Telugu Global
Andhra Pradesh

పచ్చ మీడియా పైత్యమేనా.. రాహుల్ గాంధీ ఆ మాట అనలేదా.!

కాంగ్రెస్ పార్టీ ఎక్కడా రాహుల్ గాంధీ అమరావతి ఏకైక రాజధాని అని మాట్లాడినట్లు పేర్కొనలేదు. రాహుల్ వెంట నడిచిన ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కూడా ఈ విషయం చెప్పలేదు.

పచ్చ మీడియా పైత్యమేనా.. రాహుల్ గాంధీ ఆ మాట అనలేదా.!
X

భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ.. అమరావతి రాజధానికి మద్దతు పలికారని, అమరావతే ఏకైక రాజధాని అని వ్యాఖ్యానించారంటూ బుధవారం పలు మీడియా చానల్స్‌లో వార్తలు వచ్చాయి. కర్ణాటకలో పాదయాత్ర పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ.. నిన్న ఏపీలోని కర్నూలు జిల్లాలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల పేరుతో కొంత మంది రాహుల్ గాంధీని కలిశారు. వారితో కాసేపు భేటీ అయిన రాహుల్ గాంధీ.. ఆ తర్వాత తన పాదయాత్రను కొనసాగించారు. రైతులు తనను కలవడంపై గానీ, అమరావతి రాజధాని విషయం గానీ రాహుల్ గాంధీ ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, టీడీపీ అనుకూల మీడియా మాత్రం రాహుల్ అమరావతికి జై కొట్టారంటూ బ్రేకింగ్ న్యూస్‌లు వేసింది.

సాయంత్రం పవన్ కల్యాణ్ ఇష్యూ ప్రారంభమయ్యే వరకు రాహుల్ గాంధీ వార్తనే హైలైట్ చేశాయి. కాగా, ఏపీకి చెందిన రైతులు కొందరు రాహుల్ గాంధీని కలిసినట్లు కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రకటించింది. 'రాహుల్ గాంధీ ఆంధ్రా రైతులతో భేటీ అయ్యారు. అక్కడ వాళ్లు రైతు సమస్యల గురించి రాహుల్ వద్ద ప్రస్తావించారు. కొంత మంది రైతులు రాజధాని కోసం భూములు పోగొట్టుకున్నారని.. వారిలో చాలా మందికి తగినంత పరిహారం లభించలేదనే విషయం కూడా చెప్పారు. అమరావతికి కోసం భూములు ఇచ్చిన వారిలో కొంత మందికి పునరావాసం కల్పించలేదని తెలిపారు. రాహుల్ వారి మాటలు విన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు' అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియాలో వెల్లడించింది.

కాంగ్రెస్ పార్టీ ఎక్కడా రాహుల్ గాంధీ అమరావతి ఏకైక రాజధాని అని మాట్లాడినట్లు పేర్కొనలేదు. రాహుల్ వెంట నడిచిన ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కూడా ఈ విషయం చెప్పలేదు. కనీసం రాహుల్ మాట్లాడినట్లు వీడియో కూడా లేదు. కానీ టీడీపీ అనుకూల మీడియా మాత్రం రాహుల్ ఆ మాట అన్నారనే అబద్దపు వార్తలతో హోరెత్తించింది. ఒక వేళ పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు కలవకపోయి ఉంటే.. రాహుల్ వ్యాఖ్యలే మరి కొంత సేపు బ్రేకింగ్ న్యూస్‌లో కొనసాగించేవారనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. మొత్తంగా అమరావతి విషయంలో రాహుల్ పెద్దగా ఆసక్తి చూపలేదని.. కేవలం రైతు సమస్యలను పరిష్కరిస్తానని మాత్రమే చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

ఏపీలోని రైతు సమస్యలు, అమరావతి నిర్వాసితుల ఇబ్బందుల న్యాయపోరాటానికి సహాయం అందిస్తామని మాత్రమే రాహుల్ వ్యాఖ్యానించారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అమరావతి విషయంలో పెద్దగా ఆలోచించడం లేదు. ఏపీలో ఎలాగో పూర్తిగా బలహీనపడిన సమయంలో ఎలాంటి సమస్యలను కూడా భుజానికి ఎత్తుకోవడం లేదు. ఇలాంటి సమయంలో ఏపీకి సంబంధించి రాహుల్ గాంధీ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని.. అసలు అమరావతి ఇష్యూను రాసుకోవాల్సిన అవసరం రాహుల్‌కు లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.

కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తే రాహుల్ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్రలో అనేక పర్యాయాలు కేరళ, కర్ణాటకలో రైతులను కలిశారని.. ఇదే క్రమంలో ఏపీలోనూ రైతులను కలిసి వారితో ముచ్చటించారు. అంతే తప్ప ఆయన ప్రత్యేకంగా అమరావతి రైతులను కలవలేదని ఏపీ కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

First Published:  19 Oct 2022 4:22 AM GMT
Next Story