Telugu Global
Andhra Pradesh

రఘురామ కస్టడీ టార్చర్ కేసు.. సాక్ష్యాలు ఏమయ్యాయంటే..?

రెండేళ్లు పూర్తికావడంతో వైద్య నివేదికల ధ్వంసానికి అధికారులు ప్రభుత్వ అనుమతి కోరినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు రఘురామ తరపు న్యాయవాది. నివేదిక ధ్వంసం చేస్తే కీలక ఆధారాలు మాయమవుతాయని, వాటన్నింటినీ భద్రపరిచి కోర్టుకు ఇవ్వాల్సిందిగా కోరారు.

రఘురామ కస్టడీ టార్చర్ కేసు.. సాక్ష్యాలు ఏమయ్యాయంటే..?
X

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆమధ్య వాచిపోయిన కాళ్లు చూపిస్తూ, నడవడానికి ఇబ్బంది పడుతూ.. సీఐడీవాళ్లు నన్ను చిత్రహింసలు పెట్టారు మహాప్రభో అంటూ కోర్టులో చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఆ కేసు విషయంలో ఇప్పుడో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ కేసులో మెడికల్ రిపోర్ట్ లను ధ్వంసం చేసేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారంటూ రఘురామకృష్ణంరాజు మళ్లీ కోర్టు మెట్లెక్కారు. తన మెడికల్ రిపోర్ట్ లను ధ్వంసం చేయకుండా రక్షించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు లిఖితపూర్వక కౌంటర్లు దాఖలు చేయాలంటూ గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఆరోగ్యశాఖ కమిషనర్‍ కు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదావేసింది.

గుంటూరు ఆస్పత్రిలో గతంలో జరిగిన వైద్య పరీక్షల నివేదిక భద్రతపై రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. సీఐడీ కోర్టు జడ్జి ఆదేశాల మేరకు నివేదికలను భద్రపరచాలని పిటిషన్‌ లో ఎంపీ రఘురామ పేర్కొన్నారు. ఆయన తరపున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. కార్డియాలజీ, రేడియాలజీ వైద్యుల నివేదికలను భద్రపరచాలని న్యాయవాది కోరారు.

ఆధారాలు మాయమవుతాయి..

రెండేళ్లు పూర్తికావడంతో వైద్య నివేదికల ధ్వంసానికి అధికారులు ప్రభుత్వ అనుమతి కోరినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు రఘురామ తరపు న్యాయవాది. నివేదిక ధ్వంసం చేస్తే కీలక ఆధారాలు మాయమవుతాయని, వాటన్నింటినీ భద్రపరిచి కోర్టుకు ఇవ్వాల్సిందిగా న్యాయవాది కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. వెంటనే దీనిపై లిఖితపూర్వక కౌంటర్లు దాఖలు చేయాలని గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఆరోగ్యశాఖ కమిషనర్‍ కు ఆదేశాలిచ్చింది.

First Published:  8 Jun 2023 10:10 AM GMT
Next Story