమాయకత్వం మీద కూడా సినిమా తీస్తారని ఆశిస్తున్నా. మీరు అజ్ఞానంగా, అమాయకంగా ఉన్నందున ఎవరైనా మీతో కూడా ఈ సినిమా తీస్తారని అనుకుంటున్నా. ఇక్కడ ఒక చిన్న మార్పు మాత్రమే అవసరం. ఒక పాత్రను పోషించే బదులు.. ఒక పాత్రలో బహుళ వ్యక్తిత్వాలు పోషించాల్సి ఉంటుంది.

పవన్ కళ్యాణ్ నువ్వు ఎన్టీఆర్ కాదు, ఎంజీఆర్ కాదు. నీకు ప్రజాసేవ అనే పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా లేదు. ఏదో ఒక రోజు మీ జన సైనికులు మీ నుంచి.. మీ మానసిక నార్సిజం నుంచి విముక్తి పొందాలని ఆశిస్తున్నా. ఇక ఈ కథనానికి రాజస్థాన్ ఎడారిలోని ఇసుకదిబ్బలు కావాలి. కానీ కొన్ని థియేటర్ కలెక్షన్ పాయింట్లలో మీకు కొంతమంది అమాయక అనుచరులు ఉన్నందున వారి మనసులను దోచుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలపై అబద్ధాలు విసరడానికి మీకు హైదరాబాద్ అవసరం. చీర్స్!! అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

కాగా, జగన్ పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన ప్రతిసారి వర్మ సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తుండటంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అతడి పై మండిపడుతున్నారు. ఇప్పుడు కూడా వర్మ చేసిన ట్వీట్ కు దీటుగా బదులు ఇస్తూ తిట్ల దండకం అందుకున్నారు.

First Published:  17 May 2023 7:09 AM GMT
Next Story