Telugu Global
Andhra Pradesh

విశాఖ రైల్వే జోన్‌ సాధ్యం కాదన్న రైల్వే శాఖ.. కొలిక్కిరాని విభజన సమస్యలు

కేంద్ర హోం శాఖ నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కానీ ఏ ఒక్కదానికి కూడా పరిష్కారం లభించలేదు. ఏపీ రాజధాని కోసం మరో రూ. 1000 కోట్లు కావాలని అధికారులు కోరారు.

విశాఖ రైల్వే జోన్‌ సాధ్యం కాదన్న రైల్వే శాఖ.. కొలిక్కిరాని విభజన సమస్యలు
X

ఏపీ విభజన చట్టం - 2014లో పేర్కొన్న హామీ మేరకు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. కొత్త జోన్ ఏర్పాటు లాభదాయకం కాదని, అందుకే డీపీఆర్‌ను ఆమోదించలేదని రైల్వే బోర్డు అధికారులు తేల్చి చెప్పారు. ఏపీ, తెలంగాణ విభజన సమస్యల పరిష్కారానికి ఢిల్లీలో హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించారు. జోన్ సాధ్యం కాదని రైల్వే బోర్డు అధికారులు స్పష్టం చేయడంతో ఏపీ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. లాభాలు రాదనే విషయంతో చట్టంలో పేర్కొన్న హామీని ఎలా అమలు చేయరని ఆయన ప్రశ్నించారు. దేశంలో రాజకీయ కారణాలతో చాలా జోన్లు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా, రైల్వే జోన్ గురించి మీరు నిర్ణయం తీసుకోవద్దని.. ఆ విషయాన్ని కేంద్ర కేబినెట్‌కు పంపాలని రైల్వే బోర్డుకు సీఎస్ స‌మీర్ శ‌ర్మ సూచించారు.

కేంద్ర హోం శాఖ నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కానీ ఏ ఒక్కదానికి కూడా పరిష్కారం లభించలేదు. ఏపీ రాజధాని కోసం మరో రూ. 1000 కోట్లు కావాలని అధికారులు కోరారు. అయితే ఇప్పటికే ఇచ్చిన రూ. 1,500 కోట్లకు యూసీలు సమర్పించలేదని.. అవి ఇస్తే మిగిలిన నిధులు విడుదల చేసే అవకాశం ఉంటుందని కేంద్ర హోం శాఖ చెప్పింది. కాగా, రాజధానికి కేంద్రం రూ. 2,500 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే రూ. 1,500 కోట్లు విడుదల చేయగా.. మిగిలిన నిధులను ఏపీ అధికారులు విడుదల చేయాలని కోరారు. ఇక రాజధాని నిర్మాణానికి శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో సూచించినట్లు రూ. 29 వేల కోట్లు ఇవ్వాలని ఏపీ అధికారులు కోరగా.. కేంద్ర హోం శాఖ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. విద్యుత్ బకాయిల విషయం అసలు ఈ సమావేశంలో ప్రస్తావనకే రాలేదని తెలుస్తోంది.

కోర్టు కేసులు పరిశీలిస్తాం..

ఇరు రాష్ట్రాల అధికారులు పలు అంశాలను ప్రస్తావనకు తెచ్చినా.. కోర్టు కేసుల కారణంగా అవి పరిష్కారం కావట్లేదని కేంద్ర హోం శాఖ గుర్తించింది. దీంతో సంబంధిత కేసుల డాక్యుమెంట్లు అన్నీ పంపితే హోం శాఖ పరిశీలిస్తుందని అజయ్ భల్లా చెప్పారు. ఆస్తుల పంపకానికి సంబంధించిన కేసుల విషయంలో న్యాయ శాఖను సంప్రదిస్తామని ఆయన తెలిపారు. కాగా, ఏపీ అధికారులు జనాభా ప్రాతిపదికన 52:48 నిష్పత్తిలో ఆస్తులు పంచాలని డిమాండ్ చేసింది. ముఖ్యంగా షెడ్యూల్ 9 (కార్పొరేషన్లు), షెడ్యూల్ 10 (ఇనిస్టిట్యూషన్స్)లో గుర్తించిన వాటికి కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన భూములు, నిధులు ఉన్నాయి. హైదరాబాద్‌లో వీటికి సంబంధించిన భూముల్లో కూడా వాటా కావాలని ఏపీ డిమాండ్ చేసింది. కానీ తెలంగాణ అధికారులు మాత్రం ఇందుకు పూర్తిగా అభ్యంతరం తెలిపారు. హెడ్ క్వార్టర్స్ అనే పదం విషయంలో కోర్టులోకేసులు ఉన్నాయని, షీలాబిడే కమిటీ సిఫార్సుల అమలుకు వీలు లేదని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. షెడ్యూల్ 10లోని ఆస్తులు ఎక్కడున్నవి ఆ రాష్ట్రానికే చెందుతాయని, నగదు మాత్రమే జనాభా నిష్ఫత్తిలో పంచుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని తెలంగాణ అధికారులు గుర్తు చేశారు.

సింగరేణి సంస్థలో వాటా కావాలని అన్న ఏపీ అధికారుల ప్రతిపాదనను కూడా తెలంగాణ అధికారులు తోసిపుచ్చారు. సింగరేణిలో వాటా ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. చట్టంలోనే తెలంగాణకు 51 శాతం వాటా వాటా ఉందని, కాబట్టి సింగరేణి విభజన ప్రస్తావనే ఉండదని చెప్పారు. ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఇక దక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు చెందిన 5,000 ఎకరాల భూములతో పాటు ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు చెందిన 238 ఎకరాలలో వాటా కావాలని ఏపీ డిమాండ్ చేసింది. కాగా, ఈ రెండు సంస్థలకు ఇచ్చిన భూములు వాడుకోవడం లేదని 2015లో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. మరో వైపు తెలంగాణకు రావల్సిన రూ. 354 కోట్ల సబ్సిడీని కేంద్రం ఏపీకి పంపిందని, ఆ నిధులను ఇప్పించాలని కోరింది. కాగా, ఈ విషయంపై ఏపీ అధికారులు ఎలాంటి సమాధానం చెప్పలేదు.

ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ విభజన కేసులో కేంద్రానికి ఎలాంటి అధికార పరిధి లేదని న్యాయస్థానం ప్రకటించిన విషయాన్ని కూడా తెలంగాణ అధికారులు గుర్తు చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నది నీళ్ల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్ విషయంలో హోం శాఖ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్రం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, పోలవరం బ్యాక్ వాటర్‌తో భద్రాచలం సమీపంలో ముంపు జరుగుతున్న విషయం, ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం వంటి విషయాలు చర్చకే రాలేదు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రం వద్ద తమకు రావల్సిన వాటాలు, నిధుల గురించే ప్రస్తావించాయి. ఎప్పటిలాగానే రొటీన్‌గా సాగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలు తమ వాదనకే కట్టుబడ్డాయి. వీటికి సరైన పరిష్కారం చూపడంలో కేంద్రం మరోసారి విఫలమైందని చెప్పుకోవచ్చు.

First Published:  28 Sep 2022 1:40 AM GMT
Next Story